Saturday, April 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిగాచి బాధితులకు రూ.కోటి పరిహారమేదీ?

సిగాచి బాధితులకు రూ.కోటి పరిహారమేదీ?

- Advertisement -

– ఇచ్చిన హామీని నిలబెట్టుకోని ప్రభుత్వం
– సీఎం రేవంత్‌రెడ్డి మాటకు విలువ లేకపోతే ఎలా? : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రూ.కోటి పరిహారం ఇస్తామని చెప్పి అందులో సగం కూడా వారికి చేరలేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకే విలువ లేకపోతే ఎలా?అని ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్‌, దామోదర రాజనర్సింహ మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అదంతా కంటితుడుపు చర్యే అనీ, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని వివరించారు. మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు. యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ.24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ.45.40 లక్షలు మాత్రమేనని వివరించారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.కోటి పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.54.60 లక్షల చొప్పున, మొత్తం రూ.29.48 కోట్ల బకాయి ఉందని తెలిపారు. దీన్ని ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని విమర్శించారు. రూ.కోటి పరిహారం ఎవరిస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద అటాచ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏ కొర్రీలు లేకుండా రూ.కోటి పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -