రూ.4 లక్షల పరిహారం అందజేయనున్న ప్రభుత్వం
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకు మండుతున్న ఎండలతో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. వడదెబ్బంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా రూ.4లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించింది.
పరిహారం పొందేందుకు కావాల్సిన పత్రాలు..
మరణానికి కారణం వడదెబ్బ అని స్పష్టం చేసే పోస్టుమార్టం రిపోర్టు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఎఆర్ జిరాక్స్ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం.మరణించిన రోజున ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణశాఖ నుంచి పొందిన ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు విధానం..
అర్హులైన వారు పైన పేర్కొన్న పత్రాలతో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ తుది ఆమోదం తెలుపుతారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే పరిహారం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. వడదెబ్బ మరణాల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.



