Magazines

‘‘ఖాఖీ’’ క్రౌర్యం!

2 గంటల క్రితం

The brutality of the 'Khaki'!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 3 నిమిషాల చదవడం

ఒక ఎంపీని మెడ పట్టుకుని బస్సులోకి లాగడం.. గొంతు నులిమేలా అదిమిపట్టడం.. స్పృహ తప్పిపోయే పరిస్థితికి చేర్చి రోడ్డుపక్కన వదిలేయడం! మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లడం.. విద్యార్థులను చితకబాదడం.. వార్తలు సేకరించే జర్నలిస్టులనూ వదలకుండా నిర్బంధించడం! దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్‌ 10, 11 తేదీల్లో కనిపించిన దృశ్యాలివి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినవారిపై ఢిల్లీ పోలీసులు ప్రదర్శించిన బలప్రయోగం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ప్రజల హక్కులను కాపాడాల్సిన ఖాకీలే భయపెట్టే శక్తిగా మారితే సామాన్యుడికి దిక్కెవరు?పౌరులపై ఇంతటి క్రౌర్యాన్ని ప్రదర్శించే అధికారం పోలీసులకు ఎవరి చ్చారు?

సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ను స్పృహ కోల్పోయేలా దాడి చేయడం ఈ దౌర్జన్యానికి పరాకాష్ట. నిరసనకారులకు దూరంగా, మీడియాతో మాట్లాడుతున్న ఆయన్ను ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది బలవం తంగా అదుపులోకి తీసుకుంది. అతని మెడ పట్టుకుని, బస్సులో సీటుకు అదిమిపట్టి, గొంతు నులిమింది. తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సదరు ఎంపీ ఫిర్యాదు కూడా చేశారు. అయితే, పార్లమెంటు సభ్యుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జనాల పరిస్థితి ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజాప్రతినిధి హోదా కూడా పోలీసుల దౌర్జన్యం నుంచి రక్షించలేని స్థితికి దేశ రాజధాని చేరిందా? రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష నేతలపై కూడా ఢిల్లీలో నిర్బంధ చర్యలు చోటుచేసుకున్నాయి. వారి నిరసనకు సంబంధించి పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఆరోపణలు ఉంటే చట్టప్రకారం విచారణ జరపాలి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును నిర్బంధాలతో ఎదుర్కోవడం, నిరసనలను బలప్రయోగంతో అణచివేయడం ఏ విధంగా సమర్థనీయం? జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతున్న విద్యార్థులు, యువజన సంఘాలు, వామపక్ష కార్యకర్తలపైనా ఇదే వైఖరిని ప్రదర్శించడం పాలకుల అసహనాన్ని వెల్లడిస్తోంది.

మహిళా నిరసనకారులను మగ పోలీసులు ఈడ్చుకెళ్లడం, జర్నలిస్టులను బలవంతంగా నిర్బంధించడం మరింత తీవ్రమైన విషయం. ఒక యువతిపై కాషాయ కండువా కప్పుకున్న ఇద్దరు వ్యక్తులు, ఆమె రెండుకాళ్లు లాగి ఆమెను ముఖాన్ని రహదారికి అదిమిపట్టి దాడి చేశారు. ఆ కండువాను బట్టే వారెవరో అర్థం చేసుకోవచ్చు. కానీ, గాయపడ్డది ఆమె శరీరమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే స్వేచ్ఛకు కూడా. దాదాపు మూడు డజన్ల మంది జర్నలిస్టులను అదుపులోకి తీసు కున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. వారి గుర్తింపు కార్డులున్నప్పటికీ అడ్డుకోవడం, ఫోన్లు స్వాధీనం చేసుకోవడం, వార్తల సేకరణకు ఆటంకం కలిగించడం పత్రికా స్వేచ్ఛపై దాడే. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీని పోలీసులు చుట్టుముట్టి దౌర్జన్యంగా లాక్కెళ్లి మరీ నిర్భందించడం ఆ పార్టీ పొలిట్‌‌బ్యూరో సభ్యుడైన బీవీ రాఘవులను కాలర్‌ ‌పట్టి లాక్కెళ్లడం చాలా దారుణం. పోలీసుల చర్యను వామపక్ష నాయ కులు, రాజకీయ పార్టీల నేతలందరూ ఖండించారు. విద్యార్థుల నుంచి ఎంపీల వరకు, మహిళల నుంచి మీడియా ప్రతినిధుల వరకు అందరినీ ఒకే విధంగా అణచివేయాలనే ధోరణి ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు, శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమైనవారిని చట్టబద్ధమైన ప్రక్రియకు విరుద్ధంగా నిర్బంధించ రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, అక్టోబర్‌ 11న కూడా నిరసనకారుల నిర్బంధాలు కొనసాగాయి. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు తమ పద్ధతిని మార్చుకోకపోతే, ఆ ఆదేశాల అమలును పర్య వేక్షించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? పోలీసు దుస్తుల్లో కూడా కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్‌‌కు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడినట్టు వార్తలు చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి పతనావస్తకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. దాడుల్లో ఆరెస్సెస్‌ ‌పాత్రపై స్వతంత్ర దర్యాప్తు జరిపి నిజాలు వెల్లడించాలి.

ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. అందువల్ల హోంమంత్రి అమిత్‌ షా ఈ ఘటనలకు సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఓటర్ల జాబితాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఎన్నికల సంఘం పారదర్శకంగా సమాధానాలివ్వాలి. విమర్శలను ఎదుర్కొనే బదులు నిరసన కారులను కొట్టడం, జర్నలిస్టులను నిర్బంధించడం, రహదారులపై బారికేడ్లు నిర్మించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచవు. ప్రజాస్వామ్యంలో నిరసన నేరం కాదు, అధికారాన్ని ప్రశ్నించడం పౌరుల హక్కు. పోలీసు దౌర్జన్యాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బారికేడ్లతో ప్రజలను ఆపవచ్చు.. బస్సుల్లోకి బలవంతంగా ఎక్కించవచ్చు.. కానీ ప్రజల ప్రశ్నలను, రాజ్యాంగం కల్పించిన హక్కులను శాశ్వతంగా బంధించలేరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్