Magazines

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌‌కు ఎసరు

1 గంట క్రితం

Rythu DISCOM
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

రైతన్నకు ఉరి వేసే కాంగ్రెస్‌ తీరును సహించం
జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి : మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ 17 జీవోను జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనమని తెలిపారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరి వేసేందుకేనా ఈ కుట్ర?అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఒక ప్రకటనలోప్రశ్నించారు. వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు డిస్కం పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర ‌చేస్తున్నదని విమర్శించారు. రైతు డిస్కం జీవోను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

రేవంత్‌‌ సర్కార్‌ ‌రాజకీయ చదరంగం

ఇప్పటికే ట్రాన్సఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదనీ, రైతు డిస్కంతో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని హరీశ్‌‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ​పంటలు ఎండి రైతు కన్నీరు పెడుతుంటే డిస్కంల పేరిట రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతున్నదని విమర్శించారు. జీవో ప్రకారం కొత్త డిస్కం పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, జలమండలి, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కంకి బదిలీ చేశారని వివరించారు. భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం రెండు వేల మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. కేవలం 25 శాతం థర్మల్ పవర్ అలకేషన్‌తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరమయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుందని అడిగారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? అని ప్రశ్నించారు. జలవిద్యుత్‌ సాంకేతికంగా ఏడాదిలో కేవలం ‌మూడు, నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. మిగతా ఎనిమిది నెలలు రైతు డిస్కంకి ఈ విద్యుత్ అందుబాటులో ఉండబోదని పేర్కొన్నారు. అప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

​రైతు డిస్కంపై అప్పుల భారం

రైతు డిస్కంకు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోందని హరీశ్‌‌రావు అడిగారు. ఈ అప్పుల భారం చివరకు రైతులపై పడేయాలని చూస్తున్నారా?అని ప్రశ్నించారు. రైతు డిస్కం పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, నష్టాల సాకుతో రైతులపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా?అని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పేరుతో డిస్కం ఏర్పాటు గొప్ప కాదనీ, నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యమని తెలిపారు. సంస్థల పేర్లు మార్చడం, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కాదనీ, రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌‌ చేశారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ఎందుకు ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా చాటు మాటుగా జీవో జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని అడిగారు.

​గురుకులాల్లో కేంద్రీకృత టెండర్లను రద్దు చేయాలి

రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. పాత పద్ధతిలోనే పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుని, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ (డీపీసీ) ద్వారా స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని కోరారు. పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న వేలమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తును కాపాడటంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయని తెలిపారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం దుర్మార్గమని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇస్తూ జిల్లాకు రూ.రెండు కోట్ల చొప్పున రూ.66 కోట్ల గుడ్‌విల్, బిల్లుల్లో ప్రతినెల 20 శాతం కమీషన్లు నొక్కేస్తూ పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని తెలిపారు. స్థానిక వెండర్లు ఇచ్చే ధరల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరకు కాంట్రాక్ట్ ఖరారు చేసినా నేటికీ హాస్టళ్లకు సరుకులు ఇవ్వలేని చాతకానితనం కాంగ్రెస్ సర్కార్‌దని విమర్శించారు. పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే, బాధిత కుటుంబాలు, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్