Saturday, April 18, 2026
E-PAPER
Homeక్రైమ్మేడిపల్లి నక్కర్తలో ఉద్రిక్తత

మేడిపల్లి నక్కర్తలో ఉద్రిక్తత

- Advertisement -

– ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు
– బహిరంగ చర్చకు రావాలని టెంట్‌ వేసిన బీఆర్‌ఎస్‌.. తొలగించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
– మేడిపల్లిలో 144 సెక్షన్‌
– ఇరు గ్రూపులను అరెస్టు చేసిన పోలీసులు
– పరస్పరం దిష్టిబొమ్మల దహనం
– తోపులాటలో గాయపడిన మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్తలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూముల్లో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించిన నేపథ్యంలో సవాళ్లు ప్రతిసవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ అంశంపై బహిరంగ చర్చకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గ్రామపంచాయతీ పక్కన టెంట్‌ వేయించారు. ఆ టెంట్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తలు కూల్చేశారు. దీంతో మేడిపల్లిలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటాపోటీగా రోడ్డుపై బైటాయించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి తన అనుచరులతో మేడిపల్లికి చేరుకోగానే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రంగారెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఫార్మాసిటీలో చేసిన అవినీతిని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసుల తోపులాటలో ప్రశాంత్‌కుమార్‌రెడ్డి భుజానికి గాయమైంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కర్నాటి రమేష్‌గౌడ్‌, పాశ్చ భాష, రాజునాయక్‌తో పాటు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు సంపత్‌కుమార్‌, మోటే శ్రీశైలం తమ అనుచరులతో రోడ్డుపై బైటాయించారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు యాచారం కేంద్రంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల గొడవ సద్దుమణిగింది.
ఉదయం మేడిపల్లికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పోలీసులు ఇబ్రహీంపట్నంలోని ఆయన క్యాంపు కార్యాలయంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు సాగర్‌ ప్రధాన రహదారిపై బైటాయించారు. ‘తప్పులు నిరూపిస్తామంటే మల్‌రెడ్డి రంగారెడ్డి పారిపోయాడు.. తెలంగాణ విడిచి వెళ్లాడు’ అంటూ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. అనంతరం మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ శ్రేణులు దహనం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు నిరసనకారులను చల్లాచెదురు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -