బరిలో ఒలింపిక్స్, ఆసియా విజేతలు
నేటి నుంచి ఆర్చరీ ప్రీమియర్ లీగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. తొలి సీజన్‌లో ఇండోర్‌లో పోటీపడిన ఆర్చర్లు.. రెండో సీజన్‌లో సాగర తీరంలో బలమైన గాలుల మధ్య సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో బాణం సంధించేందుకు సై అంటున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడల పతక విజేతలు పోటీపడుతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ఆరంభం కానుంది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. గురువారం ఆరంభ వేడుకలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ఆర్చర్లకు సన్మానంతో పాటు మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎల్ గీతం, మస్కట్‌ను లీగ్ డైరెక్టర్ అనిల్ కామినేని ఆవిష్కరించారు.
సొంతగడ్డపై పోటీ ఆసక్తికరం : ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీలో రెండు పసిడి పతకాలు సాధించిన తెలంగాణ యువ ఆర్చర్ తానిపర్తి చికిత ఏపీఎల్‌లో చోళ చీఫ్స్ తమిళనాడు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సైతం ఇదే జట్టుకు రికర్వ్ విభాగంలో ఆడుతోంది. ‘ఏపీఎల్‌లో 15 సెకండ్ల షాట్ ఆసియా క్రీడల్లో ఒత్తిడిలో రాణించేలా సహాయపడింది. లీగ్‌లో సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆసియా క్రీడల్లో పసిడి ప్రదర్శన తర్వాత సొంతగడ్డపై పోటీపడటం సంతోషంగా ఉందని’ చికితి తెలిపింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. రికర్వ్, కాంపౌండ్ మహిళలు, పురుషుల పోటీలు ఒకే మ్యాచ్‌లో జరుగుతాయి. బాణం సంధించేందుకు ఒలింపిక్స్ సమయం 20 సెకండ్లు కాగా..ఏపీఎల్‌లో 15 సెకండ్లు మాత్రమే. డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ దశ మ్యాచులు జరుగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 18న ఏపీఎల్ టైటిల్ పోరు జరుగనుంది.






కామెంట్‌లు (0)