తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారలుగా మలిచి, తన పద్యాలనే పదునైన ఆయుధాలుగా చేసుకుని నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ విముక్తి ఉద్యమంలో తన కలంతో, గళంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన ఆయన చిరస్మరణీయుడు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఉద్యమ కవి.1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో దాశరథి వెంకటాచార్య, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యు లేషన్ పూర్తి చేసి, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ చదివారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు.
చిన్నతనం లోనే పద్యరచనలో ప్రతిభ కనబరిచారు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నిజాం పాలనలో రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతలను చూసి చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుకగా మారి తన రచనలతో పాలకులను నిలదీశారు.
“ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని” అంటూ నిజాం పాలనపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. “రైతుదే తెలంగాణము రైతుదే” అంటూ తెలంగాణపై రైతాంగానికి ఉన్న హక్కును చాటారు. “దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది” అంటూ తన కవిత్వంతో ప్రజల్లో చైతన్యం నింపారు. ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్ర పోషించినందుకు నిజాం ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది.
జామాబాద్‌లోని ఇందూరు కోటలో మరో 150 మందితో కలిసి ఖైదీగా ఉంచింది. అదే జైలులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. జైలులో పళ్లుతోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో గోడలపై పద్యాలు రాసినందుకు దెబ్బలు తిన్నా తన రచనా సంకల్పాన్ని వీడలేదు. ఆయనకు కవిత్వం కేవలం సాహిత్య ప్రక్రియ కాదు, ప్రజల విముక్తి కోసం సాగించిన పోరాటం. మంచి ఉపన్యాసకుడైన దాశరథి తన భావోద్వేగ ప్రసంగాలతో ఊరూరా పర్యటించి సాంస్కృతిక చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహిత్య చైతన్యానికి కృషి చేశారు.
ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. కథలు, నాటికలు, కవితలు, సినిమా పాటలు రచించారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించి ‘గాలిబ్ గీతాలు’ పేరుతో వెలువరించారు. 1977 ఆగస్టు 15 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు.
రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఆయన రచించిన తల్లి, తల్లి తెలంగాణ పద్యాలు నేటికీ పాఠకుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. 1987 నవంబరు 5న దాశరథి కన్నుమూశారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి దాశరథి సాహితీ పురస్కారాలను అందిస్తోంది. తెలంగాణ విముక్తి కోసం తన జీవితాన్ని, సాహిత్యాన్ని అంకితం చేసిన దాశరథి కృష్ణమాచార్యకు తగిన గౌరవం దక్కాలి. ఆయన జన్మించిన మహబూబాబాద్ జిల్లాకు దాశరథి పేరు పెట్టాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించాలి. ఆయన రచనలను పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా పరిచయం చేయాలి. దాశరథి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అంటే తెలంగాణ చరిత్రను, ఆత్మగౌరవ పోరాటాన్ని, ప్రజల విముక్తి ఆకాంక్షలను అర్థం చేసుకోవడమే. అక్షరాన్ని ఆయుధంగా మలిచి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి దాశరథి స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకం కావాలి.
- కామిడి సతీష్ రెడ్డి, 9848445134
అక్షరాయు‘‘దాశరథి’’
34 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)