శాంతి ప్రణాళికపై ట్రంప్
వాషింగ్టన్ : ఉక్రెయిన్ యుద్ధ నివారణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక ప్రస్తుతానికి అటకెక్కినట్లే కన్పిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తాను చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా చదవకపోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ప్రణాళిక అమలు విషయంలో ముందుకు సాగడానికి జెలెన్‌స్కీ సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఫ్లోరిడాలో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. ఉక్రెయిన్ ప్రతినిధులు తన ప్రతిపాదనపై సానుకూలంగానే స్పందించారని, కానీ జెలెన్‌స్కీ దానిని ఇంకా సమీక్షించలేదని ట్రంప్ విలేకరులకు చెప్పారు. ‘ప్రతిపాదనను జెలెన్‌స్కీ ఇంకా చదవకపోవడంపై నేను కొంత అసంతృప్తితో ఉన్నాను. ఆయన ప్రజలు దానిని ఇష్టపడుతున్నారు. కానీ ఆయనే సుముఖంగా లేరు’ అని అన్నారు. తన ప్రతిపాదన రష్యాకు సమ్మతమేనని అనుకుంటున్నానని, అయితే జెలెన్‌స్కీ వైఖరేమిటో తనకు తెలియడం లేదని తెలిపారు. యుద్ధం చాలా కాలం నుంచి కొనసాగుతోందని, అమెరికా ఇప్పటికే ఎంతో డబ్బు ఖర్చు చేసిందని, యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాగా ట్రంప్ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటి వరకూ అధికారికంగా ఆమోదించలేదు. ప్రణాళికలోని అనేక ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కావని ఆయన గత వారం చెప్పారు. రష్యాకు భూభాగాన్ని అప్పగించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు జెలెన్‌స్కీ ససేమిరా అంటున్నారు.
జెలెన్‌స్కీ అంగీకరించడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



