బెంగళూరు : ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును భారీగా పెంచింది. గతంలో కంటే 20 శాతం పెంచి రూ.12కు చేర్చింది. ఈ కొత్త ఫీజులు సెప్టెంబర్ 2 నుంచి అన్ని నగరాల్లో అమల్లోకి వచ్చాయి. ఇంతక్రితం ఈ ఫీజు రూ.10గా ఉంది. డెలివరీ ఫీజులు, పన్నులు, రెస్టారెంట్ ధరలు కాకుండా జొమాటో ప్రత్యేకంగా వసూలు చేసే ఫ్లాట్‌ఫామ్ ఫీజును 2023లో తొలిసారి ప్రవేశపెట్టింది. అప్పుడు కేవలం రూ.2గా నిర్ణయించింది. దీన్ని క్రమంగా పెంచుతూ పోతోంది. 2024లో రూ.4కు, అక్టోబర్ 2024లో ఏకంగా రూ.10కు చేర్చింది. తాజాగా మరోసారి పెంచింది. ఈ సంస్థ రోజుకు దాదాపు 25లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఒక్కో ఆర్డర్‌పై రూ.2 పెరిగినా ఒక్క త్రైమాసికం ఆదాయం అదనంగా రూ.45 కోట్లు పెరగనుంది. ప్లాట్‌ఫామ్ విస్తరణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫీజులను పెంచాల్సి వస్తోందని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మరో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఇటీవల రుసుంలను పెంచడం ద్వారా రూ.14కు చేర్చింది.