Magazines

సింగరేణి లాభాల్లో కార్మికుడి వాటా రూ.1,53,912

1 గంట క్రితం

Singareni profits
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

ఒక్కో కాంట్రాక్టు కార్మికుడికి రూ.5,500 దసరా బోనస్‌
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
బీఆర్ఎస్ సింగరేణి పోరు బాట హాస్యాస్పదం : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‎సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగులకు లాభాల వాటా కింద ఒక్కొక్కరికి రూ.1,53,912, కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 దసరా బోనస్‌ చెల్లించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌‌లోని ‎ప్రజాభవన్‌లో మంగళవారం మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి సింగరేణిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లడుతూ మొత్తం 38,737 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. ఈ ఏడాది సింగ‌రేణి ఆర్జించిన 1,754 కోట్ల నిక‌ర లాభాల్లో 34 శాతం అంటే రూ.596 కోట్లను లాభాల వాటాగా కార్మికుల‌కు పంపిణీ చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. సింగరేణి ఆద్వర్యంలో రామగుండంలో థర్మల్ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 300 డిపెండెంట్ ఆర్డర్లు, ఇతర లీగల్ ప్రాసెస్‌లను 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కరోనా సమయంలో విధులకు హాజరుకాక ఉద్యోగాల నుండి తొలగించబడిన కార్మికుల విషయంలో వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్టు తెలిపారు. విధులు నిర్వహించకుండా సమ్మెకు పిలుపునిచ్చిన లేదా సమ్మెలో పాల్గొన్న అధికారులపై, దానికి నాయకత్వం వహించిన వారిపై నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. సింగరేణి వద్ద ప్రస్తుతం ఉన్న 1250 ఎకరాల భూమిలో జీవో నెంబర్ 76 ప్రకారంగా అర్హులకు ఇండ్ల స్థలాల ( మొదటిపేజీ తరువాయి ) పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

శిథిలావస్థలో ఉన్న డీ టైప్‌ ‌క్వార్టర్లను కూల్చేసి నెహ్రూ కాలనీలను నిర్మిస్తామని చెప్పారు. బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల స్థానికంగా నివాసం ఉంటే ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు తెలుపుతున్నందున, ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి స్థలం కేటాయిస్తామని తెలిపారు. ​గత సర్కార్‌ ‌వల్లే లాభాలు తగ్గాయి. ​గత బీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌నిర్వాకం వల్లే సింగరేణి లాభాలు తగ్గాయని భట్టి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో సంస్థను పాల్గొనకుండా చేయడం వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్ -3, మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌, నైని వంటి బ్లాక్‌లను సాధించామన్నారు. మహానది, కోల్‌ ఇండియా, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ వంటి సంస్థలు తక్కువ ధరలకు బొగ్గును అందిస్తున్నాయని వివరించారు. గత పదేండ్లలో సింగరేణికి విద్యుత్‌ సంస్థల నుంచి రూ.29 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లలో రూ.27 వేల కోట్లు పెరిగాయన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొత్తాలను దశలవారీగా చెల్లించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.


శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ...‎
సింగరేణి సంస్థను భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌... ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి పరిష్కరించలేని సమస్యలను ప్రతిపక్షంలో ఉండి ఎలా పరిష్కరిస్తారో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌మూడేండ్ల పాలనలో 3,189 కొత్త ఉద్యోగాలు, 2,437 కారుణ్య నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. సర్కార్‌ ‌చేసిన పనుల స్వాగతించాల్సింది పోయి రాద్దాంతం చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేం సాగర్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణ రావు, విజయరమణారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్క‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్