ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
‘భగత్ సింగ్ యువజన ఉత్సవాలు’ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
యువత డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ-డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుంచి 23 వరకు నిర్వహిస్తున్న షాహిద్ భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘సే నో టూ డ్రగ్స్’ పేరుతో భగత్ సింగ్ యువజన ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడున్న యువత డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్‌ను అలవాటు చేసుకుని వారి జీవితాలని ఆగం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువత అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలన్నారు. సేవా కార్యక్రమాల్లో, క్రీడల్లో ముందుండాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, జావెద్, రాజయ్య, నరేందర్, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్‌కు యువత దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



