ఆర్టిజన్ల సమ్మెకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ధర్నా
లేబర్ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆర్టిజన్ల సమ్మెకు మద్దతుగా బుధవారం హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్హహించాయి. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరు కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్‌లు మాట్లాడారు. ”తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో 19 వేల మంది ఆర్టిజన్లు. 1400 మంది అన్‌మెన్, పీస్ రేట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పాలకులు ఇచ్చిన హామీలే ఈ సమ్మెలో డిమాండ్లుగా ఉన్నాయి. గతంలో ఇచ్చిన ఆ హామీలు ఆచరణలో అమలు కాలేదు. ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కంలకు చెందిన 20 వేల మంది ఆర్టిజన్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కరించాలని ఏండ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అయినా ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. ఉద్యోగులు అనివార్యంగా సమ్మెలోకి దిగవలసి వచ్చింది. గత 8 రోజులు నుంచి సమ్మె ఐక్యంగా ఉధృతంగా కొనసాగుతున్నది. న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించి సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోలేదు. సమ్మెను అణిచివేసే ప్రయాత్నాలను చేస్తున్నది. సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తున్నది. విధుల నుంచి తొలిగిస్తున్నట్లుగా టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. గతంలో నుండి పొందుతున్న కొన్ని రాయితీలకు కోతలు పెడుతున్నారు. తక్షణమే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించి కొనసాగుతున్న సమ్మెను నివారించాలి” అని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం లేబర్ కమిషనర్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్, విఎస్.రావు, భూపాల్, కార్యదర్శులు కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, పి.సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, జె కుమారస్వామి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు ఆర్‌డీ.చంద్రశేఖర్, ఏఐటీయూసీ నర్సింహా, టీయూసీఐ ప్రవీణ్, ఐఎఫ్‌టీయూ అరుణక్క విద్యుత్ జెఏసి రాష్ట్ర నాయకులు కె. ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
చర్చలు జరపండి.. సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



