గొంతునొక్కేందుకే రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : మాస్ లైన్ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. రాజ్యాంగం పౌరులకు కల్పించిన కనీస ప్రాధమిక హక్కులను హరిస్తున్నది’… అని పలువురు వక్తలు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు, ఇతర మేధావులు, హక్కుల కార్యకర్తలకు ఇచ్చిన ఎన్ఐఏ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్, గడ్డం లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఆర్ఎస్పీ కార్యదర్శి జానికి రాములు, ఎంసీపీఐ నాయకులు కె వెంకన్న, సీపీఐ(ఎంఎల్) సీపీ ప్రసాద్, ఎంఎస్పీ శ్రీనివాస్, ప్రజాకవి జయరాజు తదితరులు మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావుకు ఎన్ఐఎ. నోటీసులు ఇవ్వడం అంటే..ప్రజల గురించి, ప్రభుత్వ విధానాల గురించి, రాజాంగ విలువల గురించి మాట్లాడకుండా చేయటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని విమర్శించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఫెడరల్ స్ఫూర్తినీ కాలరాయడమేనని దుయ్యబట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాల్లో సీపీఐ(ఎం) కలిసి వస్తున్నదని తెలిపారు. హరగోపాల్, కోదండరాం మాట్లాడుతూ ద్ణుఖాన్ని, సానుభూతిని వ్యక్తం చేయడాన్ని కూడా నేరంగా భావించడమేంటని ప్రశ్నించారు. జరిగే పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక శక్తుల ఐక్యతను కూడగట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోడీ ప్రభుత్వం యథేచ్చగా రాజ్యాంగ హక్కులను, చట్టాలను ఉల్లంఘిస్తున్నదని వివరిరచారు. చట్టబద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని చెప్పారు. చివరకు చట్టబద్దంగా తీర్పులిచ్చే న్యాయమూర్తులను, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీని సైతం అర్భన్ నక్సలైట్‌గా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు గట్టిగా నినదించకపోతే, రేపు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని హెచ్చరించారు. ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘించి రాష్ట్రంలో ఎన్ఐఎ. చేస్తున్న ఘటనలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని కోరారు. వందలాది మందికి నోటీసులు, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. సమావేశంలో మాస్ లైన్ నాయకులు ఎం. హన్మేశ్, సదానందం, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. సూర్యం, ఎస్.ఎల్. పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు డి. స్వరూప తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ హక్కులను హరిస్తున్న కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



