దేశంలో ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిత్యావసరాల ఖర్చుల నుంచి చిన్న పరిశ్రమల ఉత్పత్తి వ్యయాల వరకు ప్రతి రంగంపైనా ఈ భారం పడుతోంది. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు ఒకేసారి పెరగడంతో సెప్టెంబరులో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 11.39 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 9.92 శాతంగా ఉంది. అంటే ఒక్క నెలలోనే 1.47 శాతం పాయింట్లు పెరిగింది. 2022-23 ఆధార సంవత్సరంగా తీసుకుని రూపొందించిన కొత్త సిరీస్లో ఇదే అత్యధిక స్థాయి అని ప్రభుత్వ మే అంగీకరించింది. టోకు మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగితే వ్యాపారులు, తయారీదారుల కొను గోలు ఖర్చులు అధిక మవుతాయి. ఈ భారం చివరకు సామాన్యుల వంటగదిపై, చిన్న పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై పడుతుంది.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే దేశంలో ధరలు అదుపు లేకుండా పెరుగుతు న్నాయి. దీంతో కోట్లాది మంది ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ము, పొదుపు కరిగిపోతు న్నాయి. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి, హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ద్వారా ప్రజల సంపదలో గణనీయమైన భాగాన్ని హరించివేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్నదీ అదే. ఆహార పదార్థాల ధరలు, ఇంధన సంబంధిత రవాణా ఖర్చులు పెరగడంతో చిల్లర ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిందని జాతీయ గణాంక సంస్థ నివేదికలు చెబుతున్నాయి.
తాజాగా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కూడా పెరగడంతో రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. దీనివల్ల స్థిర ఆదాయంపై ఆధారపడే కుటుంబాలు, వేతన జీవులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
టోకు ధరల ద్రవ్యోల్బణం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, ఇంధన ఖర్చులు, ముడిసరుకుల ధరలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే వాటి భారాన్ని పూర్తిగా ప్రజలపై వేయడం సమర్థనీయం కాదు. ధరలను నియంత్రించ డంలో కేంద్ర ప్రభు త్వానికి కీలక బాధ్యత ఉంది. కానీ ఈ విషయం లో మోడీ ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా తప్పించు కుంటూ వస్తోంది. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఎరువులు, మందులు, వంట నూనెలు, పప్పుదినుసుల దిగుమతులు తగ్గి పోయి ధరలు భారీగా పెరిగాయి. ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలనే పేరుతో పెట్రోల్లో ఇథనాల్ను కలిపేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమయ్యాయి. మోడీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్లలో ఏదో ఒక రంగంలో ధరలు పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో కోటి టన్నులకు పైగా బియ్యం దిగుబడి తగ్గిపోవడంతో ఇప్పటికే బియ్యం ధరలు భారీగా పెరిగాయి.
మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి మళ్లించడంతో కోళ్ల పెంపక రంగ ఉత్పత్తుల ధరలు, పాల ధరలు పెరిగాయి. విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులన్నింటికీ దేశ పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణం.
దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ద్రవ్యోల్బణం ప్రభావాలను, దానికి గల కారణాలను ప్రభుత్వం అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ధరలు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రభుత్వ ఆదాయం తగ్గి, ద్రవ్యలోటు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. రైతులకు అందించే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విద్యుత్ వంటి వాటిపై సబ్సిడీలను ప్రభుత్వం తగ్గించింది. మరోవైపు సంపన్న వర్గాలకు, కార్పొరేట్ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు ఇచ్చింది. మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ వర్గాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఈ విధానాన్ని కొనసాగించారు. అదే సమయంలో ప్రజా సంక్షేమ పథకాలు, సేవలను క్రమంగా ప్రైవేటీకరణ వైపు మళ్లించారు. ఒకవైపు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదాయ మార్గాలు లేక ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తన పాలన అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి చెప్పుకోవడం చూస్తుంటే సామాన్య ప్రజల సమస్యలపై ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. అందుకే అధిక ధరలు, ఆహార ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ రాజధాని ఢిల్లీలో యువత ఉద్యమిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది.
సామాన్యుడిపై ‘ధరల’ దాడి!
2 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్లు (0)