-రాయపోల్ ఎస్ఐ కుంచెం మానస…
నవతెలంగాణ- రాయపోల్
ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల యాంత్రికరణ జీవనంలో మనిషి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, శారీరక వ్యాయామం చేయడానికి సమయం లేకుండా పోతుందని మండల కేంద్రంలో ఉన్న ఓపెన్ జిమ్ ను యువత సద్వినియోగం చేసుకోవాలని రాయపోల్ ఎస్ఐ కుంచెం మానస అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న ఓపెన్ జిమ్ చుట్టూ పచ్చిగడ్డి, పిచ్చి మొక్కలు, ముళ్ళపొదలు పెరిగిపోవడంతో వాటిని స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో యువతకు వ్యాయామం కోసం గతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కానీ అది నిర్వహణలో నిర్లక్ష్యం వలన ఓపెన్ జిమ్ చుట్టూ పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు, ముళ్ళపొదలు వేపుగా పెరిగాయి. దానితో యువకులు వ్యాయామం చేయడానికి వీలు లేకుండా పోయింది. అలాగే ఇదే అదునుగా భావించి కొంతమంది ఆకతాయిలు ఓపెన్ జిమ్ వద్ద మద్యం సేవించడం, పొగ త్రాగడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే స్పందించి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ఓపెన్ జిమ్ చుట్టూ ప్రదేశం పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. ఓపెన్ జిమ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిమ్ లో వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటామన్నారు. కాబట్టి యువత ఓపెన్ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.