Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయండీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తాం

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తాం

- Advertisement -

– మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తాము అనుకూలం
– కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదు
– ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ పార్టీలు స్పష్టం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

”డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. కానీ కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్న విధానం సరికాదు” అని ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ పార్టీలు స్పష్టం చేశాయి. బుధవారం నాడిక్కడ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ‘ఇండియా బ్లాక్‌’ పార్టీల సమావేశం జరిగింది. ఒకపక్క రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల డిమాండ్లను పట్టించుకోకుండా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఏకపక్షంగా ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌’ను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ బిల్లులపై ప్రతిపక్ష ”ఇండియా బ్లాక్‌” పార్టీల సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కె.సి వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), టి.ఆర్‌ బాలు (డీఎంకే), సంజరు సింగ్‌ (ఆప్‌), సంజరు రౌత్‌, అరవింద్‌ సావంత్‌ (శివసేన), నిలోత్పల్‌ బసు (సీపీఐ(ఎం), ఆనీరాజా (సీపీఐ), సుప్రియా సూలే (ఎన్సీపీ), సాగరిక ఘోష్‌ (టీఎంసీ), కె.ఎం మణి (కేరళ కాంగ్రెస్‌), ఎన్‌.కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్పీ), ఈటి మొహ్మద్‌ బషీర్‌ (ఐయుఎంఎల్‌), కపిల్‌ సిబల్‌ (ఇండిపెండెంట్‌) పాల్గొన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ బిల్లు రాజకీయ ప్రేరేపితమైంది: ఖర్గే
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు పన్నుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని అధికారాలన్నింటినీ కార్యనిర్వాహక వర్గం తీసుకుంటోందన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తామంతా పార్లమెంట్‌లో ఐక్యంగా పోరాడుతామని పేర్కొన్నారు. కనీసం జనగణన కూడా పూర్తి చేయకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

”మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ప్రతిపక్షాలు సానుకూలమే. కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానంలోనే మాకు అభ్యంతరాలున్నాయి. ఈ బిల్లు రాజకీయ ప్రేరేపితమైందిగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే కేంద్రం ఈ పని చేస్తోంది. అయినప్పటికీ మేం ఈ బిల్లుకు మద్దతిస్తూ వస్తున్నాం. కానీ, గతంలో చేసిన మార్పుల్ని అమలు చేయాలని కోరాం. డీలిమిటేషన్‌ అంశంలో కూడా కేంద్రం కొన్ని మెలికలు పెడుతోంది. ఈ అంశంపై అన్ని పార్టీలు పార్లమెంట్‌లో పోరాడుతాయి. డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తాం. కానీ, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతిస్తాం. డీలిమిటేషన్‌కు సంబంధించి జనాభా గణన అంశంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలోని అన్ని హక్కుల్ని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే అసోం, జమ్మూ కాశ్మీర్‌లో ఈ విషయంలో మోసం చేశారు. ప్రతిపక్షంగా మేం ఐక్యంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -