రాబిన్ ఉతప్ప, సోనూసూద్, నేహాశర్మలకు ఈడీ సెగ
మొత్తం రూ.7.93 కోట్ల ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ : బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, బాలీవుడ్ నటులు సోనూసూద్, నేహాశర్మ ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వారితో పాటు నటి ఉర్వశీ రౌతేలా తల్లితో పాటు టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రా ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసులో వారిని ఇప్పటికే ఈడీ విచారించగా.. తాజాగా రూ.7.93 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇందులో యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్లు, సోనూసూద్ ఆస్తులు రూ.1 కోటి చొప్పున ఆస్తులను అటాచ్ చేసింది. రాబిన్ ఉతప్ప (రూ.8.26 లక్షలు), నేహా శర్మ (రూ.1.26 కోట్లు), మిమి చక్రబోర్తి (రూ.59 లక్షలు), అంకుష్ హజ్రా ( రూ.47 లక్షలు), ఉర్వశి రౌతేలా తల్లి (రూ.2.02 కోట్లు) ఆస్తులను జప్తు చేసింది.
అక్టోబర్‌లోనూ మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఇడి అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అన్ని విషయాలు తెలిసే 1ఎక్స్‌బెట్ అనుబంధ సంస్థలు అయిన 1ఎక్స్‌బాట్, 1ఎక్స్‌బాట్ స్పోర్టింగ్‌లకు ప్రచారం చేశారని ఈడీ తెలిపింది. శిఖర్ ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల ఆస్తులను, సురేశ్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్‌లను జప్తు చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్‌ల కేసులో దాని సృష్టికర్తలు, సంస్థలను కాకుండా వాటికి ప్రచారం కల్పించిన వారిని కేంద్రం బెదిరింపు, బలి చేసే పనిలో పడిందని తెలుస్తోంది.



