Saturday, September 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅడవిబిడ్డల ఆత్మీయుడు జియా సార్‌

అడవిబిడ్డల ఆత్మీయుడు జియా సార్‌

- Advertisement -

సెప్టెంబర్‌ 7న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆదిలాబాద్‌ నుండి అసిఫాబాద్‌ బస్సులో ప్రయాణం చేస్తూ ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగానే జియాసార్‌కు జోహార్లు అర్పిస్తూ బత్తుల లెనిన్‌ పోస్టు కంటపడింది. బస్సులో ప్రయాణి స్తుంటే కామ్రేడ్‌ జియావుద్దిన్‌తో జ్ఞాపకాలు 30 ఏండ్ల వెనక్కు భద్రాచలం డివిజన్‌లోకి తీసుకెళ్లాయి. సుదీర్ఘకాలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి చింతూరు, విఆర్‌పురం, భద్రాచలం రూరల్‌ మండలాల్లో ఆయన పనిచేసిన కాలం, ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన ఆదివాసీ పిల్లల కోసం చేసిన సేవలు, నాతో అనేకసార్లు గంటలసేపు చేసిన చర్చలు, సంభాషణలు కండ్లముందు మెదలాడాయి. చాలా విషయాలు మేమిరువురం షేర్‌ చేసుకునేవారం. నన్ను అమితంగా ప్రేమించేవారు. చాలా ముక్కుసూటిగా, అంతకు మించి నిజాయితీగా వ్యవహరించేవారు. ఆయనలోని భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో 1996లో కామ్రేడ్‌ శ్యామల వెంకటరెడ్డి హత్యకు గురైనప్పుడు గమనించాను. ఆరోజు ఆఫీసుకు వచ్చి నన్నుగట్టిగా పట్టుకొని ఇది అత్యంత దుర్మార్గం, అన్యాయం. ఆయన ఇక వుండడు అంటే జీర్ణించుకోలేకపోతున్నాను. అంటూ బోరున ఏడ్చారు. విధి నిర్వహణలో ఎంత కఠినంగా వ్యవహించేవారో అంత సునిశితత్వం కూడా ఉండేది. ఆయన కొత్తూరు నారాయణపురంలో పనిచేసినప్పుడు ఆ గ్రామం డివిజన్‌ కేంద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు తరచూ కలుసుకునేవాళ్లం.

నేను ఆయన్ను జనరల్‌గా జియా అని సరదాగా అనేవాడిని. ”పాకిస్థాన్‌ మిలిటరీ నియంత పేరు నాకు తగిలించావు. మా వాళ్లందరు కూడా నన్ను అలాగే పిలుస్తున్నారు. నేను నియంతనా?” అని నవ్వుతూ అడిగేవారు. ”ఆ నియంతతో మీకు పోలిక లేదు కానీ, పట్టిన పట్టు విడవరు కదా! గట్టిగా వ్యవహరిస్తారు కదా! అందుకే వారందరికీ ఆ పేరు ఇష్టమై ఉంటుంది ” అనేవాడిని.
స్కూల్‌ పిల్లలు ఆయనలో తండ్రిని చూసుకునేవారు. ముఖ్యంగా ఆయన దగ్గర చదువుకున్న ఆడపిల్లలు పెద్దవాళ్లై వారి పెండ్లిండ్లకు పిలిచేటప్పుడు మీరూ, మేడం తప్పకుండా రావాలని ఫోన్‌లో కోరినప్పుడు, ఆయనకు రావటానికి కుదరకపోతే పెండ్లి తేదీ కూడా మార్చుకుంటాము అన్నప్పుడు ” లేదు బిడ్డా! తప్పకుండా వస్తాను ”అనేవారు. ఇందుకు కారణం ఎక్కడ ఆశ్రమ పాఠశాల పడావు పడినా అక్కడికి జిల్లా కలెక్టర్‌ లేదా ఐటిడిఎ పిఓ పంపడం వల్ల జియాకి ట్రబుల్‌ షూటర్‌ అని పేరుపడింది. ప్రత్యేక అభ్యర్థన మేరకు ఒరిస్సా సరిహద్దు గూడూరు గ్రామం స్కూల్‌ బాధ్యత తీసుకుని పిల్లల సంఖ్యను 7 నుండి 170 మందికి పెంచారు.

సోములగూడెం ఆశ్రమ గిరిజన బాలికల హైస్కూల్‌లో 120 నుండి 875 మంది పిల్లల సంఖ్యను పెంచారు. పిల్లలకు మంచి పౌష్టికాహారంతో కూడిన మెనూ అమలు జరిపేవారు. వారి ఆరోగ్యం, వసతులపట్ల ప్రత్యేక శ్రద్ధ కనపర్చేవారు. ఆయనను రోల్‌మోడల్‌గా చూపిస్తూ ఐటిడిఎ పి.ఓ. మిగిలిన అన్ని పాఠశాలల్లో ఇలా మెనూ ఎందుకు అమలు చేయరు? అని సమావేశాల్లో నిలదీసేవారు. వాళ్లందరికీ ఇదొక పెద్ద సవాలుగా మారేది. భద్రాచలం పార్లమెంటు సభ్యులు మిడియం బాబూరావుని, నన్ను వారి స్కూల్‌కు పిలిపించి అక్కడి కార్యక్రమాలు వివరించారు. ‘మీ కృషికి ఒక ఎంపీగా నేనేమి ఇవ్వగలను అని నవ్వుతూ అడిగితే, మా స్కూల్‌ అభివృద్ధిలో మీ ఎంపీ నిధుల భాగస్వామ్యం కూడా ఉండాలి’ అని బాలికల ఆశ్రమ హైస్కూల్‌లో ఒక కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయింపజేసు కున్నారు. కాంట్రాక్టర్‌ ప్రమేయం లేకుండా తనే పర్యవేక్షణ చేసి నాణ్యతగా నిర్మించుకున్నారు.

నేను భద్రాచలం డివిజన్‌ సెంటర్‌ బాధ్యతల్లో వున్నప్పుడు నేను, కుంజా బొజ్జి , సున్నం రాజయ్య, జియా 1998లో నల్లగొండలో రాష్ట్ర పార్టీ మహాసభ సందర్భంగా ప్రతినిధిగా కలిసి పాల్గొన్నాము. పోలవరం ఉద్యమానికి తాను అక్కడున్న సమయంలో చురుకుగా సహకరించారు. తర్వాత నేను 2007లో జిల్లా కేంద్రానికి వచ్చేనాటికి జియా రిటైరై తన స్వగ్రామానికి వచ్చారు. 2008 పాలేరు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు పార్టీ నిర్మాణ బాధ్యతల్లోకి వచ్చారు. తిరుమలాయపాలెం మండలం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన కార్యదర్శి బాధ్యతలను చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు వెనుకాడకుండా ఆ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించి, ఉద్యమాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రత్యేకించి గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలంలో నిరంతరం పేద పిల్లలకోసం ఆదివాసుల కోసం తపించిన జియాకి ఆయన జీవిత సహచరి మేడం ముస్తరీబేగం కూడా మారుమూల అటవీ ప్రాంతానికి వచ్చి ఆయనకు తోడుగా నిలిచారు. ఆ పిల్లలు పెద్దయినప్పటికీ నేటికీ సొంత పిల్లల వలె ఆ పిల్లలు, అమ్మమ్మ, తాతయ్య అంటూ పలకరిస్తుంటారు.

చనిపోయే ముందు రోజు వరకు జియా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. మన భావజాల పోస్టు కనపడితే తప్పకుండా స్పందించి, కామెంట్‌చేసే చైతన్యాన్ని నిరంతరం ప్రదర్శించారు. ఆయన మిలిటెన్సీకి ఉదాహరణ ఏమంటే చింతూరు మండలం, మోతుగూడెంలో ఒక యూటిఎఫ్‌ కార్యకర్తను అన్యాయంగా అక్కడి ఎస్‌ఐ చేయి చేసుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా చింతూరులో ఉపాధ్యాయులందరూ ధర్నాకు దిగి, భద్రాచలం నుండి డిఎస్పీ స్వయంగా వచ్చి ఎస్‌ఐతో క్షమాపణ చెప్పించి కేసు విత్‌డ్రా చేసే వరకు వదిలిపెట్టలేదు. బండి నర్సింహారావు, నాగమల్లేశ్వర రావు, పండా క్రిష్ణయ్య, బి. క్రిష్ణారావు, మహబూబ్‌అలీ, ఆంజనేయులు తదితరులు ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఐటిడిఎ కేంద్రంగా పాల్వంచ, భద్రాచలంలలో సమరశీల పోరాటాలు నిర్వహించారు. తాను ఇప్పటికీ నాడు పనిచేసిన, నేడు ఆంధ్రాలో కలిసిన పోలవరం ముంపు మండలాల ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం ఆందోళన చెందేవారు. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించటానికి బాల,బాలికలను ప్రోత్సహిం చారు. జియా మన మధ్య లేరు. కానీ, ఆయన స్ఫూర్తి ఉంది. ఇప్పుడున్న జనరేషన్‌ జియా నుండి చాలా నేర్చు కోవాలి. ఆయన నిరంతర శ్రమజీవి. ఆచరణ శీలి. ఆదివాసీ పక్షపాతి. మిలిటెంట్‌ పోరాట యోధుడు. సునిశిత విమర్శకుడు. అభిప్రాయాలు దాచుకోని, రాజీలేని వ్యక్తి. ఆదర్శ ఉపాధ్యాయుడు. 2015 తర్వాత జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సందర్భంగా జడ్‌పిలో చాలా పదునుగా ప్రజా సమస్యలను ప్రస్తావించి జిల్లా అధికారులను నిలదీశారు. ఇలా అన్ని బాధ్యతల్లోనూ తనదైన ముద్రవేశారు. తన కుమారుడు జావిద్‌ను ఎస్‌ఎఫ్‌ఐలో ప్రోత్సహించటమే కాకుండా ఇప్పుడు నవతెలంగాణ ఖమ్మం రీజియన్‌ మేనేజర్‌గా ఉన్నందుకు, తనకు సహకరించే జీవిత భాగస్వామి లభించినందుకు మేడం గురించి చాలా గర్వపడేవారు. వారి బాటలో నడవటమే మనం వారికి అర్పించగలిగే నిజమైన నివాళి.

బండారు రవికుమార్‌
9490098090

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -