Magazines

ఉస్మానియా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

1 గంట క్రితం

Osmania Hospital.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

జూనియర్‌ డాక్టర్ల సమస్యల్ని పరిష్కరించాలి : సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ లేఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, జూనియర్‌ ‌డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉస్మానియాకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా పేద, మధ్యతరగతి రోగులు వైద్య సేవల కోసం వస్తున్నారని గుర్తుచేశారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు, మందుల కొరత, పారిశుధ్యం, తదితర సమస్యల పరిష్కారం కోసం జూనియర్‌ ‌డాక్టర్లు సమ్మెకు దిగాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రెండేండ్ల నుంచి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాకపోవడంతో వైద్యపరికరాలు, మందుల సరఫరాను సప్లయర్లు, వెండర్లు నిలిపేశారని తెలిపారు. దీంతో కార్డియాలజీ విభాగంలో స్టంట్లు వేయడం, క్యాథ్ ల్యాబ్ సేవలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయని వాపోయారు. ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేసి శస్త్రచికిత్సలు, క్యాథ్ ల్యాబ్ సేవలను పునరుద్ధరించాలని కోరారు.

ఆస్పత్రిలోని ఎక్స్-రే, ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్, ఎండోస్కోపీ యంత్రాలు సరిగా పనిచేయట్లేదనీ, ఆర్థోపెడిక్స్ విభాగంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కీళ్ల మార్పిడికి కావాల్సిన ఇంప్లాంట్లు అందుబాటులో లేవనీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వెంటిలేటర్లు సరిగా పనిచేయడంలేదని ఎత్తిచూపారు. వాటికి మరమ్మతులు చేయించడంగానీ, కొత్త పరికరాలు అమర్చడంగానీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పేద రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అన్ని రకాల మందులను ఉచితంగా నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఆస్పత్రి నిర్వహణ దెబ్బతినడమే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులపై తీవ్ర పనిభారం పడుతున్నదని తెలిపారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ, క్లినికల్ శిక్షణ, విభాగాల పనితీరును సరిదిద్దాలని డిమాండ్‌ ‌చేశారు. జూనియర్‌ ‌డాక్టర్లకు బకాయి ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలనీ, స్టైపెండ్‌ను పెంచాలని కోరారు. రోగులకు, సిబ్బందికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనీ, పారిశుధ్య వసతులు కల్పించాలని విన్నవించారు. నూతన ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జూన్‌‌లో తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను సర్వే చేసి, సమస్యలను తమ దృష్టికి లేఖల ద్వారా తెలిపినా నేటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఎత్తిచూపారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్