– డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్లే వీగిపోయింది : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోవడానికి బీజేపీదే బాధ్యత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని ముడి పెట్టడంతోనే ఆ బిల్లు వీగిపోయిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలూ మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా బీజేపీ కుటిల రాజకీయంతోనే బిల్లు వీగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకొచ్చి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం జారిపోయిందని వివరించారు. బీజేపీ రాజకీయ స్వార్థానికి మహిళలు బలయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. డీలిమిటేషన్ అంశం అత్యంత సంక్లిష్టమైనదని తెలిపారు. దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గడం ప్రమాదకరమనీ, దీన్ని బీజేపీ గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ అంశంపైన విస్తృతమైన చర్చ, సంప్రదింపులు చేపట్టాలని సూచించారు. మహిళా బిల్లుతో, దేశవ్యాప్త డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028లోపు పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



