తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు జాడి రాజన్న..
నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై పరిష్కరించాలని జెఏసి నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండల, డివిజన్ మరియు జిల్లా కేంద్రాలలో శుక్రవారంనాడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక పెన్షనర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
2వ పి.ఆర్.సి (PRC) కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, వెంటనే నివేదికను తెప్పించి 51% ఫిట్మెంట్తో జూన్ 2వ తేదీలోపు 2వ పి.ఆర్.సిని అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కొత్త EHS (Employees Health Scheme) విధానాన్ని. వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను తక్షణమే అందుబాటులోకి తేవాలి.
ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ముఖ్యంగా 01/09/2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15.25 లక్షల ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ 4 ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర 64 పెండింగ్ అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. తదనంతరం TGEJAC నాయకులు మండల తహసీల్దార్ ను కలిసి మెమోరాండం సమర్పించి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో TGJAC నాయకులు కట్ట రాజమౌళి,తుంగూరి గోపాల్,అనుముల రాజన్న సత్యనారాయణ, నర్సయ్య,R. శ్రీనివాస్, భూమన్న, బుచ్చన్న, రాజారావు తదితరులు పాల్గొన్నారు.



