Magazines

ఐడీబీఐ అమ్మకం.. దేశ ఆర్థిక స్వావలంబనకు విఘాతం!

2 గంటల క్రితం

sale IDBI
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 5 నిమిషాల చదవడం

మీరు జాగ్రత్తగా దాచుకున్న డబ్బు, మీ పిల్లల చదువుకోసం పెట్టిన డిపాజిట్లు, రైతుకు అవసరమైన కిసాన్ క్రెడిట్, చిన్న వ్యాపారికి కావాల్సిన రుణం-ఇవన్నీ ఒక బ్యాంకు నిర్ణయాధికారం కిందకు వస్తాయి. ఆ నిర్ణయాధికారం ఇప్పుడు ఒక విదేశీ పెట్టుబడి సంస్థ చేతిలోకి వెళ్తోంది. అదే ఐడీబీఐ బ్యాంకు అమ్మకం. ఐడీబీఐ బ్యాంకులోని 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు అమ్మేందుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అక్టోబర్ 14న ఆమోదం తెలిపింది. షేరుకు రూ.81 చొప్పున మొత్తం రూ.52,878 కోట్లకు ఈ వాటా అమ్మకం జరగనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసి 30.24 శాతం వాటాలను విక్రయిస్తుంది. అమ్మకం పూర్తయిన తర్వాత ప్రభుత్వంవద్ద 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం మాత్రమే మిగులుతాయి. దీన్ని ప్రభుత్వం “వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ”గా పిలు స్తోంది. కానీ పేరు ఏదైనా బ్యాంక్ నియంత్రణ ఒక విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్తుంది. దేశ ఆర్థిక రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని ప్రభుత్వమే చెబుతోంది. అంటే లక్షల కోట్ల రూపాయల ప్రజా డిపాజిట్లపై నియంత్రణ ఒక విదేశీ సంస్థకు అప్పగించడమే.

అభివృద్ధి సంస్థ నుంచి అమ్మకపు సరకు దాకా..

ఇండస్ట్రియల్‌ ‌డెవలప్‌‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) జవహార్‌‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1964లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ ఆర్థిక సంస్థ. దీర్ఘకాలిక రుణాల ద్వారా దేశ పరిశ్రమలకు ఆధారంగా నిలిచింది. సరళీకరణ విధానాల కాలంలో దీన్ని క్రమంగా వాణిజ్య బ్యాంకుగా మార్చారు. 2019లో ఐడీబీఐ ఒడిదుడుకుల నుంచి బయట పడటం కోసం ఎల్ఐసీ 51 శాతం వాటా తీసుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ దీన్ని ప్రైవేటు రంగ బ్యాంకుగా వర్గీకరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి పెట్టుబడితో నడుస్తున్న ఐడీబీఐ ప్రైవేటు బ్యాంక్ ఎలా అవుతుంది. ప్రస్తుతం కేంద్రం, ఎల్ఐసి కలిపి 95 శాతం వాటా కలిగి ఉన్నా, నియంత్రణాధికారం ప్రభుత్వం చేతిలో లేదు. అమ్మకానికి దారి వేయడానికి చేసిన దశలవారీ మార్పులే ఇప్పుడు ఇక్కడికి దారితీశాయనే అనుమానం సహజంగా కలుగు తుంది. బ్యాంకు పేరు మాత్రం అలాగే ఉన్నా, యాజమాన్యం, నిర్ణయాధికారం మాత్రం ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నాయి.

ప్రజాధనంతో బాగుచేసి..ఇప్పుడు అమ్మకం

ఒకప్పుడు ఐడీబీఐ మొండి బకాయిల భారంతో తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ బ్యాంకును నిలబెట్టడానికి ప్రభుత్వం, ఎల్ఐసి నుంచి భారీ మూలధనం వచ్చింది. ఎల్ఐసి2019లో రూ.21,624 కోట్లతో వాటా కొని, తర్వాత మరో రూ. 4,743 కోట్లు పెట్టింది. ఇవన్నీ పాలసీదారుల సొమ్మే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.4,557 కోట్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని పెట్టింది. ఇప్పుడు బ్యాంకు ఆర్థికంగా బలపడింది. లాభాలు పెరిగాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో లాభం రూ.2,115 కోట్లు. ఇదే వేగంతో ఏడాదికి సుమారు రూ.8,500 కోట్లు సంపాదించ వచ్చని అంచనా. నిరర్థక ఆస్తులు తగ్గాయి, డిపాజిట్లు రూ.3.25 లక్షల కోట్లకు పైగా చేరాయి. ప్రజల డబ్బుతో బ్యాంకును బాగుచేసి, అది లాభాల దారిలోకి వచ్చాక అమ్మేయడం న్యాయమేనా? ప్రజలు చేసిన పెట్టుబడి ఫలితాన్ని ప్రైవేటు, విదేశీ సంస్థకు అప్పగించడం కాక మరేమిటి ?

ధర నిజంగా న్యాయమేనదేనా?

ప్రభుత్వం రెండు స్వతంత్ర వాల్యుయేషన్ సంస్థల అంచనాల ఆధారంగా షేరుకు రూ.75.99ని ప్రాథమిక విలువగా నిర్ణయించింది. ఫెయిర్‌ఫాక్స్ రూ.81 బిడ్ పెట్టడంతో అది ఆ విలువ కన్నా ఎక్కువేనని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వాల్యుయేషన్ కాలంలో ఐడీబీఐ షేరు ధర రూ.61.01 నుంచి రూ.118.38 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. అంటే షేరు ధర ఒక్కసారి రూ.118 దాటింది. అలాంటి పరిస్థితిలో రూ.81 ధర నిజంగా సరైనదేనా అనే సందేహం తప్పదు. అంతేకాదు, బ్యాంకుకు దేశవ్యాప్తంగా విలువైన భూములు, భవనాలున్నాయి. హైదరాబాద్‌లోనే 50 ఎకరాల స్థలం ఉందని ఐడీబీఐ ఉద్యోగుల ఐక్యవేదిక చెబుతోంది. ఈ స్థిరాస్తుల నిజమైన మార్కెట్ విలువ పూర్తిగా లెక్కలోకి తీసుకున్నారో లేదో ప్రజలకు స్పష్టంగా తెలియాలి.

పార్లమెంటు హామీకి తూట్లు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు

2003లో ఐడీబీఐ చట్టం తెచ్చినప్పుడు పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకూడదని సూచించింది. అప్పటి ఆర్థిక మంత్రి శ్రీ జస్వంత్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ వాటా పదిహేను శాతానికి పడిపోతోంది. అంటే ఆ హామీ నేరుగా ఉల్లంఘించబడు తోంది. మరింత ముఖ్యంగా, సీసీఈఏ ప్రభుత్వం వద్ద మిగిలిన పదిహేను శాతం వాటాను కూడా భవిష్యత్తులో ఓపెన్ మార్కెట్‌లో అమ్మేందుకు అధికారాలు ఇచ్చింది. అంటే ఇది కేవలం నియంత్రణ మార్పు కాదు; ప్రభుత్వ ఉనికినే క్రమంగా తుడిచేయడానికి సిద్ధమయ్యారని అర్థం.

ఐడీబీఐ ఒకప్పుడు పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలిచ్చే ప్రత్యేక సంస్థ. ఇలాంటి సంస్థలు లేకపోతే మౌలిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి దొరకడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా వదిలేసి, లక్షల కోట్ల ప్రజా డిపాజిట్లపై నియంత్రణను ఒక విదేశీ పెట్టుబడి సంస్థకు ఇస్తున్నారు. ఆ సంస్థ ఏ రంగంలో, ఎవరికి అప్పులివ్వాలో తన లాభాన్ని బట్టే నిర్ణయిస్తుంది. దేశ అభివృద్ధి ప్రాధాన్యాలను బట్టి కాదు. పైగా పరిశ్రమలు, ఆస్తుల విలువల రూపంలో ఇంత విలువైనఆస్తిని కొద్దిపాటి సొమ్ముకే వదులుకోవడం ఖజానాకు దీర్ఘకాలిక నష్టం.

​కాథలిక్ సిరియన్ బ్యాంక్ విలీనం.. ఉద్యోగులకు పెద్ద ప్రశ్న

ఫెయిర్‌ఫాక్స్‌కు ఇప్పటికే సీఎస్‌బీ బ్యాంకులో సుమారు నలభై శాతం వాటా ఉంది. ఒకే వ్యక్తి లేదా సంస్థ రెండు బ్యాంకులను నియంత్రించకూడదనేది రిజర్వ్ బ్యాంక్ నియమం. దీని కోసం ఫెయిర్‌ఫాక్స్ సీఎస్‌బీ వాటాను అమ్మేయాలా లేక సీఎస్‌బీని ఐడీబీఐలో విలీనం చేయాలా అని రెండేళ్లలో నిర్ణయించాల్సి ఉంటుంది. విలీనం జరిగితే రెండు వేర్వేరు సేవా నిబంధనలు కలిగిన ఉద్యోగులు ఒకే సంస్థలోకి వస్తారు. వేతనాలు, పింఛన్లు, పదోన్నతులు, సేవా షరతులు ఎలా ఉంటాయో ఇప్పటికీ స్పష్టంగా లేదు. సీఎస్‌బీ యాజమాన్యం బ్యాంకింగ్ పరిశ్రమ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం గత పదేళ్లుగా జరిగిన రెండు వేతన సవరణలను అమలు చెయ్యలేదు. న్యాయబద్ధమైన ఒప్పంగాల అమలుకోసం ఉద్యోగులు నిరంతరం చేస్తున్న పోరాటాలను ఫెయిర్ ఫాక్స్ యాజమాన్యం ఖాతరు చెయ్యట్లేదు. అలాంటి అనుభవం ఐడీబీఐ ఉద్యోగులకు కూడా పునరావృతం కాదా?

రిజర్వేషన్లు, సామాజిక న్యాయానికి ముప్పు

ఐడీబీఐలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు, మహిళలు, వికలాంగులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నంత వరకే రిజర్వేషన్ల రక్షణ ఉంటుంది. ప్రైవేటీకరణ తర్వాత కొత్త నియామకాల్లో ఆ అవకాశం శాశ్వతంగా పోతుంది. జ9రగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?ఇది కేవలం ఉద్యోగుల విషయం మాత్రమే కాదు. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుతున్న విధానమే ప్రశ్నార్థకం అవుతుంది. లాభం మాత్రమే లక్ష్యంగా ఉండే విదేశీ పెట్టుబడితో నడిచే ప్రైవేటు బ్యాంకు తక్కువ లాభాల శాఖలను, చిన్న రుణాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది.

సామాన్యుల డిపాజిట్లపై ఎవరి నియంత్రణ?

ఐడీబీఐకి దేశవ్యాప్తంగా వేల శాఖలున్నాయి. లక్షలాది జన్‌ధన్ ఖాతాలు, బీమా, అటల్ పెన్షన్ ఖాతాలు ఈ బ్యాంకుపై ఆధారపడి ఉన్నాయి. రూ.3 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ప్రధానంగా సామాన్య ప్రజలవే. వారు డబ్బు దాచింది ప్రభుత్వ అండ ఉందనే నమ్మకంతోనే. ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, డిపాజిటర్లు భయపడనవసరం లేదని. కానీ అమ్మకం తర్వాత ఉద్యోగుల సేవా నిబంధనలు, రిజర్వేషన్లు, శాఖల నిర్వహణ, రుణ విధానాలపై చట్టబద్ధమైన హామీలు బహిరం గంగా ప్రకటించలేదు. మాటలతో సరిపెట్టకుండా రాతపూర్వక హామీలివ్వాలి. అదే విధంగా ప్రభుత్వం “మేము, ఎల్ఐసి వాటాదారులుగా కొనసాగుతాం” అంటోంది. కానీ 15, 19 శాతాల మైనార్టీ వాటాలతో బ్యాంకు విధానాలపై నియంత్రణ ఉండదు. ఎల్ఐసీ వాటాను కూడా రెండేళ్లలో 15 శాతానికి తగ్గించాల్సి ఉంది అంతేకాదు, ఈ ఒప్పందం ఇంకా రిజర్వ్ బ్యాంక్ అనుమతులపై ఆధారపడి ఉంది. ఫెయిర్‌ఫాక్స్ “ఫిట్ అండ్ ప్రాపర్” ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో, నియంత్రణ షరతులకు అనుగుణంగా ఉంటుందో ఇంకా తేలాల్సి ఉంది.

ప్రజల పొదుపు,ఆర్థిక వ్యవస్థకు భద్రత కల్పించాలి

ఐడీబీఐ అమ్మకాన్ని తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వ వాటా 51 శాతం కన్నా తగ్గనివ్వకూడదన్న 2003 పార్లమెంటు హామీని గౌరవించాలి. ఒప్పంద పత్రాల న్నింటినీ పార్లమెంటు, ప్రజల ముందు ఉంచి చర్చ జర పాలి. అంతవరకు ఏ నిర్ణయమూ అమలు చేయకూడదు. భూములు, భవనాలతో సహా బ్యాంకు ఆస్తుల పూర్తి విలువను స్వతంత్ర సంస్థ ద్వారా నిర్ధారణ చేయాలి. ఉద్యోగుల సేవా నిబంధనలు, రిజర్వేషన్లు, పింఛన్లు, వేతన సవరణ హక్కులకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. ఐడీబీఐకి అభివృద్ధి ఆర్థిక సంస్థ (డిఎఫ్ఐ) హోదా తిరిగి ఇచ్చి, పరిశ్రమలు, గ్రామీణ, చిన్న రుణాలకు చేయూతనివ్వాలి. బ్యాంకులను ముంచిన బడా ఎగవేతదారుల నుంచి బకాయిలు వసూలు చేయాలి. బ్యాంకులను అమ్మడం పరిష్కారం కాదు. బ్యాంకులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవడానికి ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్య ఖాతాదారులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ కలిసి గళమెత్తాలి. ఐడీబీఐ బ్యాంకును కాపాడుకోవాలి.


పి.వెంకటరామయ్య, 9553533815

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్