సొంత జిల్లాల్లోనే చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యం : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తామనీ, సొంత జిల్లాల్లోనే రోగులకు చికిత్స అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రులను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్- డీసీహెచ్‌ఎస్) బలోపేతం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం జరిగింది. అందులో మంత్రితో పాటు జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మెన్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, డాక్టర్ అజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.టీవీవీపీ పరిధిలోని హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, మంజూరైన పోస్టుల కేటాయింపు, తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. టీవీవీపీ పోస్టులు, వైద్య సిబ్బందిని రీడిప్లారుమెంట్ చేసేటప్పుడు ఐపీహెచ్‌ఎస్ నిబంధనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సేవలను సమర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించుకునే బాధ్యత డిపార్ట్‌మెంట్ల హెచ్‌వోడీలపై ఉందన్నారు. డ్యూటీలకు గైర్హాజరయ్యే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు వారి నివాసాలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఏరియాస్పత్రుల్లో ఫాలోఅప్ ట్రీట్‌మెంట్ అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. సెకండరీ హెల్త్ కేర్ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఆసత్రుల్లో మౌలిక వసతుల కల్పనను మరింత మెరుగుపర్చాలని కోరారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీలతో మంత్రి సమావేశం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి అవసరమైన చర్యలు చేపట్టేందుకు నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశమయ్యారు. కమిటీల సూచనలను పరిగణలోకి తీసుకుని, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రయివేటు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు, ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ మానిటరింగ్ వంటి అంశాలపై మరింత దృష్టి సారించాలని కమిటీలకు మంత్రి సూచించారు.
సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



