Wednesday, April 30, 2025
Homeనేటి వ్యాసంఅంబేద్కర్‌ సూచించిన సామాజిక విముక్తి మార్గం

అంబేద్కర్‌ సూచించిన సామాజిక విముక్తి మార్గం

”బ్రాహ్మణవాదం, పెట్టుబడి దారీ విధానం ఈ రెండు శ్రమజీవులకు నిజమైన శత్రువులు” అని నాడే చెప్పారు అంబేద్కర్‌. నేడు దళిత బహుజనులు ఓట్ల రాజకీయాలకు పావులుగా మారి సమిధలవుతున్నారు. పార్లమెంటరీ రాజకీయాల భ్రమల్లో నుంచి ఈ వర్గాలు బయ టపడాలి. అంబేద్కర్‌ సూచించిన ప్రత్యామ్నాయ రాజకీ యాలు, సంస్కృతి, సాంఘిక విముక్తి ,ఆర్థిక సమానత్వం ఇంకా అందనంత దూరంగానే ఉంది. ప్రజలకు అన్నం పెట్టే కీలక రంగమైన వ్యవసాయం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని అంబేద్కర్‌ సూచించారు. ప్రభుత్వం స్వయంగా నిర్వహించే పరిశ్రమలను భారత రాజ్యాంగంలో పొందుపరచాలన్నారు. వ్యవసాయ క్షేత్రాలను సమిష్టి సహకార క్షేత్రాలుగా మార్చి కుల,మత బేధాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలని, ఉత్పత్తిని సమిష్టిగా పంచుకోవాలని ఆశించాడు.భూస్వాములు, కౌలు దారులు, భూమిలేని కూలీలు ఇలా అంతరాలు ఉండరాదన్నాడు. ఇంకా అనేక సూచనలు చేసినా ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలకు రుచించలేదు. ఆ ఆలోచనలను తీసిపక్కన పెట్టారు. అందుకే ఆయన ఒక ఊహజనిత సోషలిస్టుగానే మిగిలిపోయాడు. తదుపరి ఎప్పటికో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇరవైఆరేండ్ల తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకున్నారు. రాజ్యాంగం ప్రజల జీవితాలకి గ్యారెంటీ ఇవ్వలేదని గ్రహించిన అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో ఇలా మాట్లాడారు ”1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తాం. మనకు రాజకీయాల్లో సమా నత్వం కానీ సామాజిక ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటాయి. రాజకీయాల్లో మనిషికి ఓటు, దానికో విలువ ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక జీవితంలో మనుషులందరికి ఒకే విలువ ఉండదు. ఆర్థిక అసమానతలతో కూడిన అంతరాలుంటాయి. ఎంతకాలమీ వైరుధ్యాల జీవితం? ఈ వైరుధ్యాలను వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేకుంటే ఈ రాజ్యాంగ నిర్మాణసభ, వారు కష్టపడి నిర్మించిన ఈ వ్యవస్థలను అసమానతలను గురైన ప్రజలు ఎగర కొట్టేస్తారు” అన్నారు. ఆయన ఊహించి చెప్పిన మాటలు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు చూస్తుంటే నిజం అనిపిస్తున్నది.
దారిద్ర నిర్మూలనకు మౌలికమైన వ్యవసాయ భూ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామీణ పేదరికం తొలగించి, గ్రామ సీమల్లో అణిచివేతకు, వివక్షకు గురవుతున్న అణగారిన జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికీ దక్కలేదు. 77 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాలు ఎవరికి దక్కాయి? ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్న ‘వికసిత భారత్‌’, ‘వికసిత్‌ అభివృద్ధి’ ఎవరికి ప్రయోజనం కలిగించాయి? గ్రామ, పట్టణ ప్రాంతాల్లో లభించే మేలైన భూమి ఎవరు ఆక్రమించారు? చట్టసభ, కార్యనిర్వక, న్యాయవిభాగాలు లాంటి కీలక విభాగాల్లో ఎవరు స్థిరపడిపోయారు? ఈ విభాగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సముచిత స్థానం దొరికిందా? లేదంటే ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం అణగారిన ప్రజలది కాదని తేలిపోయింది. అంబేద్కర్‌ ఆనాడు ఆశించిన పేదల అభివృద్ధి కలలుగానే మిగిలిపోయింది. అలాగే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్‌ ఒక సందర్భంలో ” నేను ఏర్పరిచిన రిజర్వేషన్లతో ఆర్థిక సామాజిక సమానత్వం వస్తుంది అనుకున్నా. అయితే వాటి వల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజార్టీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తున్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేకపోయాను” అంటూ ఆవేదన చెందారు. అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమాన త్వం రాదు. వ్యవసాయ ఆధారిత మనదేశంలో భూమికి సామాజిక, ఆర్థిక న్యాయానికి ఉన్న సంబంధమిదే. ఎందుకంటే మానవజాతికి సమస్త జీవనాధార మైనది భూమి. గనుక అనాదిగా భూమిని ఆక్రమిం చుకోవడం, దోచుకోవటం జరుగుతూ ఉంది.
ఈ భూమ్మీద బతుకుతున్న మనుషుల్ని, సమస్త జీవజాలాన్ని మొత్తం సంపదను ఆక్రమించుకొని రక్షించుకోవడానికి రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజులు వచ్చారు. యుద్ధాలు జరిగాయి. ఇలా చరిత్ర అంతా మనవాళి నెత్తుటితో తడిసి ముద్దయింది. చివరికి మట్టి బిడ్డలైన అణ గారిన భూమి పుత్రులకి మాత్రం భూమి దక్కనేలేదు. భూమికోసం జాతులకు జాతులనే నిర్మూలించి అమెరికా , ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా అంటూ భూమిని ఖండ ఖండాలుగా విభజించి వశపరచుకున్నారు. చివరకు ఆర్యులు రష్యాలోని హోల్గా నది తీరం నుండి గంగానది వరకు వచ్చింది ఈ పచ్చిక భూముల కోసమే కదా.ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రజలకు దక్కాల్సిన భూములు, వనరులు గుంజుకొని దేశ విదేశీ బహుళజాతి జాతి కంపెనీలకు ,దేశంలోని ఆదానీ, అంబానీ లాంటి బడా బాబులకు కట్టబెడుతున్నది. అందుకే నేడు భూ సంబంధాలన్నీ మార్కెట్‌ సంబంధాలుగా మారి పోయాయి. నేడు ప్రపంచంలో చర్చంతా భూమి పైనే. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో సాగుతున్న భూ వ్యాపారం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సి జన్‌గా మారింది. భూమి అంటే నేల మాత్రమే కాదు ఆ నేలలోని వనరులు, ఆ మట్టిలో నుంచి శ్రమ జీవులు పుట్టించిన సమస్త జ్ఞానం, సమిష్టి జీవనం, సంపద, కళలు, సంస్కృతి. ఇంత అవినాభావ సంబంధం గల భూమి అణగారిన ప్రజలకు దక్కా లి. ఇదే ఏకైక పరిష్కారం, అంబేద్కర్‌ ఆశయం.
ఎల్‌.అరుణ 9705493054

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img