జిల్లాలో పర్యటించిన
కేంద్ర బృందం
ఏరోడ్రమ్ భూముల పరిశీలన
త్వరలో స్పష్టత వస్తుందని వెల్లడి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై కదలిక మొదలైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ మేరకు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. కేంద్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం జిల్లాలో పర్యటించి.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఓఎల్‌ఎస్ సర్వే నిర్వహించింది. ప్రతిపాదిత భూములను పరిశీలించి, విమానాశ్రయ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై ఈ బృందం నివేదిక సిద్ధం చేయనుంది. ఏరోడ్రమ్, అనుకుంట, లాండసాంగ్వి, నిషాన్‌ఘాట్ శివారు ప్రాంతాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఇన్‌చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మట్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన సర్వే జరిపారు.
ఓఎల్‌ఎస్ సర్వే
ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూముల పరిశీలనలో భాగంగా రన్‌వేకు అడ్డంకిగా ఉన్న భవనాలు, చెట్లు ఇతర నిర్మాణాల గుర్తించి, వాటి ఎత్తును కొలిచారు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో రన్‌వే చుట్టపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలతోపాటు చెట్లు ఇతర అవరోధాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించటంలో ఆప్టికల్ లిమిటేషన్ సర్వే (ఓఎల్‌ఎస్) చేపట్టారు. అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ అధికారులు, రాష్ట్ర అధి కారులు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భూసేకరణ, సాంకేతిక అంశాలు, భౌగోళిక పరిస్థితులు, విమానాల టేకాఫ్, ల్యాండింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్(ఏటీసీ) టవర్ల ఏర్పాటు తది తర అంశాలపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
అవసరమైతే సీసీఐ భూములు: ఎమ్మెల్యే పాయల శంకర్
ఎయిర్‌పోర్టు నిర్మాణంపై గతేడాది నుంచి ఒక్కొక్కటిగా అనుమతులు వస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఇప్పుడున్న 369.45 ఎకరాలకు అదనంగా మరో 430.30 ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా మొత్తం 1500 నుంచి 1700 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారని చెప్పారు. ఒక టెర్మినల్ నిర్మాణానికి 80 ఎకరాల భూమిని ఉపయోగిస్తుండగా, మిగిలిన భూమిని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, టౌన్‌షిప్, పాఠశాలల నిర్మాణానికి ఉపయోగిం చనున్నారని వివరించారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం విమానాశ్రయ రూప కల్పనలో కీలక మార్పులు చోటుచేసుకు న్నాయి న్నారు. అవసరమైతే మూతబడిన సిమెంట్ ఫ్యాక్టరీకి ఆనుకొని ఉన్న భూములను కూడా సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విషయం పట్ల త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా విమాన సాధికార సంస్థ(ఏఏఐ) అధికారి భరత్‌రెడ్డి మాట్లాడుతూ.. విమానా శ్రయం ఏర్పాటుకు ఆప్టికల్ లిమిటేషన్ సర్వే చేశామన్నారు. సాంకేతిక అంశాలు పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. త్వరలో మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వస్తుందన్నారు. సమావేశం, పరిశీలనలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, ఆర్డీఓ స్రవంతి, ఎయిర్‌ఫోర్స్ అధికారులు రాహుల్ శుక్షా, ఎస్‌జి.హెడ్గే, జెపి సబర్వాల్, రాజీవ్, డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టుకు పూర్తి సహకారం : కలెక్టర్
విమానాశ్రయం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. గతంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే ఇక్కడ విమానాశ్రయ కార్యకలాపాలు నిర్వహించాలని భావించిందని, తాజా నిర్ణయం ప్రకారం ఇక్కడ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీనివల్ల శిక్షణ కేంద్రం, రక్షణ రంగానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 1000 ఎకరాల భూమి సేకరించాలని ఎయిర్‌ఫోర్స్ అధికారులు కోరారని చెప్పారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఓఎల్‌ఎస్ సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



