2022–26 మధ్య నూట పదకొండు మంది చట్ట నిర్మాతలు పార్టీలు మార్చారని ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్), జాతీయ ఎన్నిక కాపలా (ఎన్.ఈ.డబ్లు) తాజాగా నివేదించాయి. ఈ మార్పిళ్లు పదిహేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగాయి. కొన్ని ప్రభుత్వాలను మార్చాయి. కేంద్ర ప్రభుత్వ బలాన్ని పెంచాయి. 1990-2000 మధ్య గోవాలో పదమూడు మంది ముఖ్యమంత్రులు మారారు. 2014 తర్వాత మహారాష్ట్రలో ముప్ఫయి నెలల్లో మూడుసార్లు ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టింది. రాష్ట్రపతిని ఫాసిమైల్ సంతకానికి దిగజార్చింది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, కర్నాటక, మధ్య ప్రదేశ్, పుదుచ్చేరిలలో మార్పిళ్లు ప్రభుత్వాలను మార్చాయి. ఈ మార్పిళ్ల అతిపెద్ద లబ్ధిదారు బీజేపీ. 2016–20 మధ్య పార్టీలు మార్చిన చట్ట నిర్మాతల్లో 45శాతం బీజేపీలో చేరారు. త్రిపుర, బెంగాల్‌లో కాంగ్రెస్, తృణముల్, వామపక్ష సభ్యులను చేర్చుకుంది బీజేపీ.
కృష్ణుడే నిన్ను పాంచాలి ఆరవ పతిని చేస్తానన్నా కర్ణుడు పక్షం మారలేదు. ఇది కర్ణుల కరువు కాలం. విభీషణ భాతృ వంచన రాజ్యం. బీజేపీ ప్రజాస్వామ్య పతన యజ్ఞం. బీజేపీ ప్రతిపక్షాలను మార్పిళ్ల హోమంలో మాడుస్తోంది. మోడీ విధేయ ఫాసిమైల్ ప్రెసిడెంట్ల, సంఘ్ గవర్నర్ల, పాలకపక్ష స్పీకర్ల మద్దతుతో క్రతువు కాలుతోంది. కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఆలయాలు, చర్చిలు, దర్గాలలో తిప్పి పార్టీ వదలమని ప్రమాణాలు చేయించుకున్నాయి.
కొన్ని పార్టీలు ప్రమాణపత్రాలు రాయించుకున్నాయి. దేవుళ్లు కాని, నైతిక వాగ్దానాలు కాని, మార్పిళ్ల వ్యతిరేక చట్టం కాని అంగళ్ల మార్పిళ్లను ఆపలేదు.
వెంకయ్య ఉపాధ్యక్షునిగా మార్పిళ్లపై నీతులు చెప్పారు. కాని టీడీపీ రాజ్యసభ సభ్యుల చట్టవ్యతిరేక బీజేపీ చేరికను నీతితప్పి ఆమోదించారు. తెలంగాణ టీడీపీ సభ్యుల టీఆర్‌ఎస్ ప్రవేశాన్ని విమర్శించిన చంద్రబాబు ఏపీలో పాత పార్టీ సభ్యత్వం వదలని ఫిరాయింపుదార్లను మంత్రులను చేశారు. నాడు టీడీపీ-బీజేపీ మిత్రపక్షం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, బీజేపీకి చెడ్డపేరు రాకూడదని నాటి బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పూర్వ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి మోడీ, షాలకు రాశారు. ఇది చంద్రన్నపై కోపమే కాని ప్రజాస్వామ్య నిబద్దత కాదు. బీజేపీలోకి మార్పిళ్లను ఈ “ప్రజాస్వామ్యవాది” వ్యతిరేకించలేదు.
ప్రజాస్వామ్య పునాదుల పెకలింపుకు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెంతితే చాలని మాజీ కేంద్ర మంత్రి, లోకసభ స్పీకర్, సామ్యవాద నాయకుడు, గాంధీయవాది కీ.శే. రబీ రే అన్నారు. పార్టీ మార్పిళ్లు వికృతమై ప్రజాస్వామ్యానికే చీడగా మారతాయని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. రాజ్యాంగం అమలైన 35 ఏండ్లకు అత్యధిక సంఖ్యాబలం ఉన్న రాజీవ్ ప్రభుత్వం ‘మార్పిళ్ల వ్యతిరేక చట్టం’ చేయాల్సి వచ్చింది.
ఈ చట్టం ‘రాజ్యాంగ 10వ షెడ్యూల్, రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985 ద్వారా ప్రవేశ పెట్టబడి, రాజ్యాంగ (91వ సవరణ) చట్టం, 2003 ద్వారా సవరించబడింది. ఈ చట్టం పార్టీ మార్పిళ్లను చట్టవిరుద్ధం చేయలేదు. క్లుప్తంగా 10వ షెడ్యూల్ నిబంధనలు: 1. చట్టసభలకు ఒక పార్టీ నుంచి ఎన్నికైన నియమించబడిన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వాన్ని ఐచ్ఛికంగా వదులుకున్నా, సభలో ఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసినా, ఓటింగ్ నుండి తప్పుకున్నా సభా సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు 2. స్వతంత్ర సభ్యుడు రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడవుతాడు 3. ఏ పార్టీకీ చెందని నియామక సభ్యుడు ఆరునెల్ల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడవు తాడు 4. మూడింట రెండొంతుల సభ్యుల ఆమోదంతో ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీన మైతే అనర్హత కాదు 5. దిగువ సభల సభాధిపతులు, ఉప సభాధిపతులు, ఎగువ సభల అధ్యక్ష ఉపాధ్యక్షులు తమ పార్టీతో సంబంధం తెంచుకోటం అనర్హత కాదు 6. అనర్హతను సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. సభాధ్యక్షుని అనర్హతను నిర్ణయించవలసివస్తే సభ ఎన్నుకున్న మరొక సభ్యుడు ఆ పనిచేస్తారు 7. 10వ షెడ్యూల్ అమలుకు నియమాలుచేసే అధికారం సభాధ్యక్షునిదే. అయితే వాటిని సభ ముందుంచాలి. సభ వాటిని సవరించవచ్చు. తిరస్కరించవచ్చు. 8. పార్లమెంటుకు, ఎంపీలకు ప్రత్యేక అధికారాలు, హక్కులు, మినహాయింపులనిచ్చే రాజ్యాంగ నిబంధనలు 105, 194 ల నిమిత్తం లేకుండా 10వ షెడ్యూల్ నియమాల తిరస్కరణ సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
1985 డిసెంబర్‌లో లోకసభ స్పీకర్ ప్రతిపాదించిన 10వ షెడ్యూల్ 8వ పేరా నియమాలు 18 మార్చి1986 నుంచి అమలయ్యాయి. సభ్యత్వ అనర్హత నిర్ణయాధికారం స్పీకర్లదే. స్పీకర్లు పాలక పార్టీకి రాజీనామా చేయరు. దానితో సంబంధాలు కొనసాగిస్తారు. (ఇది 10వ షెడ్యూల్ 5వ నిబంధన ఉల్లంఘన.) తమ నాయకునికి నమ్మినబంటులా ఉంటారు. ఆయన అభీష్టాన్ని నెరవేర్చకుంటే తమ పదవి ఊడుతుందని వారికి తెలుసు. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలుచేయరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన స్పీకర్లు అధికార పక్షీయులుగా పాలక పార్టీల ప్రయోజనాలు కాపాడు తున్నారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి పాత పార్టీ సభ్యత్వాన్ని ‘ఐచ్ఛికంగా’ వదులుకున్నట్లే. 10వ షెడ్యూల్ ఒకటో నిబంధన ప్రకారం ఆ సభ్యుడు చట్టసభ సభ్యత్వానికి అనర్హుడు. స్పీకర్లు విజ్ఞత, విచక్షణలను వాడరు. అనర్హతను ప్రకటించరు. 8వ నిబంధన ప్రకారం ఇది సభాహక్కుల ఉల్లంఘన.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆధిక్యత లేకపోతే ప్రతినిధులు ఫిరాయిస్తారు. పార్టీ మారి ప్రభుత్వాలను పడగొట్టిన, నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు పార్టీ మారి పాలకపార్టీలో దూరుతున్నారు. గుత్తసంస్థల అధిపతులు రాజకీయులయ్యారు. దొడ్డిదార్లలో వ్యాపార అభివృద్ధి, ఆస్తుల సంపాదన, అక్రమాస్తుల రక్షణ వారి ప్రధాన అవసరాలు. అధికారసుఖాలు మరిగినవారు కుర్చీ లేకుండా బతక లేరు. పాలక పార్టీకి మారుతారు. దానితో ‘నీకిది నాకది’ సూత్రంలో ఆర్థిక, అధికార పంపకాలు, తప్పుల నుంచి తప్పించుకోవడం, అవినీతి కుంభకోణాలు, ఆస్తుల జప్తులు, న్యాయ విచారణల నుంచిరక్షణ, అశ్రమ సంపాదన కొనసాగింపు/ఏర్పాటు ఫిరాయింపుల లక్ష్యం.
పాలక పార్టీలు తమ తప్పుడు విధానాలను, నిరంకుశ పాలనను ప్రశ్నించే ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నాయి. బలహీన ప్రతిపక్షం, ప్రతిపక్షరాహిత్యం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాయి. ఏ పార్టీ దీనికి అతీతంకాదు. తమవారు పార్టీమారితే విమర్శ. ఇతర్లు తమ పార్టీలోకొస్తే ప్రోత్సాహం. ఇతర సందర్భాల్లో మౌనం. ఒక పార్టీ సిద్ధాంతాలపై, ప్రణాళికపై ఐదేండ్లకు ఎన్నుకోబడిన ప్రతినిధులు పార్టీ మారితే పాత పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలపై తమను ఎన్నుకున్న ప్రజలను మోసగించడమే. పాత పార్టీ నుంచిపొందిన ప్రాతినిధ్యాన్ని, పదవులను, హోదాలను వదిలేయాలి.
స్పీకర్ పార్టీరహితంగా, తటస్థంగా ఉండాలని రాజ్యాంగ లక్ష్యం. పార్టీ మార్పిళ్లలో అనర్హత ప్రకటనలో స్పీకర్ల పాత్రను పునరాలోచించమని 2020లో సుప్రీంకోర్టు పార్లమెంటుకు గట్టిగా సూచించింది. స్పీకర్ పదవులను ఏ పార్టీకీ చెందని రాజ్యాంగ నిపుణులకు ఇవ్వాలి. సభ్యత్వ అనర్హత నిర్ణయాధికారాన్ని ఎన్నికల సంఘానికో, న్యాయవ్యవస్థకో, స్వాధికార సంస్థకో అప్పజెప్పాలి. నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలి. అనర్హులు సభ్యులుగా కొనసాగే అవకాశమివ్వరాదు. పార్టిమార్పిళ్లకు ముందే రాజీనామా తప్పనిసరి చేయాలి. నేటి ఎన్నిక విధానం పాలకపక్షాల అనుకూలం. చట్టసభల్లో ప్రత్యామ్నాయ పక్షాల ఉనికికి ఎన్నికల సంస్కరణలు అవసరం. దామాషా పద్ధతిలో వ్యక్తిని కాక పార్టీని ఎన్నుకుంటారు. మార్పిళ్లు ఉండవు. ఓటమి ప్రసక్తి లేనప్పుడు ప్రజలు కమ్యూనిస్టులకు ఓటేస్తారు. వామపక్షాలు ఎన్నికల సంస్కరణలకు ఉద్యమించాలి. బలమైన పౌరసంఘాలను నిర్మించాలి. మార్పిళ్లను నిరసించేటట్లు ప్రజలను చైతన్యపర్చాలి. ఫిరాయింపుల్లో పదవుల రాజీనామాకు వత్తిడి పెంచాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 94902 04545






కామెంట్‌లు (0)