నవతెలంగాణ – తుంగతుర్తి
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ ల పిలుపుమేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కంట్లమయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 64 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, జూన్ 2వ, తేదీ నాటికి పిఆర్సి అమలు పరచాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డ్స్ అమలు, పెండింగ్ డిఎ లను విడుదల చేయాలని అన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కంట్లమయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్వతం సంధ్యారాణి, తుంగతుర్తి మండల అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, రుద్ర దేవేందర్, సైదులు, మల్లెపాక రవీందర్, గుజ్జ భాస్కర్, బింగి సోమయ్య, పాలవరపు సంతోష్, మండల పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



