Magazines

అభ్యుదయవాది శ్రీశ్రీ కుమార్

50 నిమిషాల క్రితం

Sri Sri Kumar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రగతివాది, ప్రజా సమస్యలపై నిరంతరం రచనలు చేసిన వ్యాసకర్త, టీచర్స్ జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన శ్రీ రామకవచం శ్రీనివాస సుబ్రమణ్య కుమార్ (శ్రీశ్రీ కుమార్) గత నెల సెప్టెంబర్ 27న గుండెపోటుతో కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన ఇంగ్లీష్‌లో ఉన్నత విద్యతో పాటు బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్‌, జర్నలిజంలో బీసీజే, ఎంసీజే పూర్తి చేశారు. 1989లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి ఏన్కూరు, చింతూరు, భద్రాచలం తదితర గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా పనిచేశారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో ఓఎస్డీగా, చివరగా హయత్‌నగర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించి 2024 జూన్‌లో పదవీ విరమణ చేశారు. ఉపాధ్యా యుల సమస్యలపై ఉద్యమించడంతో పాటు విద్యారంగ సంస్కరణల కోసం కృషి చేశారు. విద్యారంగ సమస్యలపై టీవీ చర్చల్లో పాల్గొని తన అభిప్రాయాలను బలంగా వినిపించారు. 2020 నుంచి మరణించే వరకు ఉద్యోగుల సమస్యలు, నీటిపారుదల, విద్యారంగంపై పాలకుల నిర్లక్ష్యం, రైతుల సమస్యలు, జెన్‌జి ఉద్యమం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తదితర సమకాలీన అంశాలపై వందలాది వ్యాసాలు రాశారు.

పేదరికం, నిరక్షరాస్యత, బాలికల విద్య వంటి సామాజిక సమస్యలపైనా ఆయన రచనలు సాగాయి. నమస్తే తెలంగాణ, మన తెలంగాణ పత్రికల్లో శ్రీశ్రీ కుమార్ పేరుతో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా సమకాలీన అంశాలపై నవతెలంగాణకు ఆయన రాసిన ప్రత్యేక వ్యాసాలు విస్తృత పాఠకాదరణ పొందడంతో పాటు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. నవతెలంగాణతో ఆయనకు ఏర్పడిన ఈ రచనా అనుబంధం ఆయన జర్నలిస్టిక్‌ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. అనేక ఇంగ్లీష్ పుస్తకాలు, కవితలను తెలుగులోకి అనువదించిన ఆయన రచయిత గానే కాకుండా ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు, విద్యావేత్తగా కూడా తనదైన ముద్ర వేశారు. సమాజ మార్పును ఆకాంక్షించిన అభ్యుదయవాది, ప్రజా సమస్యలపై నిరంతరం కలం ఎక్కుపెట్టిన శ్రీశ్రీ కుమార్ సేవలు చిరస్మరణీయం. నేడు కోదాడలో జరిగే సంస్మరణ సభ సందర్భంగా శ్రీశ్రీ కుమార్‌కు ఘన నివాళి.

- పుప్పాల కృష్ణమూర్తి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్