Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంమహిళలు వర్సెస్‌ సీట్లు

మహిళలు వర్సెస్‌ సీట్లు

- Advertisement -

హడావిడిగా రిజర్వేషన్‌ చట్టం
అమలుకు బీజేపీ యత్నం
కీలకంగా మారిన మహిళా ఓటు బ్యాంకు
న్యూఢిల్లీ :
రేపటి నుంచి (ఏప్రిల్‌ 16-18) పార్ల మెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశా లకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న, అమలుకు నోచుకుని చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ చట్టాన్ని (నారీ శక్తి వందన్‌ అధినియమ్‌) మోడీ ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. బహుశా మెజార్టీ ఉంది గనుక అమల్లోకి తెస్తుంది. ఇది మంచి విషయమే. కానీ మహిళాభివృద్ధి కోసం పాటుపడే పార్టీ అయితే శభాష్‌ అనొచ్చు. కానీ మనువాద సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని.. మహిళల్ని వంటింటి కుందేళ్లుగానే చూసే బీజేపీ ఇంతటి మహాత్కార్యానికి పూనుకోవడమే ఆశ్చర్యమే స్తోంది. ఆలోచనలో పడేస్తోంది. మహిళల విద్యకు, ఆర్థికంగా ఏమాత్రం ఊతమివ్వని కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో కూర్చోబెట్టడానికి ఎందుకింత తహతహలా డుతుందంటే.. కేవలం రాజకీయ లబ్ది కోసమేనన్నది బహిరంగ సత్యం.

బీజేపీకి కీలకమైన మహిళా ఓటు బ్యాంకు
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభు త్వం హడావిడిగా ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయ డానికి పూనుకుందంటే.. పశ్చిమ బెంగాల్‌, తమిళనా డులో గట్టెక్కడానికే. కేవలం ఈ ఎన్నికల్లో మాత్రమే కాదు.. బీజేపీకి గత ఎన్నికల్లో కూడా మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారింది. 2014 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్ని పరిశీలిస్తే.. మహిళల ఓట్ల వల్లే బీజేపీ గెలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
నేషనల్‌ ఎలక్షన్‌ స్టడీస్‌ (ఎన్‌ఇఎస్‌) సమాచారం ప్రకారం.. 1998 ఎన్నికల్లో బీజేపీకి మహిళా ఓటింగ్‌ 33శాతం. అప్పుడు అటల్‌ బీహారీ వాజ్‌పేయి ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కి 30 శాతమే. ఆ తర్వాత మళ్లీ బీజేపీకి మహిళా ఓటింగ్‌ తగ్గినా.. 2014 నుంచి క్రమేణా పెరుగుతోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 22శాతం మహిళా ఓటింగ్‌ అయితే.. బీజేపీకి 36 శాతం నమోదైందని ఎన్‌ఇఎస్‌ గణాంకాలే వెల్లడించాయి.



ఐదేండ్లలోనే నాలుగు కోట్లకు పెరిగిన మహిళా ఓటర్లు
2019లో 89.6కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 46.5 కోట్ల మంది పురుషులు, 43.1 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024కి 96.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు 47.1 కోట్లకి చేరారు. అంటే 2019 కంటే 2024కు నాలుగు కోట్లమంది మహిళా ఓటర్లు పెరిగారు. ఇక ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లు 2.63 కోట్లకు పెరగగా వారిలో 1.41 కోట్ల మంది మహిళలు, 1.22 మంది పురుష ఓటర్లు పెరిగారు. 2019లో 12 రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు పెరిగారు. అయితే 2024లో 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 19 రాష్ట్రాల్లో మహిళా ఓటింగ్‌ పెరిగింది. లింగనిష్పత్తి 2019 నాటికి 1000కి 928 మంది ఉండగా.. 2024కి 1000కి 948 మందికి పెరిగింది. జనాభా నియంత్రణను అమలు చేయడం వల్లే దక్షిణాది రాష్ట్రాల స్త్రీలకు కోత పడింది.

లోక్‌సభ సీట్ల పెంపునకే ఈ తంతు
1952 నుంచి చూస్తే.. పార్లమెంటు మహిళా ప్రాతినిధ్యం శాతం 2024కి 15 శాతం కంటే తక్కువగా ఉంది. 1952లో 4 శాతంగా ఉంటే.. 2024కి 14 శాతానికి చేరింది. ప్రస్తుతం 15 శాతం కూడా లేని మహిళా ప్రాతినిధ్యాన్ని కేంద్రం అమాంతం డబుల్‌కి పెంచే చర్యలకు పూనుకుంది. ఒకవేళ 2011 జనాభా గణన ఆధారంగా నారీశక్తి వందన్‌ అధినియమ్‌ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే..ఇప్పుడున్న లోక్‌సభ సీట్లు 543కు కాస్తా.. 816కి పెరుగుతాయి. ఈ సీట్ల కేటాయింపుల్లో కూడా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలిస్తే.. ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. పురుషల ఓటింగ్‌ 62.8శాతంగా ఉంటే, మహిళా ఓటింగ్‌ 71.6 శాతంగా ఉంది. అంటే ఆ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే 2027 లో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నారీ శక్తి వందన్‌ను అమలు చేస్తే ఉత్తరప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు లోక్‌సభ స్థానాల పరంగానూ, ఇటు సొంత రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పక్కా ప్రణాళికతో ఈ చట్టాన్ని అమలును ముందుకు తెచ్చించని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆప్‌, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల మాదిరి హామీ లుగానే బీజేపీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో బాలికలకు, మహిళలకు ప్రత్యేక పథకాల్ని అమలు చేసింది. దీంతో అక్కడ మహిళలు బీజేపీకే మొగ్గుచూపారు. పథకాలు, ఓటింగ్‌ ఎలాగున్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్షరాస్యత రేటు చాలా తక్కు వగా ఉంది. రాజస్థాన్‌ 68 శాతం, బీహార్‌ 68 శాతం, ఉత్తరప్రదేశ్‌ 70 శాతం, మధ్యప్రదేశ్‌ 70 శాతంగా ఉంది. వీటికన్నా చిన్న రాష్ట్రాలైన మిజోరాం 98.2 శాతం, లక్షద్వీప్‌ 94.8 శాతం, కేరళ 94 శాతం, త్రిపుర 91.6 శాతం, గోవా 93.6 శాతం అక్షరాస్యతా శాతం ఎక్కువగా ఉంది. మహిళల చట్టసభల ప్రాధాన్యతకు చదువు కూడా కీలకమే కదా. అక్షరాస్యత తక్కువగా ఉన్న మహిళలు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహి స్తారా? ప్రశ్నార్థకమే. విజ్ఞానంతో పరిపాలన చేస్తే.. కేరళంలో శైలజా టీచర్‌లా మంచి నాయకులవుతారు. ప్రపంచ కీర్తి ప్రతిష్టలందుకుంటారు. లేదంటే ఉత్సవ విగ్రహాలుగా మారిపోతారు.
రాజకీయంగా మహిళలు ఎదగాలన్నది, పరిపాలన లో భాగస్వామ్యం కావాలన్న విషయంపై ఎవరూ వ్యతిరేకించరు. అందరూ హర్షిస్తారు. రాజకీయాల్లో ధనబలం ఉండాలి. ఆ విషయంలో మహిళకు ఆర్థిక స్వేచ్ఛనిస్తారా? ఒకవేళ గెలిచినా.. మహిళల్ని తమ ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయనిస్తారా? విద్య, సామాజిక, ఆర్థిక పరంగా మహిళలు చైతన్యవంతంగా లేకుంటే ప్రభుత్వాలు ఆవిధమైన కృషి చేయకుంటే.. ఈ రిజర్వేషన్లు పాలక పార్టీలకు ఊతకర్రలవుతా యనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకుల అభిప్రాయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -