రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. లక్షలాది మంది కార్మికులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన నిర్మాణ వ్యయంపై లెవీ (సెస్) నిబంధనల్లో మార్పులతో వారికి తీవ్ర నష్టం కలగనుంది. కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన సెస్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించటం, వాటిని ఇతర పథకాలు, కార్యక్రమాలకు వినియోగించటమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా భవన, ఇతర నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు, ప్రమాదవశాత్తూ గాయపడితేనో, మరణిస్తేనో రావాల్సిన పరిహారం, అందాల్సిన ఆర్థికసాయం అందకుండా పోతుంది. ఇది వారి కుటుంబాలను ఛిన్నా భిన్నం చేస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు, సహజ మరణాలకు రూ.2 లక్షలకు పెంచి, శాశ్వత, పాక్షిక అంగ వైకల్యం తదితర నాలుగు సంక్షేమ పథకాలను ప్రయివేట్ ఇన్యూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ, నెం.12ను 2025 జూలై 22న విడుదల చేసిన సంగతి విదితమే.
దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. డబ్బును దారి మళ్లించేం దుకే.. జీవో 12 ను తీసుకొచ్చారనేది వారి వాదన. చేసేది మోసమైనా..చట్టబద్దంగా చేయాలని ప్రభుత్వం భావించినట్టుంది. అందుకే కార్మికుల సొమ్మును చట్టబద్దంగానే దారిమళ్లిం చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.
నిబంధనల ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వారి కోసమే ఖర్చు చేయాల్సి ఉన్నా... అందుకు భిన్నంగా ప్రభుత్వం, కార్మిక శాఖ వ్యవహర స్తుండటం గమనార్హం. సెస్ రూపంలో వసూలైన కోట్లాది రూపాయల నిధులను గుర్తింపులేని ప్రయివేటు బీమా కంపెనీలకు అప్పగిం చటాన్ని బట్టి సర్కారు ఎవరి వైపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రూపంలో దాదాపు రూ.346 కోట్లను ప్రయివేటుకు కట్టబెట్టటం శోచనీయం. ఆ డబ్బును తిరిగి సంక్షేమ నిధిలో జమ చేయాలంటూ కార్మిక సంఘాలు మొత్త కుంటున్నా ప్రభుత్వ పెద్దల చెవికెక్కటం లేదు. మరోవైపు ప్రభుత్వం నియమించిన అడ్వజరీ కమిటీ అటకెక్కింది.
ప్రభు త్వానికి అనుకూలమైన సభ్యులను ఆ కమిటీలో నియమించుకుని కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కటం ఆ కమిటీ రివాజుగా మారింది. 1996 భవన నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు అడ్వయిజరీ కమిటీని నియమించాలి. ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులు ఖర్చు చేయాలి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా నిధులను ఇతర శాఖలకు దారి మళ్లిస్తున్నాయి. కార్మిశాఖ అధికారుల వాహనాలు, వారు వాడే ఖరీదైన ఫోన్లు, కొత్తగా నిర్మిస్తున్న కార్మిక శాఖ భవనాలకు కార్మికుల సంక్షేమ నిధిని వినియోగించటం విడ్డూరంగా ఉంది. తమది ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ పెద్దలు... కార్మికుల సెస్ విషయంలో నోరు మెదపటం లేదు. పారిశ్రామికవేత్త అయిన నేతకే కార్మికశాఖ బాధ్యతలను అప్పగించినప్పటికీ సెస్ గురించి అడగ్గా, ఆయనా స్పందించకపోవటం గమనార్హం. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే నిర్మాణ రంగ కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన పేదలే ఉంటారు.
కానీ వారి సంక్షేమాన్ని గాలికొదిలేయటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమా? అలా వదిలేయటం ద్వారా తెలంగాణ అభివృద్ది ఎలా సాధ్యమో ఏలికలకే తెలియాలి మరి.
సంక్షేమం, అభివృద్ధి అనేవి తమ ప్రభుత్వానికి రెండు కండ్లలాంటివని చెప్పుకునే ప్రభుత్వాధి నేతలు... అత్యంత కీలకమైన నిర్మాణ రంగ కార్మికులను గాలికొదిలేయటం శోచనీయం. సర్కారు ఘనంగా చెప్పుకుం టున్న పలు సాగునీటి ప్రాజెక్టులు, భారత్ ఫ్యూచర్ సిటీ, టిమ్స్ ఆస్పత్రులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, పోలీస్ స్కూళ్లు, గురుకులాల తదితరాలు భవన నిర్మాణ కార్మికుల చెమట చుక్కలు లేకుండానే నిర్మితమవుతాయా? అందుకే ప్రముఖ కవి అన్నట్టు... రాళ్లెత్తిన కూలీల గురించి పాలకులు ఆలోచించాలి. వారి సంక్షేమానికి సంబంధించిన సెస్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అప్పుడే ప్రజా ప్రభుత్వం అనే పదానికి అర్థం, పరమార్థం ఉంటుంది.







కామెంట్లు (0)