Thursday, April 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువసతిగృహంలో విద్యార్థిని మృతి

వసతిగృహంలో విద్యార్థిని మృతి

- Advertisement -

కుటుంబీకులు, గ్రామస్తుల అనుమానం
ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నా
బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆర్డీవో, తహసీల్దార్‌, సీఐ
నవతెలంగాణ-ఎల్లారెడ్డి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో బుధవారం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్‌ మండలంలోని హాజీపూర్‌కు చెందిన శ్రావణి(14) ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమెకు తండ్రి లేడు. తల్లి, అన్న, అక్క హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రావణి బుధవారం తెల్లవారుజామున వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తుండగా వరండాలో పడిపోయింది. సిబ్బంది గమనించి వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ విద్యార్థినిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ విషయంపై హాస్టల్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆర్డీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, సీఐ దొరవారి రాజిరెడ్డి, ఎస్‌ఐ బొజ్జ మహేష్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అలాగే వసతి గృహనికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి ఘటన గురించి విచారణ చేపట్టారు. ఆ సమయంలో వార్డెన్‌ హాస్టల్‌లో లేరు. ఆమె బాన్సువాడలో ఉంటూ ఎల్లారెడ్డి బీసీ హాస్టల్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. గుండెపోటుతో మృతిచెందిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాజీపూర్‌ గ్రామస్తులంతా స్థానిక పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. శ్రావణి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -