– నియోజకవర్గాల పునర్విభజన చర్య అభ్యంతరకరం
– కేరళం సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను వేగవంతం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఇది భారతదేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న బరితెగించిన ప్రయత్నమని అభివర్ణించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లు, రాష్ట్రాల హక్కులను, సమాన ప్రాతినిధ్య సూత్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రాలతో ఏకాభిప్రాయం లేకుండానే..
ఇంతటి కీలకమైన అంశంపై రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రాకుండా కేంద్రం ముందుకు వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఎం పినరయి తెలిపారు. దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించిన ఆయన దీనిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర రాష్ట్రాల జనాభా ఆధిపత్యాన్ని అదనపు లోక్సభ సీట్లుగా మార్చుకుని, తద్వారా దీర్ఘకాలం పాటు రాజకీయ అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికే ఈ ప్రక్రియ రూపొందించబడిందన్న విస్తృత అనుమానాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇటువంటి పునర్వ్యవస్థీకరణ వల్ల కేరళం వంటి రాష్ట్రాలు నేరుగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
పురోగతి సాధించిన రాష్ట్రాలకు శిక్షే
”జనాభా నియంత్రణను బాధ్యతాయుతంగా పాటించి, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారతలో పురోగతి సాధించిన రాష్ట్రాలు వాస్తవానికి శిక్షించబడుతున్నాయి. ప్రాతినిధ్యం తగ్గించడం, వనరులలో వాటా తగ్గించడం అనేది న్యాయమైన సమాఖ్య ఏర్పాటు కాదు” అని పినరయి తెలిపారు. ‘జనాభాను నియంత్రించకుంటే నష్టపోతారు, నిర్లక్ష్యం చేస్తే లాభపడ తారు’ అనే సందేశం భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన దిశ’ అని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రతిపాదనలోని ప్రాథమిక అసమానతను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించిన కుటుంబ నియంత్రణ విధానాలను విశ్వసనీయంగా పాటించిన రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం ఇప్పుడు తగ్గిపోతుండగా, ఆ విషయంలో విఫలమైన రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యంతో బహుమతి లభిస్తుంది. ”ఇది ద్వంద్వ ప్రమాణాలకు ఏమాత్రం తక్కువ కాదు” అని ఆయన తెలిపారు.
బహిరంగ రాజకీయ అవకాశవాదానికి ముసుగుగా మహిళా రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయ సమస్యలను ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం తప్పనిసరి అని ధ్రువీకరిస్తూనే, రాష్ట్రాలకు వారి న్యాయమైన సమానత్వాన్ని నిరాకరించడానికి దానిని సాకుగా చూపడం ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడం కంటే తక్కువ కాదని ఆయన వాదించారు.
ప్రజాస్వామ్యం అంటే…
”ప్రజాస్వామ్యం అంటే కేవలం సంఖ్యాపరమైన మెజారిటీ కాదు. అది న్యాయం, సమతుల్య ప్రాతినిధ్యం అనే పునాదులపై నిలబడాలి. సమాఖ్య భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సమాన గౌరవం, హేతుబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించాలి. లేకపోతే, రాజకీయ ఆధిపత్యాన్ని చట్టబద్ధం చేసే ఒక సత్వర మార్గంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు చరిత్రలో నిలిచిపోతుంది” అని సీఎం పినరయి హెచ్చరించారు.
సమాఖ్యవ్యవస్థకు నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



