– అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
– సీఐటీయూలో భారీగా అంగన్‌వాడీల చేరికలు
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్
అంగన్‌వాడీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొడకండ్ల ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు వివిధ యూనియన్ల నుంచి దాదాపు 200 మంది యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి సంఘం కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలను బలహీనపరచడం కోసమే పీఎం శ్రీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. దీనిద్వారా ఐసీడీఎస్ నిధులను దారి మళ్లించి, క్రమక్రమంగా అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. జీఓ 14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల కృషి ఫలితంగా దేశంలో పౌష్టికాహార లోపం తగ్గుదల, బాలింతల జబ్బుల నివారణ, పోలియో నివారణ వంటి వాటిల్లో అదుభత ప్రగతిని సాధిస్తుందన్నారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తున్నారని తెలిపారు. వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం కోసం సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే యాప్‌ను అమలు చేయాలని, మినీ టీచర్స్‌కు పెండింగ్‌లో ఉన్న 11 నెలల వేతనం విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి రాజకీయ నాయకుల వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో పక్కా భవనాలు, మరుగుదొడ్ల సౌకర్యం, రికార్డులు భద్రపరచుకోవడానికి బీరువాలు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటాల సోమన్న, జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు, జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, మహబూబాబాద్ ప్రాజెక్టు జిల్లా సహాయ కార్యదర్శి స్వరూప, సరిత, భాగ్య, బి శోభారాణి, మంగ, భారతి, ఇందిరా, యాదమ్మ, ఉప్ప లక్ష్మి, మాధవి, శోభ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES