– భారత్, పాక్ ఢీ నేడు
– గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు
– రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో
ఆసియా కప్ వేట సూపర్4 దశకు చేరుకుంది. ఫైనల్లో చోటు కోసం భారత్ సహా నాలుగు జట్లు సూపర్ సమరానికి సై అంటున్నాయి. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన భారత్, పాకిస్తాన్ నేడు సూపర్4లో ఢకొీట్టనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్ చప్పగా ముగియగా.. నేడు సూపర్4లోనైనా సమవుజ్జీల సమరం చూస్తామా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అజేయ జోరుతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా నేడు సూపర్ సమరంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-అబుదాబి
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే.. ఇరు జట్ల బలా బలాలు, కీలక ఆటగాళ్లు, ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరనే చర్చ సహజం. కానీ ఆసియా కప్ సూపర్4 మ్యాచ్ ముంగిట భిన్నమైన వాతావరణం నెలకొంది. అభిమానులతో పాటు అందరి దృష్టి మ్యాచ్‌పై కాకుండా.. మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్ల కరచాలనంపై పడింది. గ్రూప్ దశ తరహాలోనే మరో విజయంతో ఫైనల్ దిశగా ఓ అడుగు ముందుకేయాలని భారత్ భావిస్తుండగా.. గ్రూప్ దశ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఎదురుచూస్తోంది. భారత్, పాకిస్తాన్ సూపర్4 మ్యాచ్ అబుదాబి వేదికగా నేడు జరుగనుంది.
జోరు సాగేనా?
గ్రూప్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. దుబారులో జరిగిన రెండు మ్యాచుల్లో అలవోక విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. అబుదాబిలో కాస్త తడబడింది. కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వటం ఇందుకు ఓ కారణమైనా.. ఇక్కడి పరిస్థితులకు సూర్యసేన అలవాటు పడలేదు. ఒక్క రోజు విరామంలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత్.. నేడు తొలి ప్రాధాన్య ఆటగాళ్లతో ఆడనుంది. బ్యాటింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. కానీ పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ సింగ్ బంతి అందుకునే వీలుంది. అక్షర్ పటేల్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నప్పటికీ.. కుల్‌దీప్ యాదవ్‌తో కలిసి తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి బెంచ్‌కు పరిమితం కావచ్చు. శివం దూబె, హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్లుగా కొనసాగనున్నారు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్‌లో బ్యాట్‌తో భారత్‌కు కీలకం కానున్నారు.
పుంజుకుంటారా?
పాకిస్తాన్ శిబిరం ఆశించిన ఉత్సాహంగా లేదు. ఆన్, ఆఫ్ ఫీల్డ్ సంఘటనలతో ఆ జట్టు కాస్త ఆందోళనతో కనిపిస్తోంది. సూర్య సేనకు దీటుగా పోటీనివ్వగల మేటీ ఆటగాళ్లు పాక్ శిబిరంలో కరువయ్యారు. సయీమ్ ఆయుబ్, ఫర్హాన్, హారిశ్, హసన్ నవాజ్‌లపై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కెప్టెన్ సల్మాన్ ఆగాతో పాటు ఫకర్ జమాన్ బ్యాటింగ్ భారం మోయాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో షహీన్ షా అఫ్రిది ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. ఫలితంగా పవర్‌ప్లేలో పాక్ పేస్ దాడి పేలవంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అబుదాబిలో భారత్ బ్యాటర్లను ఇరకాటంలో పడేయాలని సల్మాన్‌సేన ఎదురుచూస్తోంది.
పిచ్, వాతావరణం
అబుదాబి పిచ్ సహజంగా పేసర్లకు అనుకూలం. ఇక్కడ స్పిన్‌కు పెద్దగా సానుకూలత ఉండదు. వాతావరణం సైతం ఉక్కపోతగా ఉంటుంది. దీంతో పేసర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నారు. భారత్, పాక్ గత మ్యాచ్‌లో స్పిన్ అనుకూలిత దుబారులో ఆడాయి. నేడు పేస్‌కు అనుకూలించే అబుదాబిలో మ్యాచ్ జరుగనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. పిచ్ స్వభావం తుది జట్ల ఎంపికపై ప్రభావం చూపించనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబె, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్ : సయిం ఆయుబ్, ఫర్హాన్, మహ్మద్ హరిశ్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీం అష్రాఫ్, షహీన్ షా అఫ్రిది, సుఫియన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.
ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు
ఆసియా కప్ కీలక సూపర్4 మ్యాచ్ ముంగిట భారత్, పాకిస్తాన్ జట్లు ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్నాయి. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలనే డిమాండ్‌తో గత మ్యాచ్‌కు ముందు సైతం పాకిస్తాన్ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టింది. పాకిస్తాన్ క్రికెటర్లు సాయంత్రం అబుదాబి స్టేడియంలో ప్రాక్టీస్ చేసినా.. మీడియా ముందుకు రాలేదు. అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత్, పాక్ సూపర్4 పోరుకు సైతం ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు.
చేతులు కలుపుతారా?!
భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో సరికొత్త వివాదం రేగింది. సహజంగా టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల క్రికెటర్లు పరస్పరం కరచాలనం చేయటం సంప్రదాయంగా వస్తోంది. కానీ గత ఆదివారం దుబాయ్ లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌లో ఇది కనిపించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా షేక్‌హ్యాండ్స్ అంశంలో చిన్నబుచ్చుకున్నారు. సల్మాన్ ఆగా మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌కు సైతం హాజరు కాలేదు. కరచాలనం చేయవద్దంటూ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు సూచించిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను పీసీబీ మండిపడింది. అతడిని తొలగించాలని ఐసీసీపై ఒత్తిడి తీసుకొచ్చింది. యుఏఈతో మ్యాచ్‌ను బహిష్కరించేందుకు సైతం వెనుకాడలేదు. భారత్, పాక్ గత మ్యాచ్ వేడి ఇంకా తగ్గలేదు. ఇంతలోనే నేడు భారత్, పాక్‌లు మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్‌ను రిఫరీగా ఎంపిక చేశారు. మరి నేడు ఏం జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉండగా.. అసలు ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం.
క్రికెట్ స్ఫూర్తిని నిలబట్టేందుకు ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకు ఐసీసీ క్రమశిక్షణా నియమావళిని తీసుకొచ్చింది. ఫెయిర్ ప్లే, ప్రత్యర్థులను గౌరవించటం, ఆట సమగ్రతను కాపాడటం ఐసీసీ ఉద్దేశం. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆన్, ఆఫ్ ఫీల్డ్ ప్రవర్తన ఈ నియమావళి పరిధిలోకి వస్తుంది. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పీఠిక ప్రకారం మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో కరచాలనం సంప్రదాయంగా వస్తోంది. ఫలితంతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఇది దోహదం చేస్తుంది. ప్రత్యర్థి క్రికెటర్లతో కరచాలనం నిరాకరించటం క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించినట్టే అవుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ప్రత్యర్థి జట్టుతో కరచాలనం నిరాకరించటం.. ఆర్టికల్ 2.1.1 (లెవల్ 1 అఫెన్స్) కింద ఫెయిర్ ప్లే, పరస్పర గౌరవానికి భంగం కలిగించటం. ఇటువంటి సందర్భాల్లో హెచ్చరికలు, జరిమానాలు విధించవచ్చు. కానీ భారత్, పాకిస్తాన్ వివాదంపై స్పందించిన ఐసీసీ.. కరచాలనం ఇవ్వటం, ఇవ్వకపోటం క్రమశిక్షణ నియమావళి కిందకు రాదని స్పష్టం చేసింది. క్రికెటర్లు, అధికారులు కొన్ని సంప్రదాయాలను స్వీయ విచక్షణతో పాటించాలే తప్పితే కొరడా ఝులిపించి ఆదేశించలేమని మాజీ అంపైర్ ఒకరు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం దాయాదుల మ్యాచ్‌లో షేక్‌హ్యాండ్స్ వద్దని సూచించిన రిఫరీ పైక్రాఫ్ట్ నేడు ఏం చేస్తాడు? చేతులు కలపటంపై రిఫరీ సమాచారం ఇవ్వకుంటే నేరుగా ఇరు జట్ల మేనేజర్లు ఈ విషయాన్ని పంచుకుంటారా? అనేది చూడాలి.
సూపర్ సమరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES