Magazines

బోగస్‌ ‘సర్‌...’

1 గంట క్రితం

Bogus ‘Sir’.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

బోగ‌స్‌.. బోగ‌స్‌.. బోగ‌స్‌.. అంతా బోగ‌స్‌... స‌ర్ ప్ర‌క్రియ‌పై దేశ‌వ్యాప్తంగా దుమ్ము దుమారం రేగుతున్న వేళ‌.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకున్న వేళ‌... మ‌న రాష్ట్రంలో మ‌రో వివాదం చెల‌రేగుతోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలోగాని, ఆ త‌ర్వాత తెలంగాణలో గాని... మ‌న అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లో విధాన స‌భ‌, విధాన ప‌రిష‌త్తు అనే ప‌దాలే లేవు. స్ప‌ష్టంగా చెప్పాలంటే ఇవి ఉత్త‌రాదివారు వాడే ప‌దాలు. మ‌నం వాడే ప‌దాలు శాస‌న‌స‌భ‌, శాస‌న ప‌రిష‌త్తు. కానీ, మోడీ స‌ర్కారు తెచ్చిన స‌ర్ ప్ర‌క్రియ పుణ్య‌మానీ... విధాన స‌భ‌, విధాన ప‌రిష‌త్తు అనే ప‌దాలు... ఇప్పుడు ఫారం-7 ప‌త్రాల‌పై ముద్రించి ఉండ‌టం, వాటిని బీఎల్‌వోలు ఉప‌యోగించ‌టంతో రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగింది. వీటిని మ‌న రాష్ట్రంలోనే ముద్రించారా? లేక ఇత‌ర రాష్ట్రాల్లో ముద్రించి మ‌న మీదికి వ‌దిలారా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అంతేకాదు... విధానసభ నంబరు... విధానసభ పేరు... బూత్‌ నంబరు.. బూత్‌ పేరు అని టైప్‌ చేసి ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. చాలా నియోజకవర్గాల్లోని బూత్‌లకు ఇదే పద్ధతిలో బోగస్‌ ఫారం-7 పత్రాలు పంపిణీకి సిద్ధంగా ఉంచిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌ర‌గ‌టం మ‌రింత ఆందోళ‌న‌క‌రం. వీటిని ఎవరు పంపిణీ చేస్తున్నారనేది దాన్ని కూడా ఢిల్లీని ఏలుతున్న పార్టీ వారు ర‌హ‌స్యంగానే ఉంచుతున్నారు. కాగా రాష్ట్రంలోని ఒక వర్గాన్ని మాత్ర‌మే లక్ష్యంగా చేసుకుని ఫారం-7 పత్రాలు ముద్రించార‌న్న వార్త‌లు స‌ర్ ప్రక్రియపై మ‌రిన్ని అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. వాటిని విడివిడిగా కాకుండా గంప‌గుత్త‌గా పంపిణీ చేయ‌టం వెనుక మ‌త‌ల‌ బేంట‌నేది ఎవ‌రికీ అర్థం కావ‌టం లేదు.

స్థానిక ఈఆర్వోలు దీనిపై విచారణ జరిపి పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తున్నా... పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోతే ఈ పత్రాల ప్రింటింగ్‌ ఎక్కడ జరిగింది? రాష్ట్రానికి ఎవరు సరఫరా చేశారన్న వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవనేది సుస్ప‌ష్టం. ‘సర్‌’లో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జ‌ర‌గిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌... ఆ ప‌త్రాల‌ను, ఈ పత్రాలను ఒకేచోట ప్రింట్‌ చేశారా..? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రోవైపు బోగస్‌ ఫారం-7 ప్రింటెడ్‌ పత్రాల సమర్పణపై ఎన్నికల అధికారులు దృష్టి సారించిన‌ప్పటికీ, ముషీరాబాద్‌ నియోజక వర్గంలో ఈ పత్రాలు బయటకు రావటం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముప్ఫై మంది ముస్లిం ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. గోషామహల్‌ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో విచారణ చేయాలని అక్కడి ఈఆర్వోను ఎన్నికల అధికారులు ఆదేశించినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ నియోజకవర్గంలో మంగళవారం కూడా ఒక పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఫారం-7 ప్రీ ప్రింటెడ్‌ పత్రాలను సమర్పించడానికి ప్రయత్నించగా స్థానిక ఈఆర్వో, బీఎల్‌వోలు తిరస్కరించినట్టు వార్త‌లు రావ‌టం గ‌మ‌నార్హం. దీంతో స‌ర్ ప్ర‌క్రియ ఎంత లోప‌భూయిష్ట‌మైందో, దాని ఉద్దేశాలు, ల‌క్ష్యాలేంటో స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి.


ఇదే సమయంలో స‌ర్‌ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం, ఎన్నికల సంఘం నుంచి వివరణలు కోరింది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగిపోయే పరిస్థితి ఏర్పడితే దాని తీవ్రతపై న్యాయస్థానం దృష్టి సారించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు పారదర్శ కంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు స్పష్టం చేశాయి. దీంతో సర్‌ ప్రక్రియపై న్యాయపరమైన పరిశీలన కూడా కీలకంగా మారింది. ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో స‌ర్‌పైన‌, జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపైనా దేశ రాజధానిలో ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాల ఆందోళ‌ న‌ల‌తో ఢిల్లీ అట్టుడుకుతోంది. అక్టోబర్‌ 6న పార్లమెంట్‌ స్ట్రీట్‌ వద్ద జరిగిన నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని అణ‌చివేయ‌టానికి కేంద్రం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో సైతం ఇదే అంశంపై గ‌త కొన్ని రోజులుగా నిర‌స‌న జ్వాల‌లు కొన‌సాగుతున్న సంగ‌తి విదితమే. రౌండ్‌టేబుల్ స‌మావేశాలు, స‌ద‌స్సులు, సెమినార్లు, సీఈవోకు విన‌తిప‌త్రాలు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను ఇండియా కూట‌మి భాగ‌స్వామ్య పార్టీలు కొన‌ సాగించాయి. గురువారం చ‌లో లోక్‌భ‌వ‌న్‌కు ఆయా పార్టీలు పిలుపునిచ్చిన ద‌రిమిలా... ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయ‌టం ద్వారా స‌ర్ కుట్ర‌లు.. కుతంత్రాల‌కు తెలంగాణ జ‌నం చెక్ పెట్టాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్