Saturday, April 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅగ్ని గండం!

అగ్ని గండం!

- Advertisement -

భానుడి భగభగలు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇవి భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు, చిరు వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్‌ నెలలోనే సాధారణంకంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే వడదెబ్బతో జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్టు వార్తలు. గురువారం ఒక్కరోజే ముగ్గురు చనిపోవడం, వారిలో ఓ మహిళా ఉపాధి కూలీ ఉండటం బాధాకరం. పనికి వెళ్లకపోతే పస్తులు, వెళ్తే ప్రాణం కోల్పోవడం అన్నట్టుగా ఉందీ పరిస్థితి. పదిజిల్లాల్లో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెదర్‌ రిపోర్టు వెల్లడించింది. మరో నాలుగురోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనుందని, ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ముప్తై జిల్లాలకు హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలెర్ట్‌ విధించింది. ఓవైపు ఎండలు దంచికొడు తుంటే, మరోవైపు అక్కడక్కడ చిరు జల్లులతో భూమి మరింత వేడెక్కింది. ఇది కొన్నిచోట్ల వ్యవసాయంపై ప్రతికూలత చూపగా పౌల్ట్రీ రంగంపై దీని ప్రభావం మరింత ఉంది. ఎండవేడికి కోళ్లు చనిపోవడం ప్రత్యక్షంగా యజమానులకు, పరోక్షంగా కార్మికులకు దెబ్బ.

గతేదాడి ఇదే సమయానికి నలభై డిగ్రీల చుట్టూ నమోదైన ఉష్ణోగ్రతలు, ఈసారి నలభై ఐదు డిగ్రీలకు ఎగబాకడం తెలంగాణలో వాతావరణ సంక్షోభాన్ని ఎత్తిచూపుతోంది. మేలో రావాల్సిన ఎండలు ఏప్రిల్‌లోనే దాడిచేయడం ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. 2025 ఏప్రిల్‌ మధ్యలో చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 42 వద్దే ఆగాయి. కానీ, ఈ సారి దాదాపు అన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో 45కి దగ్గరవ్వడం వాతావరణ హెచ్చుతగ్గులుగా చూడకూడదు, ఇది ఒక విపత్తు. తెల్లారితేచాలు ఉరుకుల పరుగుల జీవనంలో బతికే హైదరాబాద్‌ మహానగరంలో కూడా గతంతో పోలిస్తే రెండు డిగ్రీలు పెరిగాయి. ఎండలు ఇంతలా మండిపోవడానికి వాతావరణ మార్పు ఒక కారణమైతే, రెండోది అడవుల నరికివేత, చెరువుల మాయం, భూగర్భ జలాల క్షీణత. ఇంకా చెపాల్సివస్తే కాంక్రీట్‌ నగరాలు, రాజ ధాని సహా పట్టణాల్లో చెట్లు తగ్గి, సిమెంట్‌ బిల్డింగ్స్‌, గాజు భవనాల పెరుగుదల. దీంతోనే ‘హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌’ తీవ్రమవు తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇది అభివృద్ధే కదా అన్న వాదనలున్నా దీని సమతుల్యతను పాటించడంలో ప్రభుత్వాలు ఉదాసీనతను ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా ఎండకాలంలో ఎండలు, వానాకాలంలో వానలు విపరీతమై ప్రజల్ని చుట్టుముడు తున్నాయి.

మరి పాలకులు ఏం చేస్తున్నట్టు? వారికి బాధ్యతేం లేదా?- ఎవరికైనా సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. ‘ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండలకు బయటకు రాకండి’ వంటి ప్రకటనలకు పరిమితమైతే శ్రమజీవుల జీవితాలు ఏం కావాలి? కుటుంబపోషణ కోసం పనిచేయకుంటే వారి ఆకలి ఎలా తీరుతుంది? పనిప్రదేశాల్లో వసతులు కల్పించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం, సమయపాలన మార్చడం చాలా ముఖ్యం. కానీ, ఈ చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం లేదు. పైకి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్ని ‘ఎండ’లకు వదిలేసి పిట్టల్లా రాలుతుంటే చోద్యం చూడటం సరికాదు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కుట్లపల్లికి చెందిన రుక్కమ్మ ఉపాధి కూలీకి పోయి మధ్యాహ్నం ఇంటికొచ్చిన కాసేపటికే వాంతులు చేసుకుని చనిపోయింది. ఆమెకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. వారిని దిక్కెవరు? వ్యవసాయ కూలీలు, రైతులదీ ఇదే పరిస్థితి. వేసవికి ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది.

ఉద్యోగుల పరిస్థితి కూడా భిన్నమేమి కాదు, బస్సుల కోసం గంటల తరబడి నిలబడటం, ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఎండలో తిరిగే ఫీల్డ్‌స్టాప్‌, పోస్టుమేన్‌, లైన్‌మెన్‌, పోలీస్‌ సిబ్బంది-అందరూ వేడితీవ్రతను భరిస్తున్నారు. కాలేజీలు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన తాగునీరు, కూలింగ్‌ సదుపాయలు కూడా అరకొరగానే ఉన్నాయి. సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వారు ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వ ఆదాయానికి, అభివృద్ధికి సహకరిస్తారు. నగరంలో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, ట్రాఫిక్‌ పోలీసుల పరిస్థితి ఈ ఎండలో మరీ భయానకం. సిగల్‌ పడగానే రెండు మూడు నిమిషాలు వాహనాలు ఆపాల్సి ఉంటుంది. మధ్యాహ్నం వేడిగాలి భరించలేనిది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద చలువ పందిళ్లు వేసి, ప్రజల్ని రక్షించాలనే నిబంధలున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదు. అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు, మజ్జిగ పంపిణీ అభినందనీయం. ఏప్రిల్‌లోనే ఎండలిలా ఉంటే మేలో తలచుకుంటేనే ఆందోళనగా ఉంది. తాత్కాలిక చర్యలు ఎన్ని చేపట్టినా ప్రజలు, ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉంటాయి. మళ్లీమళ్లీ మనకు నష్టం చేస్తూనే ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -