30 లక్షల మెట్రిక్ టన్నుల
బాయిల్డ్ రైస్ సేకరించండి
ఐదు శాతం నూకతో సరఫరాకు సిద్ధం
పోషకాహార బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరించండి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన (2014-15) వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.96 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని తెలిపారు. ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాపై లెక్కలే చెబుతున్నా యని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలంటూ ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వారు వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి సీఎం, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని వారు గుర్తు చేశారు.
పోషకాహార బియ్యం పంపిణీని పున: ప్రారంభించాలి
దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖపై ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాల నివారణకుగానూ పోషకాహార బియ్యాన్ని (ఎఫ్ఆర్కే) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పున్ణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, సెక్రెటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పాత బకాయిలు చెల్లించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



