Wednesday, April 30, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధ్యం

ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధ్యం

– 40 ఏండ్ల నుంచి ఒకే యూనియన్‌ ఉండటం చారిత్రాత్మకం
– కార్మికుల సంక్షేమంలో రాజీలేనిపోరాటం : శాండ్విక్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.కృపేందర్‌
– 14 చారిత్రాత్మక వేతన ఒప్పందాల ద్వారా మెరుగుపడిన కార్మికుల జీవన ప్రమాణాలు
– మారిన పరిస్థితుల్లో గత విజయాలే పునాదిగా మరింత ఐక్యంగా గోల్డెన్‌ జూబ్లీ వైపు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు
– ఘనంగా శాండ్విక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ 40వ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఐక్యత పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకో గలుగుతామని, 40 ఏండ్ల నుంచి ఒకే యూనియన్‌ ఉండటం చారిత్రాత్మకమని శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షులు, నవతెలంగాణ పత్రిక సంపాదకులు ఆర్‌.సుధాభాస్కర్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (పూర్వపు విడియా ఎంప్లాయీస్‌ యూనియన్‌) స్థాపించి 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మండలంలోని కర్దనూర్‌లో గల జేపీ కన్వెన్షన్‌ హాల్‌లో శాండ్విక్‌ 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సుధాభాస్కర్‌తో పాటు యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.కృపేందర్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాభాస్కర్‌ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా కార్మిక సంక్షేమంలో రాజీలేకుండా ఒకే నాయకత్వంలో 40 ఏండ్లు పూర్తి చేసుకోవడం ఎంతో అభినందనీయమంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని రోజులుగా ప్రపంచ పరిణామాలు గమనిస్తే అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు, టారిఫ్‌ యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం మనం చూస్తున్నామన్నారు. ఈ ప్రభావం మనం అవునన్నా కాదన్నా పరిశ్రమల మీద పడటంతో పాటు ఆ ప్రభావం కార్మికవర్గం మీద కూడా పడుతుందని తెలిపారు. కాబట్టి సాధించిన విజయాలు శాశ్వతమని అనుకోవడానికి వీల్లేదని, వాటిని నిలబెట్టుకోవాలంటే కార్మికవర్గం ఐక్యంగా నిలబడాలని, రాజకీయ చైతన్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
ఎం. కృపేందర్‌ మాట్లాడుతూ.. 1985లో యూనియన్‌ నెలకొల్పాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని, ఒక విధంగా ఉద్యోగాలను పణంగా పెట్టి యూనియన్‌ రిజిస్టర్‌ చేశామని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ యూనియన్‌ ఎన్ని యాజమాన్యాలు మారినా కార్మిక సంక్షేమంలో రాజీ లేకుండా నేడు 40వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరినీ కలుపుకొనిపోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో గోల్డెన్‌ జూబ్లీ వైపునకు ఎస్‌ఈయూ ప్రయాణం సాగాలని పిలుపునిచ్చారు. చుక్క రాములు మాట్లాడుతూ.. 1985 ఏప్రిల్‌ 9న స్థాపించిన విడియా ఎంప్లాయీస్‌ యూనియన్‌ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక యాజమాన్యాలు మారి నేడు శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌గా 40 ఏండ్లు పూర్తిచేసుకొని వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రారంభం నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా సీఐటీయూ మార్గ నిర్దేశకత్వంలో కార్మికులనందరినీ ఐక్యంగా నిలబెట్టడం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. 14 వేతన ఒప్పందాల ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామన్నారు. ఒక్క కార్మిక సంక్షేమంలోనే కాకుండా సామాజిక, సంఘీభావ కార్యక్రమాల్లో సైతం కార్మికులను భాగస్వాములను చేస్తూ ముందు నుంచి అందరికీ ఆదర్శవంతమైన కృషి శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ చేసిందని చెప్పారు. మారిన పరిస్థితుల్లో గత విజయాలే పునాదిగా మరింత ఐక్యంగా ముందుకు సాగి గోల్డెన్‌ జూబ్లీ వైపు ముందుకు వెళ్దామని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజ్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు కె.రాజయ్య, శాండ్విక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పి.పాండురంగారెడ్డి, మనోహర్‌, వెంకట్రావు, సదాశివరెడ్డి, విఠల్‌ రావు, శాండ్విక్‌ ప్లాంట్‌ హెడ్‌ అభిజిత్‌ హడప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాష్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ నాగవేణి బాజ్‌పాయి, మాజీ హెచ్‌ఆర్‌ హెడ్స్‌, మాజీ మేనేజర్స్‌, పరిశ్రమ ప్రతినిధులు, వివిధ పరిశ్రమల సీఐటీయూ యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img