Magazines

ఖనిజ సంపద -మూడో ప్రపంచ దేశాల అవస్థలు

1 గంట క్రితం

Mineral Wealth
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 6 నిమిషాల చదవడం

ప్రపంచం మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ నడుస్తున్నప్పుడు మూడవ ప్రపంచ దేశాల్లో ఖనిజ సంపద బాగా ఉన్న ఏదైనా దేశంలోగాని, ప్రాంతంలోగాని నివసించే ప్రజానీకానికి ఎదురయ్యే అవస్థలు దుర్భరంగా ఉంటాయి. సంపన్న పెట్టుబడిదారీ దేశాలున్న ఉత్తర భూగోళ ప్రాంతం పెట్టుబడిదారీ వ్యవస్థకు పుట్టిల్లు. అయితే, చారిత్రికంగా ఆ దేశాలలో ఎక్కడా ఖనిజ సంపద నిల్వలు పెద్దగా లేవు. సంపన్న దేశాలు ఖనిజ సంపద రీత్యా పేదగా ఉన్నాయి. ఇదొక విచిత్రం కదా. బ్రిటన్‌ ‌పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానానికి మొదట దారితీసిన దేశం. అక్కడా ఇదే పరిస్థితి. ఆసియాలో ఏకైక సంపన్న పెట్టుబడిదారీ దేశం జపాన్‌దీ అదే స్థితి. తమ సంపదను పెంచుకోడానికి అవశ్యమైన ముడి సరుకులను, ముఖ్యంగా ఖనిజాలను చేజిక్కించుకోవలసి రావడం సామ్రాజ్యవాదంగా ఈ దేశాలు రూపొందడం వెనుక ఒక బలమైన చోదక శక్తిగా పని చేసింది. వ్యాపారానికి పనికొచ్చే ఏదైనా ఖనిజ నిక్షేపాలు గనుక ఏదో ఒక మూడవ ప్రపంచ దేశంలో లభిస్తున్నట్టు వెల్లడైందనుకోండి. వెంటనే సంపన్న దేశాల నుండి బహుళజాతి కంపెనీలు ఆ దేశం మీదికి దిగబడిపోయి ఆ ఖనిజ సంపదను వెలికి తీయడానికి సిద్ధం అయిపోతాయి. ఆ వెలికితీత వలన ఆ దేశపు జిడిపి పెరుగుతుంది. కొంతకాలం పాటు ఆ దేశాన్ని గొప్పగా చిత్రిస్తూ, ఎగుమతులను పెంచుకుని ఒక దేశం ఎలా అభివృద్ధి సాధించగలదో ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలంటూ పొగుడుతూ సామ్రాజ్యవాదులు హడావుడి చేస్తారు. అయితే, ఆ దేశంలో ఉపాధి పెరుగుదల ఏమీ జరగదు.

కనీసం ఆ ఖనిజ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు పెద్దగా పెరిగేది ఏమీ ఉండదు. కొద్దిగా ఉద్యోగాలు వచ్చినా, మరోవైపు పరిశ్రమలు మూత పడుతున్నందు వలన తగ్గిపోయే ఉద్యోగాలతో పోల్చితే ఈ కొత్త ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, సాధారణంగా ఈ ఖనిజ సంపదను వెలికి తీసే ప్రాంతాలు ఎక్కువ జనాభా నివసించేవిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గిరిజన, ఆదివాసీ గ్రామాలుగా ఉంటాయి. అందుచేత ఖనిజాల తవ్వకం ఫలితంగా చాలామంది ప్రజలు తమ భూములను పోగొట్టుకోవడంతోబాటు, నిర్వాసితులుగా కూడా మారిపోతారు. ఖనిజాల ద్వారా లభించే ఆదాయంలో అత్యధిక భాగం ఆ బహుళజాతి కంపెనీల జేబుల్లోకి పోతుంది. దానిని తమ దేశాలకు తరలిస్తారు. ఈ ఖనిజాన్ని వెలికి తీయడం కోసం, దానిని తరలించడం కోసం అవసరమైన మేరకు మాత్రమే కొత్తగా రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన పరిమితంగా ఇక్కడ జరుగుతుంది తప్ప ఆ ప్రాంతంలో అభివృద్ధి అంటూ వేరే ఏమీ జరగదు. సామాన్య ప్రజలకు ఈ ఖనిజాల తవ్వకం ద్వారా ఒరిగేది ఏమీ ఉండదు. అక్కడ ఖనిజ వనరులు పూర్తిగా కరిగిపోయే రోజు చివరికి రానేవస్తుంది. ‘‘అభివృద్ధి’’ అంటూ అంతవరకూ చేసిన ప్రచారం అక్కడితో ఆగిపోతుంది. ఆ దేశ పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. నిజానికి మొదటికి రావడం కాదు. మునుపు ఉండిన ఖనిజ సంపద నిల్వలు కాస్తా కరిగిపోయి డొల్ల అయిపోతుంది. ఆ ఖనిజాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను-రోడ్లు, విద్యుత్తు వగైరా- నిర్వహిం చడం కూడా ఆగిపోయి అవి శిధిలం కావడం మొదలౌతుంది.

ఆ ఖనిజాన్ని వెలికి తీయడం వలన దేశ ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలగదు సరికదా ఆ దేశం తన ఖనిజ నిల్వలను కోల్పోయి మరింత పేదగా దిగజారుతుంది. సూటిగా చెప్పాలంటే ఖనిజాలను వెలికి తీయడం అంటే ప్రజలను లూటీ చేయడమే. మన పొరుగు దేశమైన బర్మా (ఇప్పుడు మయన్మార్‌) ఇందుకు తగిన ఉదాహరణ. ఆ దేశంలో విలువైన లోహాల ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉండడంతోబాటు అక్కడ చమురు నిల్వలు కూడా బాగా ఉన్నట్టు బైటపడింది. 19వ శతాబ్దంలో ఆ చమురును వెలికి తీయడం మొదలైంది. బ్రిటిష్‌ ‌యాజమాన్యం కింద నడిచే బర్మా ఆయిల్‌ ‌కంపెనీ, అమెరికన్‌ ‌యాజమా న్యంలో ఉన్న స్టాండర్డ్‌ ఆయిల్‌ ‌కంపెనీ అక్కడి చమురును చాలా ఉధృతంగా తోడేశాయి. 1948లో బర్మా స్వాతంత్ర్యం పొందిన నాటికి ఆ దేశపు చమురు నిల్వలు దాదాపు కరిగిపోయాయి. ఈ మధ్యనే అక్కడ కొత్తగా సహజ వాయువు నిల్వలు బైటపడ్డాయి. దానిని ఆ దేశం ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో తనకు కావలసిన చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం బర్మా మీద చాలా ఎక్కువగా పడుతోంది. ఈ బర్మాను ఐరాస ‘‘అత్యంత వెనుకబడ్డ దేశం’’ కోవలో చేర్చింది. ఖనిజ వనరులు పుష్కలంగా ఉండడం ‘‘శాపం’’ అంటూ కొందరు అభివర్ణిస్తారు కాని అటువంటి నిర్ధారణ దీని వెనుక ఉన్న సామాజిక కారణాల వైపు నుండి మన దృష్టిని పక్కకు మళ్లిస్తుంది. మూడవ ప్రపంచ దేశాలలో ఖనిజాల వెలికితీత ఫలితంగా కనపడే ‘‘అభివృద్ధి’’ చాలా తాత్కాలికమైనది.

అందుకే ‌ఖనిజాల వెలికితీత రంగంలో బహుళజాతి కంపెనీలు పెట్టే పెట్టుబడులు మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలోకెల్లా అత్యంత దారుణమైనవి అని ప్రముఖ ఆర్థికవేత్త జోన్‌ ‌రాబిన్సన్‌ అభివర్ణించారు. బహుళజాతి కంపెనీలు వస్తూత్పత్తి రంగంలో గనుక పెట్టుబడులు పెడితే కనీసం ఫ్యాక్టరీల రూపంలో ఆ దేశానికి కొన్ని ఆస్తులైనా మిగులుతాయి. అదే ఖనిజాల వెలికితీతలో పెట్టుబడులైతే అమూల్యమైన దేశ సంపదను హరించివేస్తాయి. ఆ ఖనిజ సంపదను మళ్లీ సృష్టించడం సాధ్యం కాదు. పైగా ఆ పెట్టుబడుల వలన దేశానికి ఎటువంటి ఆస్తులూ సమకూరవు. చివరికి ఆ దేశాన్ని పీల్చివేసి మరింత పేదగా దిగజారుస్తాయి. ఈ కారణం వల్లే చాలా మూడవ ప్రపంచ దేశాలు స్వాతంత్ర్యం సాధించుకున్నాక తమ ఖనిజ సంపదనం తటినీ జాతీయం చేయడం మనం చూశాం. ఆ ఖనిజాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించడం కూడా చూశాం. వెలికితీసిన ఖనిజాల అమ్మకం ద్వారా లభించిన ఆదాయంలో మా ప్రభుత్వానికి గనుక ఎక్కువ వాటా చెల్లించక పోతే మీ కంపెనీని జాతీయం చేసేస్తాం అంటూ బహుళజాతి కంపెనీలపైన వత్తిడి తెచ్చిన పరిస్థితి కూడా ఉండేది. వామపక్ష నాయకుడైన రాఫెల్‌ ‌కొర్రియా ఈక్వెడార్‌ ‌దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖనిజాల వెలికితీత ద్వారా, ముఖ్యంగా చమురు వెలికితీత ద్వారా లభించే ఆదాయంలో ప్రభుత్వ వాటాను పెంచివేశాడు. అయితే, ఇలా ఖనిజ వనరులను జాతీయం చేయడానికి పూనుకున్న దేశాల ప్రభుత్వాలను కుట్రల ద్వారా కూలదోయడానికి బహుళజాతి కంపెనీలు పథకాలు రూపొంది స్తాయి.

ఒకవేళ అటువంటి కుట్రలు విఫలమైతే, అప్పుడు సామ్రాజ్యవాద దేశాలు ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి తయారౌతాయి. ఇది ప్రస్తుతం ఇరాన్‌ ‌విషయంలో జరుగుతోంది. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు మా లక్ష్యం అని అమెరికా, ఇజ్రాయిల్‌ ‌బాహాటంగానే ప్రకటించాయి. ఇరాన్‌ నాయకత్వం మొత్తాన్ని హతం చేశారు. ఇంతటి ఆటవికతను ‌మనం ఈ ఆధునిక కాలంలో ఎన్నడూ చూడలేదు. ఇరాన్‌పై దాడి చేసి అక్కడి ప్రభుత్వాన్ని మార్చివేయడం వెనుక చాలా విస్తృతమైన బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నింటి కన్నా ఇరాన్‌ ‌లోని చమురు నిక్షేపాలను చేజిక్కించుకోవాలనే తమ ఆర్థిక లక్ష్యాన్ని డొనాల్డ్‌ ‌ట్రంప్‌ ఎన్నడూ దాచిపెట్టుకోలేదు. మహమ్మద్‌ ‌మొస్సాదెహ్‌ ప్రధానిగా ఉన్న కాలంలో1951లో చమురు గనులను జాతీయం చేశారు. అప్పుడు బ్రిటిష్‌, అమెరికన్‌ ‌గూఢచారి సంస్థలు 1953లో ఒక కుట్రను రచించి అతడిని కూలదోశారు. కాని ఆ తర్వాత కూడా చమురు రంగం ప్రభుత్వ రంగంగానే ఇరాన్‌లో కొనసాగుతోంది. అక్కడ ఇస్లామిక్‌ ‌పరిపాలన సాగుతున్నప్పటికీ ఈ విషయంలో మార్పు లేదు. ఇస్లామిక్‌ ‌న్యాయ సూత్రాల ప్రకారం ఖనిజ నిక్షేపాలు ప్రజల ఉమ్మడి సొత్తుగానే ఉండాలి తప్ప ప్రైవేటు పరం కాకూడదు. మూడవ ప్రపంచ దేశాలలోని ఖనిజ నిక్షేపాలను అదుపు చేయడం కోసం సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రలు, పన్నిన పన్నాగాలు చరిత్రలో అత్యంత క్రూరమైన ఉదంతాలుగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.

వలస విధానం కొనసాగిన కాలంలో బెల్జియన్‌ ‌కాంగోగా పిలవబడే దేశంలో జరిగిన దుర్మార్గం అలాంటి ఉదంతాలలో బాగా అపఖ్యాతి పొందింది. పాట్రిస్‌ ‌లుముంబా నాయకత్వంలో కాంగో ప్రజలు స్వాతంత్ర్యం సాధించుకున్నారు. అక్కడి ఖనిజ వనరులు ఎక్కడ తమ చేతుల్లోంచి జారిపోతాయోనన్న భయం సామ్రాజ్యవాదులకు పట్టుకుంది. దాంతో కాంగోలో ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ‘కతంగా’ ప్రాంతాన్ని కాంగో నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్‌ను తమ తాబేదార్లుగా ఉన్నవారితో ముందుకు తెచ్చారు. ఆ తర్వాత పాట్రిస్‌ ‌లుముంబాను నిర్బంధించి హత్య చేశారు. 20వ శతాబ్దం చివరి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాలు అమలవుతూ వచ్చాయి. మూడవ ప్రపంచ దేశాల్లో రాజకీయ స్వాతంత్ర్యం సాధించిన అనంతరం అమలు చేసిన విధానాలకు పూర్తి వ్యతిరేక దిశలో సాగిన ప్రతీఘాత విప్లవం అని దీనిని చెప్పవచ్చు. అనేక దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీల చేతుల్లోకి మళ్ళీ ఖనిజ వనరుల మీద పెత్తనం చిక్కింది. ఇండియాలో వలసాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఖనిజ వనరుల మీద పూర్తిగా ప్రభుత్వానికే పెత్తనం ఉండబోతోం దన్న హామీ ఇచ్చారు. అదే స్వాతంత్య్రానంతరం మన జాతీయ విధానంగా అమలులోకి వచ్చింది. కాని 1993లో దీన్ని వదలిపెట్టి బహుళజాతి కంపెనీలను, దేశీయ కార్పొరేట్‌ ‌కంపెనీలను ఈ రంగంలోకి అనుమతించారు.

ఇక 2006 వచ్చేసరికి ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల మీద ఉండిన యాభై శాతం పరిమితిని కూడా ఎత్తివేసి వంద శాతం విదేశీ పెట్టుబడులు ఉన్న కంపెనీలను సైతం అనుమతించారు. ఇక ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టి తరలించుకు పోయే చర్యలు అమలవడం మొదలైంది. పెద్ద సంఖ్యలో గిరిజనులు వారి ఆవాస ప్రాంతాల నుండి వెళ్లగొట్టబడ్డారు. అక్కడ దేశీయ కార్పొరేట్లు, విదేశీ బహుళజాతి సంస్థలు యథేచ్ఛగా తమ దోపిడీని సాగించాయి. దీనినంతటినీ ‘అభివృద్ధి’గా చిత్రించి ప్రచారం చేశారు. కాని వాస్తవానికి ప్రజలకు దక్కింది దుర్భరమైన జీవితం మాత్రమే. ఇప్పుడు కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడిదారీ విధానం మాత్రమే అమలు జరుగుతోంది. కేంద్రంలోను, తాజాగా ఒడిశా రాష్ట్రంలోను అధికారంలో ఉన్న బీజేపీ, నిరంతరం బడా పెట్టుబడి సేవలో మునిగి తేలుతోంది. ఇటీవల మైనింగ్‌ ‌కంపెనీల మీద పన్నులు విధించే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కత్తిరిస్తూ కొత్త నిబంధనలను తెచ్చింది. దీని వలన మైనింగ్‌ ‌ద్వారా లభించే ఆదాయం కేంద్రీకరించబడుతుంది. అంతేగాక మైనింగ్‌ ఆదాయంలో అత్యధిక భాగం ప్రైవేట్‌ ‌కంపెనీల పాలౌతుంది. ఇప్పుడు ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయి నిర్వాసితులౌతున్న ప్రజా ఉద్యమాలు పుంజుకుంటున్నాయి.

ప్రస్తుత కాలంలో అవే వర్గ పోరాటానికి ప్రధాన రంగస్థలాలుగా ఉన్నాయి. ఇప్పుడు నయా ఉదారవాదం ముందుకు సాగలేని స్థితిలో ఇరుక్కుపోయి వుంది. ఈ నయా ఉదారవాద విధానాల ద్వారా మెరుగైన జీవితాలను అందించగలుగుతామంటూ ఇచ్చిన హామీలు పూర్తి మోసపూరితం అని తేలిపోతోంది. ఇక కొల్లగొట్టుకుని పోగేసుకునే దోపిడీ పద్ధతులు అంతకంతకూ దుష్ట స్వభావాన్ని సంతరించుకుంటూ పోతున్నాయి. వెనిజులాలో, ఇరాన్‌లో మాదిరిగా నేరుగానే దాడులకు పూనుకోవడం నుంచి జాతీయ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను అమలు చేయగల స్థాయికి చేరింది. నయా ఫాసిస్టు శక్తులను అధికారంలో కూర్చోబెట్టి వారిని ప్రోత్సహించే దాకా సామ్రాజ్యవాదం రకరకాల పద్ధతుల్లో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఈ కొల్లగొట్టే విధానాల అమలులో తోడ్పడుతోంది. ఈ క్రమంలో సామ్రాజ్యవాదం ప్రజలతో అంతకంతకూ ఎక్కువగా ప్రత్యక్ష సంఘర్షణలకు తలపడుతోంది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం దాని చివరి దశలోకి అడుగు పెట్టినందున దాని దుర్మార్గం మరింత తీవ్రంగా ఉంటుంది. తలెత్తుతున్న ప్రజా ఉద్యమాలు ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


ప్రభాత్‌ ‌పట్నాయక్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్