Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంసామాన్యులకు సున్నా

సామాన్యులకు సున్నా

- Advertisement -

– సంపన్నుల కోసం హైస్పీడ్‌ సంస్కరణలు నిస్సారంగా..నిస్తేజంగా కేంద్ర బడ్జెట్‌
– రూ.53,47,315 కోట్లతో ప్రతిపాదన
– నిరుత్సాహపర్చిన నిర్మలమ్మ పద్దు
– వేతనజీవులకు దక్కని ఊరట
– వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి సహా కీలక రంగాలన్నింటికీ నిధుల కోత


నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులను వంచించింది. ఒకదాని తరువాత ఒకటిగా చోటుచేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్థిక సర్వే చేసిన హెచ్చరికలను సైతం బేఖాతరు చేసింది. కొద్దిమంది శత కోటీశ్వరుల కోసం యావత్తు దేశ ప్రయోజనాలను బలిపెట్టే ఉదారవాద ఆర్థిక సంస్కరణలను కొనసాగించింది. వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ఘనంగా చెప్పిన ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌’ నిర్దాక్షిణ్యంగా సగటుజీవి పైనుండి దూసుకెళ్ళింది. ఫలితం రూ.53,47,315 కోట్ల బడ్జెట్‌ సామాన్యులకు ‘సున్నా’ చుట్టింది. కార్పొరేట్లకు, శత కోటీశ్వరులకు రాయితీలు, వరాల వర్షం కురిపించినప్పుడు గుర్తురాని ఆర్థిక క్రమశిక్షణ కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, మధ్య తరగతి ప్రజానీకానికి, వెరసి దేశంలోని అసంఖ్యాక ప్రజానీకానికి ప్రయోజనాలు సమకూర్చాల్సి వచ్చినప్పుడు గుర్తుకు రావడం విచిత్రం! ఫలితంగా సామాన్యుడు కేంద్రంగా ఉన్న అన్ని రంగాల పథకాల్లోనూ ఆర్థిక కోతలు పడ్డాయి. చివరికి, మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించే ‘జెండర్‌ బడ్జెట్‌’కూ నిధుల కోత పెట్టడం మోడీ సర్కారు తీరుకు నిదర్శనం. దీంతో రానున్న రోజుల్లోనూ నిరుద్యోగం, అధికధరలు, జీవన వ్యయాలు పెరగడం, ఉపాధి కోత వంటి కష్టాలు తప్పవన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ నిరాశ తప్పలేదు. ఎన్నిమార్లు కేంద్రమంత్రులు, ప్రధానిని కలిసి ప్రాజెక్టులు ఇవ్వాలని ప్రాధేయపడి, విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఆర్థికవృద్ధిని వేగవంతం చేయగలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రతి కుటుంబం సమాజం, ప్రాంతం వృద్ధికి వనరులు, అవకాశాలు పొందేలా చూడటం అనే మూడు ‘కర్తవ్యాలు’, బాధ్యతలతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఆదివారం పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ ఆమె ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించగానే దేశంలోని స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 1,546.84 పాయింట్లకు, నిఫ్టీ 495.20 పాయింట్ల వద్ద పతనం కావడంతో దాదాపు రూ.10 లక్షల కోట్ల మదుపరుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పన్ను రాయితీలు, ప్రామాణిక తగ్గింపు మార్పులను ఆశించిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. సాంప్రదాయ వైద్య మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రధాన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా మూడు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ ఫార్మసీల అప్‌గ్రేడ్‌ను బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. ఆయుర్వేద ఆధారిత ఆరోగ్య సంరక్షణ, ఆయుష్‌ వ్యవస్థ కింద సేవలు మెరుగుపర్చడం, రోగులకు మెరుగైన ఔషధాల లభ్యత వీటి లక్ష్యమని వివరించారు. వైద్యం, పర్యాటకం కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రపంచ సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో భారతదేశ పాత్రను బలోపేతం చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీలో సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి మొదటి అడుగుగా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌లను పునర్నిర్మించాలని ప్రతిపాదించారు.



బడ్జెట్‌ నిర్ణయాలు
1. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్న కొత్త పన్నుల్లో ఏవైనా పన్ను మినహాయింపులు, కోతలు ఉండొచ్చని భావించినా.. బడ్జెట్‌లో అలాంటివేమీ ప్రకటించలేదు. అయితే, దేశంలో పెట్టుబడులు పెట్టి, క్లౌడ్‌ సర్వీసెస్‌ అందించే డాటా సెంటర్లకు మాత్రం సరళమైన పన్నులు విధించారు.
2. క్యాన్సర్‌ పేషెంట్లకు ఊరట కలిగిస్తూ, చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యావశ్యక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 17 రకాల ఔషధాల ధరలు తగ్గుతాయని చెప్పారు. అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మరో ఏడు కీలక ఔషధాలపై కూడా దిగుమతి సుంకాలు తగ్గుతాయి.
3. కొత్తగా వచ్చే టెక్నాలజీలపై సమీక్ష జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. సెమీ కండక్టర్ల తయారీ సహా, ఇతర సేవారంగాలకు ప్రోత్సాహకంగా ఐదేండ్లలో రూ.40 వేల కోట్లు కేటాయించారు.
4. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ సైన్యానికి రూ.2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే 21.84 శాతం అదనం. మొత్తం రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు.
5. వేగంగా, స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు తయారీ రంగం, ఇతర చిన్న పరిశ్రమలు వంటి ఆరు కీలక రంగాలకు ప్రోత్సాహం అందిస్తారు. ఇండియాను బయో గ్లోబల్‌ ఫార్మా హబ్‌గా మార్చేందుకు బయో ఫార్మా శక్తి మిషన్‌ పేరుతో ఐదేండ్లలో రూ.10 వేలకోట్లు కేటాయించారు.
6. మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేసి వస్త్ర తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఖాదీ, చేతి కళా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు మహాత్మాగాంధీ గ్రామ సమాజ్‌ పథకాన్ని ప్రకటించారు.
7. బ్యాంకింగ్‌ రంగాన్ని సమీక్షించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. విదేశీ మారక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, భారతీయ ఈక్విటీల్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు కూడా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
8. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు ఏడు హై స్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తారు.
9. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ (అరుదైన ఖనిజాలు) కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తారు. తమిళనాడు, ఏపీ, కేరళ, ఒడిశాల్లో ఈ కారిడార్లు ఏర్పాటవుతాయి.
10. మెడికల్‌ టూరిజంను ప్రోత్సహించేందుకు ప్రత్యేక హబ్స్‌ ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా ఆయుష్‌ కేంద్రాల పేరుతో ఐదు మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తారు.
11. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ బడ్జెట్‌లో 25.33 శాతం కేటాయింపులు పెంచారు. 2025-26లో రూ.304.98 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.382.22 కోట్లకు పెరిగింది.
12. పట్టణ ప్రాంతాల్లో పేదల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన పథకానికి 2025-26లో రూ.3,500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,000 కోట్లకు తగ్గించారు.
13. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు 50శాతం నిధుల కోత విధించారు. 2025-26లో రూ.5వేల కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.2,500 కోట్లకు తగ్గించారు.
దేశంలో వాతావరణ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో కాలుష్య నియంత్రణకు కేటాయింపులు తగ్గించారు. 2025-26లో రూ.1,300 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 1,091 కోట్లు కేటాయించారు.

పడిపోయిన ప్రభుత్వ ఆదాయం అత్యవసర వ్యయంలోనూ తగ్గుదల
కేంద్ర ప్రభుత్వ మూలధనం, రెవెన్యూ వసూళ్లు…రెండూ పడిపోయాయి. గత సంవత్సరపు మూలధనపు వసూళ్లను రూ.16.4 లక్షల కోట్లుగా అంచనా వేయగా సవరించిన అంచనాలలో రూ.16.2 లక్షల కోట్లుగా చూపారు. రెవెన్యూ వసూళ్లు అంతకంటే దారుణంగా పడిపోయాయి. రూ.34.2 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా వచ్చింది రూ.33.4 లక్షల కోట్లే. ఇదిలావుండగా ప్రభుత్వ వ్యయం కూడా తగ్గిపోయింది. మూలధనపు వ్యయం రూ.15.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయగా అది రూ.14 లక్షల కోట్లకు తగ్గింది. రెవెన్యూ వ్యయం రూ.39.4 లక్షల కోట్లు

ఉంటుందని అంచనా వేయగా రూ.38.7 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఆదాయం, వ్యయం పడిపోతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ రెండు పద్దుల కింద అధిక మొత్తాన్ని చూపేందుకు వెనుకాడడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.4 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఖర్చును తగ్గించి చూపించారు. వనరులను పెంచుకోవడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేకపోవడంతో తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రజలకు అత్యవసరమైన ముఖ్యమైన పథకాలకు పెద్దగా ఖర్చు చేయలేకపోయింది.

రీఫామ్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త శక్తి బడ్జెట్‌పై ప్రధాని మోడీ
కేంద్ర బడ్జెట్‌ 2026-27 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది. మూలధన వ్యయానికి, వృద్ధికి మధ్య కేంద్ర ఆర్థికమంత్రి సమతూకం పాటించారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మార్గనిర్దేశనం చేస్తుంది. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది”. ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు రీఫామ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇది.

కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్‌ ప్రజలకు, రాష్ట్రాలకు వ్యతిరేకం : సీపీఐ(ఎం) తీవ్ర విమర్శ
కార్మికులను, సమాజంలో సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలను, అలాగే దేశ విస్తృత ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టి కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు, కుబేరుల సంకుచిత ప్రయోజనాలను పెంచి పోషించేందుకు మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న రాజీలేని నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అని సీపీఐ(ఎం) విమర్శించింది. సంక్షోభాల దిద్దుబాటేది ?

ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్‌ : రాహుల్‌ గాంధీ
దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాల దిద్దుబాటును బడ్జెట్‌ విస్మరించింది. ”యువత ఉద్యోగాలు కోల్పోవడం, తయారీ రంగం పడిపోవడం, పెట్టుబడిదారులు మూలధనాన్ని వెనక్కితీసుకోవడం , కుటుంబ పొదుపులు పడిపోవడం, రైతులు ఇబ్బందులు, ప్రపంచదేశాల నుంచి పొంచి వున్న ముప్పు గురించి ప్రస్తావించలేదు.

ధరలు పెరిగేవి
విలాసవంతమైన వాచ్‌లు, ఆల్కహాల్‌, సిగరెట్లు, బీడిలు, పాన్‌ మసాలా, గుట్కా, కాఫీ రోస్టింగ్‌, వెండింగ్‌ యంత్రాలు,
అమోనియం ఫాస్ఫేట్‌, అమోనియం నైట్రో ఫాస్ఫేట్‌, చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు, ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100 శాతం పెంపు బహిర్గతం చేయని చరాస్థులపై ఇప్పుడు జరిమానా విధింపు ఫ్యూచర్స్‌-ఆప్షన్స్‌ ట్రేడింగ్‌

ధరలు తగ్గేవి
క్యాన్సర్‌ ఔషధాలు, అరుదైన వ్యాధులు , డయాబెటిక్‌ మందులు, విద్యుత్తు వాహనాల్లో వాడే ఇవి బ్యాటరీలు, సోలార్‌ ప్యానల్స్‌, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రో ఒవెన్స్‌, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు దేశీయంగా తయారయ్యే మొబైల్స్‌, ట్యాబ్‌లు , ఎనర్జీ ట్రాన్సిషన్‌ పరికరాలు క్యాపిటల్‌ గూడ్స్‌, క్రిటికల్‌ మినరల్స్‌ అణు విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -