Monday, July 14, 2025
E-PAPER
Homeదర్వాజమూలం క్లిష్టంగా ఉంటే అనువాదం కష్టం

మూలం క్లిష్టంగా ఉంటే అనువాదం కష్టం

- Advertisement -

అనువాదం కష్టంగా తోచే సందర్భాలు పలు రకాలుగా ఉంటాయి. మూలభాషకు చెందిన ప్రజల సాంస్కతిక జీవనం గురించి అసలే
అవగాహన లేకపోవడం, ఆ భాషలోని జాతీయాలు (idioms) తెలియకపోవడం కొన్నిసార్లు కారణమైతే, మరికొన్నిసార్లు మాండలికాన్ని
(dialect ను) లేదా యాస (slang)ను లక్ష్యభాషలోకి తీసుకుపోవడం కష్టమౌతుంది. ఈ రెండు కష్ట హేతువులు లేకపోయినా,
అప్పుడప్పుడు మూలభాషలోని భావం సరిగ్గా అందదు. మళ్లీ ఇది రెండు రకాలుగా ఉండవచ్చు: కచ్చితమైన సమానార్థక పదం
దొరకకపోవడం (మూలవిధేయతకు ప్రాధాన్యమిచ్చినప్పుడు) మొదటిది కాగా, ఒక పదానికి ఒకటి కన్నా ఎక్కువ అర్థాలుండి అందులో ఏది
మూలంలోని భావానికి వర్తిస్తుందో నిర్ణయించుకోలేకపోవడం రెండవది. ఈ రెండవ రకానికి చెందిన ఇబ్బందిని ముఖ్యాంశం చేస్తూ
సాగుతున్న చిన్న వ్యాసం ఇది.

టు ద ఇండియన్‌ ఫారెస్టర్స్‌ అనే ఆంగ్ల కవితను తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు ఈ వ్యాసరచయిత ఎదుర్కొన్న అర్థపరమైన సందిగ్ధత(ambiguity of eaning)శీర్షికకు సంబంధించిందే. ఫారెస్టర్‌ అంటే అటవీ అధికారి అని మనలో చాలా మందికి తెలుసు. కానీ, ఇదే పదానికి అడవిలో జీవించే చెంచులు మొదలైనవాళ్లు (వనవాసులు) అనే మరో అర్థం కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో శీర్షికలో, పంక్తులలో అటవీ అధికారులు అనే మాటను ఉపయోగించాలా, లేక వనవాసులు అని రాయాలా అనే సందేహం కలుగుతుంది. నిజానికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కవితలోని సందర్భాన్ని, భావాన్ని పరిశీలిస్తే కవి ఎవరిని ఉద్దేశిస్తున్నాడో తెలియవచ్చు. కానీ కొన్నిసార్లు అది కూడా రెండు సమూహాలకూ వర్తించే విధంగా తటస్థంగా లేదా మధ్యస్థంగా ఉంటుంది. ఈ కవితలో అదే జరిగింది. కొన్ని పంక్తులను చూడండి:


”ఎందరి కన్నానో ఎక్కువ సాధించారు మీరు/ అయినా గొప్పలు చెప్పుకోని మౌనులు మీరు/ మీరు కీర్తినో ఉపకారాన్నో ఆశించలేదు/ మీకున్నది శ్రమ పట్ల ప్రేమ”
కవిత ఇట్లా సాగింది తప్ప, ఎక్కడా అటవీ అధికారుల విధినిర్వహణ గురించి గానీ, వారి యూనిఫాం గురించి గానీ, జీతం అనే మాట గానీ ఏదీ లేదు. అదేవిధంగా చెంచుల/ బోయల ఇళ్లు, తిండి, గుడ్డలు, వేట, అలవాట్లు – వీటిలో దేని గురించీ సూచన లేదు. కాబట్టి, రెండు సమూహాల్లోని ఎవరికైనా వర్తించవచ్చునని అనిపిస్తుంది. అదష్టం కొద్దీ చివరన ఒక ఫుట్‌ నోట్‌ (అథస్సూచిక) ఉంది. అందులో ‘అటవీ పరిశోధన సంస్థకు చెందిన యువ అధికారుల సమావేశంలో చదివిన కవిత’ అనే వాక్యం కనిపించింది. ఇంకేం? సందిగ్ధత తొలగింది. కానీ ఒకవేళ ఆ ఫుట్‌ నోట్‌ లేకపోయి ఉంటే సందేహం వీడేది కాదు. అప్పుడేం చేయాలి? మూలకవి బతికివుంటే అతడిని సంప్రదించే ప్రయత్నం చేయవచ్చు. లేని పక్షంలో నిపుణులైన సహ అనువాదకుల సహాయాన్ని కోరవచ్చు. ఇవేవీ కుదరకపోతే మనకు ఏది సబబు అనిపిస్తే దాన్నే అనుసరించడం తప్ప వేరే మార్గమేముంది!?


మరో ఉదాహరణ: నాడ్యా కుషైన్‌ మైస్టర్‌ అనే జర్మన్‌ కవి రాసిన ‘బ్లాక్‌ లాండ్రీ’ కవితను ఐమీ కోర్‌ ఆంగ్లంలోకి అనువదించారు. దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు కూడా శీర్షిక దగ్గరే తట్టుకోవడం జరిగింది. సాధారణంగా లాండ్రీ అంటే మురికి గుడ్డలను ఉతికే, ఇస్త్రీ చేసే స్థలం. బట్టల్ని లాండ్రీకి వేయాలి, లాండ్రీ నుంచి తెచ్చుకోవాలి మొదలైన వాక్యాలను తరచుగా వాడుతుంటాం లేదా వింటుంటాం. కానీ, కవితలో ఒకచోట ‘కంచె పక్కనుండి పోయే తోవ కూడా నల్లని ఒక లాండ్రీ’ అని వస్తుంది. ఐతే ఇది కవిత్వం కనుక, దేన్ని దేనితోనైనా పోల్చి రాస్తారు కవులు – ముఖ్యంగా ఆధునిక/ పోస్ట్‌ మాడర్న్‌ కవిత్వంలో. కాబట్టి, పెద్దగా అనుమానం రాకపోవచ్చు. కానీ పీసెస్‌ ఆఫ్‌ లాండ్రీ (pieces of laundry) అని వస్తుంది ఒకచోట. ఇక్కడ అనువాదకునికి అనుమానం రావాలి. లాండ్రీ స్థలమైతే, దాని ముక్కలు అనే మాటలు పొసగవు. కూలిపోవడం అనే మాట లేకుండా ముక్కలు కావడం సందేహాన్ని కలిగించాలి.


అసలు విషయమేమంటే, లాండ్రీ అన్న పదానికి ఉతకవలసిన లేదా అప్పుడే ఉతికిన గుడ్డలు అనే మరో అర్థం కూడా ఉంది.There is a pile of dirty laundry in the bathroom అంటే స్నానాల గదిలో, ఉతకవలసిన మురికిగుడ్డల కుప్ప ఉంది అని అర్థం. అదేవిధంగాShe went outside to hang some laundry on the line అంటే, ఉతికిన కొన్ని గుడ్డలను దండెం (తాడు) మీద ఆరేయడం కోసం ఆమె బయటికి వెళ్లింది అని భావం. నేటివ్‌ స్పీకర్స్‌కు (ఆంగ్లం మాతభాష అయినవాళ్లకు/ పుట్టినప్పటి నుంచి ఇంగ్లిష్‌ మాట్లాడుతూ వస్తున్న వారికి) ఈ అర్థం వెంటనే స్ఫురిస్తుంది. ఇతరులకు అలా స్ఫురించడం అరుదు. ఐతే, ఓపికతో ఎన్నో నిఘంటువులను సంప్రదిస్తే అది తెలియవచ్చు. కాబట్టి, బ్లాక్‌ లాండ్రీని నల్లని లాండ్రీ అని కాకుండా, నల్లని మురికి గుడ్డలు అని అనువదించాలి.
– ఎలనాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -