ఇది జెన్ ..జెడ్ జనరేషన్… రొటీన్ అస్సలు పడని తరం ఇది. ఏదైనా కొత్తగానే వుండాలి. అంతే త్వరగా బోర్ కొడుతుంది. ఎంత వేగంగా కొత్తదనాన్ని స్వాగతిస్తారో అంతే వేగంగా తమ అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు. అలా కొత్తగా వచ్చిన ట్రెండే ‘ఫేక్ మేరేజ్ ఈవెంట్స్’. ఆశ్చర్యంగా వుంది కదా! ఫేక్ పెళ్లేంటీ అని! అవును… అక్కడ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వుండరు. కానీ పెళ్లికి సంబంధించిన హల్దీ, మెహందీ, సంగీత్, బరాత్… ఇలా అన్ని ఫంక్షన్లు జరుగుతాయి. ఈ నయా ట్రెండ్ వైపు యువత మొగ్గు చూపుతుంది.
బర్త్‌డే పార్టీ, కిట్టీ పార్టీ, ఓణీల ఫంక్షన్… ఇలాంటివి వింటున్నాం కానీ ఫేక్ మేరేజ్ పార్టీ ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్. జెన్ జెడ్ తరానికి, అది కూడా ఫాస్ట్ కల్చర్‌కి అడ్డాగా మారిన ఢిల్లీ, ముంబరు, బెంగళూరు వంటి నగరాలకు చెందిన యువతను ఇప్పుడు ఈ ఫేక్ మేరేజ్ పార్టీలు ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లోనూ ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కి కూడా ఈ కల్చర్ వస్తోంది.
ఆ ఫంక్షన్లలో అంతా ఉత్సాహమే. కేరింతలతో యువత మొత్తం సందడి చేస్తారు. ఏర్పాట్లన్నీ సరిగ్గా జరుతున్నాయా, లేదా అన్న టెంక్షన్ అస్సలు వుండదు ఎవ్వరికీ. వచ్చామా… ఫంక్షన్ ఎంజారు చేశామా… వెళ్లామా…. అంతే!
ఫేక్ మేరేజ్ పార్టీ అంటే…?
ఇక్కడ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వుండరు. అసలు పెళ్లే జరగదు. బంధువుల ప్రస్తావన వుండదు. వచ్చిన వారికి అన్నీ అందుతున్నాయా? ఎరేంజ్‌మెంట్స్ అన్నీ సరిగా వున్నాయా అన్న టెంక్షన్ అస్సలుండదు. ఆహ్వాన పత్రిక అందాల్సిన అవసరం లేదు. వర్కింగ్‌డే లో సెలవు పెట్సాల్సి వస్తుందేమో అన్న సమస్య లేదు. వీకెండ్ మాత్రమే జరిగే ఈ పార్టీలకి టికెట్ మాత్రం కొనుక్కొని ట్రెడిషనల్ ప్లస్ ట్రెండీ దుస్తుల్లో ఆడవారైతే లెహంగా, హాఫ్‌శారీ, శారీ… మగవారైతే పైజమా కుర్తా, పట్టుపంచలతో…. అందంగా రెడీ అయి వెళ్తే చాలు. ఇష్టమైతే అక్కడ వున్నవారినే అక్క, బావ, అన్న, వదిన, అత్త, మామ, బాబారు పిన్నీ… లాంటి తాత్కాలిక వరుసలు కలుపుకుని ఆయా పాత్రల్లో ఒదిగిపోయి హల్దీ ఫంక్షన్‌లో వసంతం ఆడేయొచ్చు. మెహెందీకి నచ్చిన డిజైన్లతో చేతులను మరింత అందంగా చేసుకోవచ్చు. సంగీత్‌కి హోరెత్తించే డిజెతో అలసిపోయేంత వరకు అదిరిపోయే స్టెప్పులు వేయొచ్చు. అంతా అయ్యాక ఎవరిళ్లకు వారు వెళ్లొచ్చు.
ఈ ట్రెండ్ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదు… ఎవ్వరినీ కించపరచటం లేదు అంటున్నారు ఈ ఈవెంట్స్ నిర్వహించేవారు. ఎంజారు చేసేవారి మాట కూడా ఇదే. ఏ సినిమాకో, రెస్టారెంట్‌కో, పార్టీకో, పబ్‌కో వెళ్లినట్టుగానే టికెట్ కొనుక్కొని వెళ్లి, ఎంజారు చేసి తిరిగి వెళ్లిపోవడమే. ఈ ఫేక్ వెడ్డింగ్ పార్టీలకి ఒకరో ఇద్దరో విడివిడిగా వెళతారు. కొంతమంది స్నేహితులు కలిసి బృందంగా వెళ్లేవారూ వుంటారు. పైగా ఇక్కడ నచ్చిన ఫుడ్ ఎంచుకునే ఆప్షన్ కూడా వుంది. చెప్పాలంటే పెళ్లికి ఎవరైనా పిలిస్తే బాగుండు అని ఎదురుచూసే అవసరం కూడా లేదు. ఇక విదేశాల్లో అయితే మన పెళ్లిళ్లు అస్సలు వుండవు, చేసుకున్నా ఏ ఒకరో ఇద్దరో చేసుకుంటారు అంతే. అందుకే విదేశాల్లో కూడా ఈ ఫేక్ మేరేజ్ పార్టీ ట్రెండ్‌కి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
పైగా ఈ పార్టీల్లో అందమైన సెట్టింగులు వుంటాయి కాబట్టి మంచి ఫొటోలు, సెల్ఫీలు దిగొచ్చు. రీల్స్ తీసుకునేవాళ్ళకి ఇది మంచి ప్లాట్‌ఫాం అయిందంటున్నారు మరికొందరు.
చదువుల్లో కరోనా టెంన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ బాచ్‌లు వున్నట్లే… కరోనా పెళ్లి జంటలు కూడా వున్నాయి! ఎక్కువ మంది బంధుమిత్రులను పిలుచుకోలేక, ఏ ఫంక్షన్ కూడా సరిగా చేసుకోలేకపోయిన వాళ్లకు ఎక్కడో కొంత నిరుత్సాహం వుండి వుంటుంది కదా! ఆ పెళ్లి సరదాలన్నీ తీర్చుకోడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు కొంతమంది. సంప్రదాయ వాదులు ఇబ్బంది పడే అవసరమే లేదంటున్నారు ఈ ఈవెంట్లు నడిపే నిర్వాహకులు.
కుటుంబాలకు దూరంగా వుండి ఏ కుటుంబ ఫంక్షన్లకూ, పార్టీలకు వెళ్లటానికి వీలవని సందర్భాలే ఈ ఫేక్ మేరేజ్ పార్టీలకు నాంది అయింది అంటున్నారు ఈ ట్రెండ్‌ని తీసుకొచ్చిన నిర్వాహకులు. ఈ ఈవెంట్‌కి టికెట్లు బుక్ చేసుకోడానికి ఫేక్ వెడ్డింగ్ బుకింగ్ యాప్స్ కూడా వున్నాయి. మనకి నచ్చిన తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవడమే ఆలస్యం. ఈ టికెట్ల ధర కూడా మూడు వేల నుండి 15 వేల వరకు వుంటుందట. క్లబ్, హోటల్స్, ప్రయివేటు వేదికలు ఇలాంటి వేడుకలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
ఈవెంట్స్ : బరాత్, లైవ్ మెహందీ కార్నర్, వింటేజ్ షాదీ కార్, హల్దీ ఫొటో బూత్, నవాబీ ఫుడ్, లైవ్ కౌంటర్లు, సంగీత్ తరహాలో డీజే సెట్, ప్రొఫెషనల్ డిజెలు, లైవ్ ఢోల్, డ్రెస్ కోడ్.
యువత ఏమంటున్నారంటే : ఈ ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా నలుగురు పరిచయం అవుతారు. వర్క్ లైఫ్ నుండి ప్రెజర్ పోయి, మానసిక ప్రశాంతత లభిస్తోంది. మరోవైపు కుటుంబాలకు దూరంగా వుండి చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు అయినవాళ్లను మిస్సయిన ఫీలింగ్ పోతుంది అంటున్నారు.
బి.మల్లేశ్వరి
జెన్z ఫేక్ మేరేజ్ పార్టీ
- Advertisement -
- Advertisement -