కొన్ని పేర్లు వ్యక్తులను మాత్రమే సూచించవు…ఒక భావాన్ని, ఒక యుగాన్ని, ఒక నిరంతర ప్రశ్నను సూచిస్తాయి. కొన్ని స్వరాలు కేవలం కవిత్వంగా వినిపించవు… అవి గాయాల్ని వెలిబు చ్చు తాయి, చరిత్రను చెబుతాయి, భవిష్యత్తును ప్రశ్నిస్తాయి. అలాంటి స్వరమే స్కైబాబా. అతనే షేక్ యూసుఫ్ బాబా. నల్గొండ జిల్లా కేశరాజుపల్లి అనే చిన్న గ్రామంలో అతని పుట్టుక ఒక వ్యక్తిగా సాధారణమే కావచు, కానీ ఎదుగుదల ఒక ఆలోచనతో సాగింది. ఆ ఊరి సరిహద్దులు అతన్ని ఆపలేకపోయాయి. అతని ఆలోచనలు ఆకాశం వైపు ఎగిరాయి. అందుకే అతను ‘స్కైబాబా’.
స్కైబాబా కవిత్వం చదివితే అది కవితలా అనిపించదు… ఒక మనిషి మనసు పగిలి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.’అజాన్’లో ఉన్న పిలుపు, కేవలం నమాజు కోసమే కాదు… చైతన్యం వైపునకు పిలుపు.’జల్‌జలా’ లో ఉన్న ప్రకంపన, సమాజంలోని నిశ్శబ్దాన్ని ఛేదించే సంచలనం.’దర్ద్’లో ఉన్న నొప్పి, వ్యక్తిగతమైనది కాదు…సమాజం గుండె లోతుల్లో మెలిపెడుతున్న బాధ.’అలావా’, ‘వతన్’ ఇలా ఎన్నో.. మరెన్నో అనుభవాల ప్రతిధ్వనులు.ఇవి పేర్లు కాదు… గుర్తింపు కోసం, స్వాభిమానం కోసం జరిగిన అంతర్గత యాత్రలు. పాలస్తీనా నేపథ్యంలో రాసిన ‘నేలలేని దేశం’ ఒక కవితా సంపుటి మాత్రమే కాదు, అది మానవత్వానికి సంధించిన ప్రశ్న.
స్కైబాబా రచనలు కేవలం సాహిత్యానికి పరిమితం కావు. అవి సమాజంతో నేరుగా సంభాషిస్తాయి. అతని పదాలు మృదువుగా ఉండవు…అవి కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన లక్ష్యం ఆకట్టుకోవడం కాదు, మెలకువ తీసుకురావడం, జాగృతం చేయడం. ముస్లిం సమాజం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది బయటివారిగా మాట్లాడతారు. కానీ స్కైబాబా… లోపలివాడిగా మాట్లాడతాడు. అతను విమర్శిస్తాడు…కానీ ద్వేషంతో కాదు, పరివర్తన కోరికతో. మతతత్వం అనే గోడలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఆ గోడలు మనుషులను విభజిస్తాయి, చైతన్యాన్ని బంధిస్తాయి.
అతను ఆవిష్కరించిన ముస్లింవాదంపై భిన్నాభిప్రాయాలుం డవచ్చు. కాని, అది ఎవరిపైనా వ్యతిరేకత కాదు, తమలో చైతన్యం కోసం చేసే పోరాటమే అంటాడాయన. అయితే, ఈ స్వరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానిలోని మరో కోణాన్ని కూడా చూడాలి. స్కైబాబా స్వరంలో ఉన్న కఠినత, అతని నిబద్ధతకు ప్రతిబింబం అయినప్పటికీ, కొన్నిసార్లు అదే కాఠిన్యం అతని విమర్శల ఒక కోణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందనే భావన కలుగుతుంది. ముస్లిం సమాజంలో ఉన్న లోపాలపై ఆయన వేసే ప్రశ్నలు సార్ధకమైనవే, వరకట్నం, కుటుంబ అన్యాయాలు, వడ్డీ వంటి అంశాల్లో కనిపించే విరుద్ధతలను ఎత్తిచూపడం అవసరమే. అయితే, ఈ విమర్శలు కొన్ని సందర్భాల్లో ఆచరణలోని లోపాలకన్నా మత సిద్ధాంతాలపై ప్రశ్నలుగా వినిపిస్తుంటాయి. స్కై ఉద్దేశం ఏమైనప్పటికీ, ఆయన మాటల తీరు కొన్నిసార్లు అదే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. స్కై ఆ దిశలో మరింత స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది.
స్కైబాబా చూపించే ఆవేదన, ఆవేశం అతని నిజాయితీకి నిదర్శనం అయినప్పటికీ, అదే సమయంలో సిద్ధాంతం, ఆచరణ మధ్య ఉన్న తేడాను మరింత స్పష్టంగా రేఖాంకితం చేస్తే ఆయన సందేశం ఇంకా బలంగా, విస్తృతంగా వినిపించే అవకాశం ఉంది. ఒక ఉద్యమకారుడిగా, కవిగా ఆయన స్వరం ఎంత ప్రభావవంతమో, అదే స్థాయిలో సమతుల్యత కూడా అతని ఆలోచనలకు మరింత విశ్వసనీయతను తీసుకువస్తుంది. ఈ ఆలోచనా తీరే అతన్ని కేవలం రచయితగా కాకుండా తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా మలిచింది.ఎందుకంటే ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తుతాడు. ప్రశ్నలు లేవనెత్తిన చోట వివాదాలు తప్పవు. కానీ…ఈ వివాదాల మధ్య కూడా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదే అతని నిబద్ధత. అతని నిజాయితీ. నమ్మిన దారిలో నడవడం అంత సులభం కాదు. ప్రత్యేకంగా ఆ దారి విమర్శలతో నిండినదైనప్పుడు. కానీ స్కైబాబా ఆ దారినే ఎంచుకున్నాడు. అందుకే అతను ఒక రచయిత మాత్రమే కాదు, ఒకానొక నిబద్ధతకు ప్రతీక. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం సామాజిక న్యాయం కోసం చేసిన ప్రయత్నం. బహుజన వర్గాలతో ఆయన కలిసిన విధానం ఒక సమైక్యతా దృక్పథం. ముస్లిం సంఘీభావ సంకలనాలు ఒక సామూహిక చైతన్యానికి సూచిక.
స్కైబాబా రచనల ప్రభావం కేవలం తెలుగు వరకే పరిమితం కాలేదు. ఆయన రాసిన ముస్లిం కథలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదమై పుస్తకాల రూపంలో వెలువడి విస్తృత ఆదరణ పొందుతున్నాయి. మలయాళంలోనూ ఆయన రచనలు పాఠకులను చేరుకోవడం, స్కైబాబా ఆలోచనలకు భాషా సరిహద్దులు లేవన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుం ది.ఈ అన్ని చర్యలు కలిపి చూస్తే స్కైబాబా ఒక వ్యక్తి కాదు, ఒక ప్రక్రియ. ఒక నిరంతర యాత్ర. ఈ యాత్ర వెనుక ఉన్న ఆలోచనా దిశను గమనిస్తే…స్కైబాబా ఆలోచనల్లో కేవలం ప్రతిఘటన మాత్రమే కాదు, ఒక నిర్మాణాత్మక దిశ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.ఇలాంటి ఆలోచనలతో సాగుతున్న నిరంతర ప్రయాణానికి ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఆ అప్రతిహత యాత్రకు ఇప్పుడొక గౌరవం దక్కబోతోంది. 2026 ఏప్రిల్ 18న, మహారాష్ట్రలోని పూణేలో ‘స్వాతంత్య్ర సమరయోధుడు బాబూమియా బ్యాండ్ వాలే జాతీయ సమైక్యత అవార్డు’స్కైబాబాకు ప్రదానం చేయబడు తోంది. ఈ రోజుల్లో సమైక్యత అనే మాట చాలాచోట్ల వినిపిస్తోంది. కానీ ఆచరణలో కనిపించదు.స్కైబాబా మాత్రం దాన్ని ఆచరించాడు, దానికోసమే జీవించాడు. అతని రచనలు, అతని ఉద్యమాలు, అతని సంబంధాలు – అన్నీ అదే దిశలో ఉన్నాయి.
యండి.ఉస్మాన్‌ఖాన్



