Magazines

జీఓలూ కంచెలే సీయెమ్మ్ సాబ్‌!

1 గంట క్రితం

GOs and barricades,
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 5 నిమిషాల చదవడం

‘‘కంచెలు బద్దలు కొట్టేశాం!’’ ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది కదూ! పోనీ ఇది వినండి. ‘‘మాది ప్రజా ప్రభుత్వం!’’ ‘‘ఇది ప్రజాపాలన!’’ ఆ..! మీరనుకునేది కరెక్టే! ఆ మాటన్నది తెలంగాణ ముఖ్యమంత్రే! సదరు ఆర్భాటానికి మూడేండ్లు పూర్తి కావస్తోంది. (1969 నాటి) తెలంగాణ ఉద్యమంపై రావిశాస్త్రి ఒక పత్రికకు లేఖరాస్తూ ‘‘పల్లకి మోసే బోయీలకు పల్లకీలో వర్మగారున్నా, శర్మగారున్నా ఒకే రకమైన బరువు మోయవలసి వుంటుందని... ప్రత్యేక తెలంగాణ వచ్చినంత మాత్రాన్నే దోపిడీ అంతం కాదని’’ రాశారు. ఆ తర్వాత కాలంలో ‘ఓ ఆంక్ష‍ ఓ అరెస్టూ’ అనే వ్యాసంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్దలు చేసింది వర్గ ద్రోహం కాదు కాబట్టి రాజద్రోహం కూడా కాదని’’ రావిశాస్త్రి గారే అన్నారు. ఎంత ముందుచూపు! అప్పుడు మంత్రి పదవులు, గవర్నర్‌ గిరీలే పంచుకున్నారు. ఇపుడు రాష్ట్రమే సాకారమయ్యింది. ఒకాయన తానే తెచ్చానని, ఇంకొకాయన తామే ఇచ్చామని పోటాపోటీ నడిచింది. తెచ్చానన్న ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లూ కనీస వేతనాలు పెంచలేదు. రెండవదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసి కార్మికోద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు. ఆర్టీసీ కార్మికులకు ఎమర్జెన్సీ రోజుల్ని రుచి చూపించాడు. ‘గడీల’ పాలనను బద్దలు కొట్టానన్న రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పాలన సోగుతోంది.

మన చర్చంతా రావిశాస్త్రి చెప్పిన పల్లకీ బోయీల గురించే! ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సరిగ్గా ఒక రోజు ముందు జీఓ నంబరు 6 విడుదలైంది. అందులో కనపడే ఒకట్రెండు గులాబీ పూలను చూసి అది గులాబీ తోటని భ్రమపడే ట్రేడ్‌ యూనియన్‌ నాయకులున్నారు. ఆ జీవో ఒక ముళ్ళ కంపనే విషయం గుర్తించడం లేదు. ముందు ‘పూల’ గురించి రెండు ముక్కలు. కనీస వేతనాల పరిధిలోకి మరో పది రంగాలను చేర్చడం మంచి విషయమే. అవీ, నేడు విస్త్రతంగా పెరుగుతున్న రంగాలు కావడం కీలకమైన విషయం. అవి కొరియర్‌ సర్వీసులు, పబ్లిక్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌, రెడీమిక్స్ కాంక్రీట్‌ కేంద్రాలు, ఎల్‌పీజీ సిలిండర్‌ ఏజెన్సీలు, వంటి వాటితోపాటు 1970 బెంగళూరు వాటర్‌ వర్స్స్ కేసులో జస్టిస్‌ క్రిష్టయ్యర్‌ తీర్పులో రాసినట్టు గుడులు, చర్చీలు, మసీదుల కార్యాలయాల సిబ్బందిని కూడా కలిపినందుకు సంతోషం. ఇక్కడ మరో వివరణ అవసరమేమో! ఆ కార్యాలయాల్లోని సిబ్బంది కనీస వేతనాలేనా? పూజార్లూ, శఠగోపాలు పెట్టే వారి సహాయకులు, చర్చీల్లో పాస్టర్లు దీనిలో కవర్‌ అవుతారో, వారిని ఎండోమెంట్స్ డిపార్ట్ మెంటుకి, వక్ఫ్ చట్టం కిందికి వదిలేస్తారేమో తెలియదు. ధూప, దీప నైవేద్య పథకం కింద అర్చకుల జీవనభృతి కిందనో, అర్చక సంక్ష‍ేమ నిధి ఇస్తారో తెలియదు. ఏమైనా ఇవన్నీ కనీస వేతనాల కేటగిరీ కిందికి రావు. జోన్‌ -1, జోన్‌ -2ల్లోని ప్రయివేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్స్ లో లక్ష‍ల్లో కార్మికులున్నారు. జీఓ 6 ద్వారా సవరించిన వేతనాలనైనా అమలుచేయాలి. చాలా కార్పొరేట్‌ ఆసుపత్రులలో కార్మిక సంఘాలనే అనుమతించని స్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం సరిచేయాలి.

2019 వేజ్ కోడ్‌లోని సెక్ష‍న్‌ 8(1)(ఎ) ప్రకారం కార్మికులు ఎక్కువగా పనిచేసే (లేబర్‌ ఇంటెన్సివ్‌) మరియు పీస్‌రేట్‌ కార్మికుల కనీస వేతనాలు విడిగా వేరే కమిటీ ద్వారా నిర్ణయిస్తా రట! దీనిలో 9+ రకాల కార్మికులున్నారు. ఇక్కడ ‘+’కు చాలా విలువుందండోయ్‌! ఏ పీస్‌ రేట్‌పై ఆధారపడ్డ, ఏ కంపెనీ కార్మికులనైనా, ఎప్పుడైనా ఏలినవారు ఈ 9వ కేటగిరీలో కలపొచ్చు అని దీని అర్థమని కూడా జీఓ నెం.6లో స్పష్టీకరిం చారు. పైగా ఇప్పటిదాకా కనీస వేతనాలు నిర్ణయం చేయ బడ్తున్న పవర్‌లూమ్స్ గార్మెంట్స్ (దుస్తుల తయారీ మరోప్లస్‌) సంబంధిత తయారీ పరిశ్రమలు, స్పిన్నింగ్‌ మిల్లులు, ఇటుక బట్టీలు, బీడీ పొగాకు పరిశ్రమలున్నాయి. వీటికితోడు పైన పేర్కొన్న పరిశ్రమల కార్మికులు కనీస వేతనాల పరిధి నుండి బయటికి గెంటివేయబడ్డారు. ఈ సంఖ్య మన రాష్ట్రంలో లక్ష‍ల్లో వుంటుంది.

ఇంకొక పెద్ద ముండ్లకంప

నెల జీతం నిర్ణయించడానికి ‘స్కిల్‌’ వర్గీకరణ చేశారు. వాస్తవానికి ఇదీ పాతదే! అన్‌స్కిల్డ్, సెమీస్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా గతం నుండి ఉన్న వర్గీకరణే. గత ప్రభుత్వాల కాలంలో (బహుశా కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో) ఆనాటి ఎ.పి.ని మూడు జోన్లుగా విడగొట్టారు. కార్మికోద్యమం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆనాటి పాలకులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నేడు ‘గడీల పాలన’ను దెబ్బతీసిన వీరుడిగా విర్రవీగే రేవంత్ రెడ్డి సర్కార్‌ మళ్ళీ తెలంగాణని 3 జోన్లుగా విడగొట్టింది. కార్పొరేషన్ల జోన్‌ -1, మున్సిపాలిటీ జోన్‌-2 , గ్రామీణ ప్రాంతాల జోన్‌-3. అమలుకు కొన్ని షరతులు అనే 5వ పాయింటులో కొత్తదనం ఏమీ లేదు. ‘రాముడు మంచి బాలుడు’ అనే మంచి, మంచి పాయింట్లే రాశారు. అయితే విషయమేమంటే, ఈ ‘రాముడు’ ఎప్పుడూ మంచిబాలుడు కాదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, ఆడ, మగ, ట్రాన్స్జెండర్స్ అందరికీ సమాన వేతనం ఇవ్వాలనీ, శెలవు రోజుల్లోగానీ, వీక్లీ ఆఫ్‌లో పనిచేస్తే కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాలనీ, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించేలా చూడటం ప్రధాన యజమాని బాధ్యతేనని రాశారు.

ఇప్పుడున్న కాంట్రాక్టు లేబర్‌ (రెగ్యులేషన్‌ అబాలిషన్‌) చట్టంలోని సెక్ష‍న్‌ 21 ప్రకారం ప్రధాన యజమాని ఒక సమర్థ అధికారిని కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించే సందర్భంలో అక్కడే ఉంచాలని, ఆ అధికారి ముందే కాంట్రాక్టరు వేతనాలు చెల్లించాలనీ, సబ్‌ సెక్ష‍న్‌ 4 ప్రకారం కాంట్రాక్టరు వేతనం చెల్లించకపోయినా, తక్కువ చెల్లించినా ప్రధాన యజమానే (ప్రిన్సిపుల్‌ ఎంప్లాయర్‌) చెల్లించాలని చట్టంలో రాసి వున్నా కాంట్రాక్టు కార్మికుల బతుకులు ఎందుకిలా ఉన్నాయో అందరికి తెల్సిందే! పెద్దపులిని నువ్వు గడ్డి మాత్రమే తినాలని ఎవరైనా శాసించగలరా!? చట్టాలు ఎప్పట్నించో ఉన్నాయి. అమలు చేసే నాధుడే కరువు. నా వ్యక్తిగత అనుభవం చెప్పాలిక్కడ. శ్రీశైలం హైడల్‌ ప్రాజెక్టులో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు డ్యామ్స్, ప్రాజెక్టులకు సంబంధించిన జీఓ 107 (2013) అమలు చేయాలని సీఐటీయుగా ఆనాడు మన వాదన. కాదని కార్మిక శాఖ కమిషనర్‌ వాదన. అనేక ‘కేస్‌లా’లని జోడించి ప్రిన్సిపల్‌ సెక్రటరీ (లేబర్‌) గారికి అందించి మనవాదన చెప్పాం. ఆయన అంగీకరించి జీఓ 107 అమలు చేయమన్నారు. అయినా అది అమలుకాలేదు (కారణాలు బహిరంగంగా రాయలేము). అందుకని చట్టం అమలుచేయాలనే సూక్తులు చెప్తే ఉపయోగమేమిటి? అందుకే ‘రాముడు’ మంచి బాలుడు సూత్రం నిరుపయోగం అన్నది! కొత్తదనం ఏమీలేని డంబాచారమెందుకు? పాత విషయాలు తెలీని కార్మికులకు ‘చందమామ’ను దింపి జేబుల్లో పెడుతుందేమో రేవంత్‌రెడ్డి సర్కార్‌ అనిపించుకోడానికా? లేదా ‘భక్తుల’ భజనలు మిన్నంటడానికి కావచ్చు.

కార్మికుల జీతంపై దాడి!

ఆయా పరిశ్రమల్లోని యూనియన్లు, వాటి శక్తి, యాజమాన్యాలతో బేరసారాల శక్తి వంటి వాటితో సంబంధం లేకుండా గుండు గుత్తగా పరిశ్రమలున్న ప్రాంతాన్ని బట్టి వేతనాల నిర్ణయం చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం కార్మికుల వేతనాలపై దాడే! దీన్ని ప్రతిఘటించేందుకు రాష్ట్ర కార్మికవర్గం ముందడుగు వేయాలి. మరో ముఖ్యమైన విషయం పరిశ్రమ ఉన్న ప్రాంతాన్ని బట్టి వేతనాలు నిర్ణయించేటట్లయితే అనేక పరిశ్రమలు గ్రామాల్లో ఉన్నాయి. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని చాలా పరిశ్రమలు ఓఆర్‌ఆర్‌కి బయటున్నవి.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో జోన్‌ 3, జోన్‌ 2లో ఉండగా అత్యధిక మంది కార్మికులు పటాన్‌చెరు, ఆర్‌.సి.పురం, కేపీహెచ్‌బీ వరకు అనేక కార్పొరేషన్‌ డివిజన్లలో నివాసముం టున్నారు. వీరి జీవన వ్యయం ఎక్కువ. మరి ఎవర్ని కాపాడ్డానికి ఈ జోనల్‌ వ్యవస్థ. ఇదే పరిస్థితి అనేక జిల్లాల్లో ఉంది. జీఓ 6లోని అనేక కేటగిరీ కార్మికులకు సంబంధించి గందరగోళం ఉంది. షెడ్యూల్‌-2లో 31వది బీడీ కాకుండా టొబాకో తయారీ అని రాసి, షెడ్యూల్‌-3లో 143 గంపవాలా (తయారైన సరుకును) ముడి సరుకును మోసుకెళ్లేవారు, 144లో బీడీ సార్టర్లు అనుంది. దీని భావమేమి తిరుమలేశా?! సెమీ స్కిల్డ్‌లోని 149 పట్టు పురుగుల లింగ వైవిధ్యాన్ని గుర్తించి విడగొట్టే దాన్ని కనీసం స్కిల్డ్ కేటగిరీలోకి మార్చాలి. ఎందుకంటే ఆడో, మగో గుర్తించడానికి అవి కుక్కలో పిల్లులో కాదు కదా! రైల్వే డిపార్టుమెంటుకు చెందిన ఇంజన్‌ డ్రైవర్లను, టీఎక్స్ఆర్‌లను, గార్డులను, రైల్వే ప్లేట్‌ లేయర్స్ ను కనీస వేతనాల కేటగిరీలో (స్కిల్డ్ లో) (5) (22) (27) (45)లుగా పేర్కొన్నారు. ఇటువంటి జీవోలు దేశమంతా ఇచ్చారా? రైల్వేను తెలంగాణలో ప్రయివేటైజ్‌ చేస్తారా? విద్యుత్‌, మైన్స్ వంటి రంగాలకు ఇటువంటి ప్రమాదం పొంచి వుందేమోననిపిస్తుంది.

పైగా అనేక కేటగిరీలను విడివిడిగా ఎన్నో రాసి మ‌ళ్లీ 220లో ‘టెక్నికల్‌ పర్సన్స్’ అన్నారు. ఎవరీ టెక్నికల్‌ పర్సన్స్? 310లో ‘ఏ పేరుతో పిలిచినా ‘స్కిల్డ్ ’ కార్మికులైనవారు’ అని ఉంది. ఇన్ని కేటగిరీల కార్మికులను ‘జీఓ 6’లో కవర్‌ చేశామని చెప్పుకోడానికా అన్నట్టు లేదా?! ఈ జీఓ పక్కాగా వేరే రాష్ట్రం వారిది కాపీ కొట్టిందేమోననే అనుమానం షెడ్యూలు-2లోని 50 ‘ఉప్పు కొఠార్లు’ అనేది చూస్తే అర్థమవుతుంది. సమ్రుదమేలేని రాష్ట్రంలో ఉప్పు కొఠార్లెక్కడి నుండి వస్తాయి? ‘పలకల పరిశ్రమ’ తెలంగాణలో ఎక్కడుంది? ఉమ్మడి రాష్ట్రంలో మార్కాపురంలో విపరీతంగా ఉంది. తెలంగాణలో ఈ రెండు పరిశ్రమలూ ఎక్కడున్నాయో రాష్ట్ర కార్మిక శాఖా మంత్రిగారో, కార్మిక శాఖవారో చెప్పాలి. అలానే ‘క్రెచ్‌’లు ఎక్కడున్నాయో తెలీదుగాని, క్రెచ్‌లో పనిచేసే ఆయాల వేతనం గురించి జీఓ 6 మాట్లాడటం కార్మికోద్యమాన్ని ఎగతాళి చేయడమే!

‘‘తాళము వేసితిని, గొళ్లెం మరిచితిని’’ అన్న ‘యమగోల’ డైలాగు గుర్తుకొస్తుంది. జీఓ 6లో మంచో, చెడో కొన్ని విషయాలు పేర్కొని, ‘సులభతర వ్యాపారం’ పేర కార్మిక శాఖనే నిర్వీర్యం చేశారు. ఆ మాత్రమైనా ఈ అంశాలు అమలయ్యేదెక్కడ? అమలు చేసే వారెవరు? కార్మికులకు దిక్కేమిటి? శ్రీశ్రీ బాట పట్టడమే!

‘‘మాకు గోడలు లేవు.. గోడలను పగులగొట్టడమే మా పని
అలజడి మా జీవితం.. ఆందోళన మా ఊపిరి

తిరుగుబాటు మా వేదాంతం

ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నాముందు దారి మాది!’’


ఆర్‌. సుధాభాస్కర్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్