Magazines

‘భరోసా’ మాటలకే... రైతు బతుకు ‘అప్పు’లకే!

27 నిమిషాల క్రితం

Assurances
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 6 నిమిషాల చదవడం

సాగు చేయాలంటే అప్పు చేయాలి. పంట పండితే గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాలి. ప్రకృతి కన్నెర్ర చేస్తే పెట్టుబడి మొత్తం నష్టపోవాలి. పంట చేతికొచ్చినా అప్పులు తీర్చలేక మిగిలిన జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియని దుస్థితి. ఇదీ నేడు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి. రైతు సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీలతో ఆశలు కల్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక వాటి అమలులో మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. 2023 డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగానికి సుమారు నలభై రకాల హామీలిచ్చింది. మూడేండ్ల పాలనలో కొన్ని అమలు చేసినా, మరికొన్ని పాక్షికంగా అమలు చేసింది. అనేక కీలక హామీలు ఇంకా కాగితాలకే పరిమితమ య్యాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలనే కొన్ని సందర్భాల్లో కొనసాగిస్తున్నది. ఎన్నికల హామీలకు, క్షేత్రస్థాయిలో రైతుల బతుకులకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగంపై సమగ్ర దృక్పథం కొరవడినట్లు స్పష్టమవుతున్నది.

రెండు లక్షల రూపాయలలోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామన్నది కాంగ్రెస్‌ ప్రధాన హామీ. ఇందుకోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవంగా రుణమాఫీకి రూ.39 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా, కనీసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తే మెజారిటీ రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావించారు. చివరకు రూ.20,616 కోట్లతోనే సరిపెట్టడంతో దాదాపు 30 శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్నవారు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి బ్యాంకులకు చెల్లించినా కొందరికి మాఫీ జరగలేదు. పాత అప్పు తీరకపోగా కొత్త అప్పు భారమైంది. పెరుగుతున్న సాగు పెట్టుబడులు, వడ్డీలు, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రుణమాఫీ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల లెక్కల్లో కనిపించే పథకం కాదు. అర్హులైన ప్రతి రైతుకు నిజమైన అప్పుల విముక్తి కల్పించినప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది.

కౌలు రైతులకేది భరోసా?

రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి పంటకు రూ.7,500, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ మొదట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరానికి రూ.5 వేల చొప్పున ఒక పంటకు చెల్లించి, మరో పంటకు నాలుగు ఎకరాల లోపు వారికే పరిమితం చేసింది. రైతుల్లో అసంతృప్తి పెరగడంతో తర్వాత ఎకరానికి రూ.6 వేల చొప్పున ఎకరాల పరిమితి లేకుండా ఒక విడతలో రూ.9 వేల కోట్లు జమ చేసింది. అయినా ఎన్నికల హామీ మేరకు రూ.7,500 అమలు కాలేదు.ఈ పథకంలో కౌలు రైతుల సమస్య మరింత తీవ్రమైంది. రాష్ట్రంలో 30 శాతానికి పైగా సాగు కౌలు రైతుల ఆధారంగా జరుగుతుండగా, దాదాపు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని పట్టించుకోనప్పుడు, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి 2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు ఇస్తామని, అన్ని రైతు పథకాలూ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలుకాలేదు. రుణాలు, రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట నష్టపరిహారం ఏదీ వారికి అందడం లేదు. పండించిన పంటను అమ్ముకోవడంలోనూ ఇబ్బం దులే. రైతుల ఆత్మహత్యల్లో సగానికి పైగా కౌలు రైతులవే ఉంటున్నాయన్న వాస్తవం ఈ నిర్లక్ష్యం తీవ్రతను తెలియజేస్తున్నది. భూమి యాజమాన్యమే కాకుండా వాస్తవంగా సాగు చేస్తున్న వ్యక్తిని గుర్తించే విధానం రావాలి.

పెట్టుబడి భారం..గిట్టుబాటు ధర కరువు

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, యంత్రాల అద్దెల ఖర్చులు పెరుగుతున్నా రైతుకు పంటకు తగిన ధర లభించడం లేదు. రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు, విత్తనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, ఎరు వులు, పురుగు మందుల సబ్సిడీల పునరుద్ధరణ వంటి హామీలు అమలుకాలేదు. ధాన్యం కొనుగోళ్లలో తేమశాతం పేరుతో తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. దీంతో పెట్టుబడి పెట్టిన రైతుకు కోతల సమయం లోనూ నష్టమే మిగులుతున్నది. ఆరు పంటలకు బోనస్‌, మరో నాలుగు పంటలకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ హామీని సన్నవడ్లకే పరిమితం చేసింది. దొడ్డు వడ్లకు బోనస్‌ లేదు. సన్నవడ్ల కొనుగోళ్లలోనూ అందరికీ ప్రయోజనం అందడం లేదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్‌, కందులకు బోనస్‌ అమలు కాలేదు. చెరుకు, పసుపు, మిర్చి, ఎర్రజొన్నలకు మద్దతు ధర నిర్ణయిస్తా మన్న హామీ నెరవేరలేదు. పాల రైతులకు లీటరుకు రూ.5 ప్రోత్సాహకం కూడా అందడం లేదు. సాగు వ్యయానికి, మార్కెట్‌ ధరకు మధ్య అంతరం పెరిగితే రైతు అప్పుల నుంచి బయటపడలేడు. పంటల వారీగా ఉత్పత్తి వ్యయాన్ని పరిగణ నలోకి తీసుకుని ధరల భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

బీమా లేదు..పరిహారం రాదు..

పంటల బీమా అమలు చేస్తామని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో చేరుతామని ప్రకటించిన ప్రభుత్వం మూడేండ్లయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఏటా అధిక వర్షాలు, వరదలు, తుఫాన్లు, చీడపీడల వల్ల ఐదు నుంచి ఎనిమిది లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల ముప్పును పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంటల బీమా, ముందస్తు హెచ్చరికలు, శాస్త్రీయ సాగు సలహాలు అత్యవసరం. కానీ పంట నష్టం జరిగినప్పుడు ఎకరానికి రూ.10 వేల పరిహారం ప్రకటించి నామమాత్రంగా చెల్లించడం వల్ల రైతుకు జరిగిన నష్టం పూడటం లేదు. పంట నష్టపోయిన రైతుకు తదుపరి పంట సాగు చేయడానికి కూడా పెట్టుబడి మిగలడం లేదు. పంట నష్టం, అప్పులు, గిట్టుబాటు ధర లేకపోవడం కలిసి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రైతు ప్రాణాలను కాపాడాలంటే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే శాశ్వత వ్యవస్థ అవసరం.

భూమి హక్కులు, ప్రాజెక్టులు.. పరిష్కారమెప్పుడు?

భూసేకరణలో 2013 చట్టాన్ని అమలు చేస్తామని, అసైన్డ్‌, పోడు భూములకు కూడా న్యాయమైన పరిహారం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 చట్టాన్నే కొనసాగిస్తూ రైతులకు తగిన పరిహారం అందించడం లేదు. ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెడుతున్నారు. ధరణి స్థానంలో భూభారతి తెచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. నిషేధిత జాబితాలోని పట్టా భూములను వంద రోజుల్లో పరిష్కరిస్తామన్న హామీ, ప్రతి రైతుకు భూధార్‌ కార్డు ఇస్తామన్న హామీ అమలుకాలేదు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం అర్హులైన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా, సుమారు 8.5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నవారికి ఇంకా పట్టాలు అందలేదు. ఫార్మాసిటీ రద్దు చేసి భూములు తిరిగి ఇస్తామన్న ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ పేరుతో కార్పొరేట్లకు భూములు అప్పగిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ పురోగతి లేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడతామన్న ప్రకటనలు తప్ప నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియ ముందుకు సాగలేదు. కాళేశ్వరం కుంగిన పిల్లర్ల మరమ్మతులకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటంతో ఇప్పటికే నిర్మించిన పనుల ద్వారా కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టులపై రాజకీయ చర్చలకంటే వాటి ద్వారా పొలాలకు నీరు చేరడమే ముఖ్యం. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించాలి.

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ఏదీ?

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామన్న హామీ అమలుకాలేదు. వ్యవసాయ కమిషన్‌ నియమించినా రాష్ట్రానికి అవసరమైన పంటలు, సాగు విస్తీర్ణం, దిగుమతుల నివారణపై సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించలేదు. కోతుల నివారణకు నిర్దిష్ట ప్రణాళిక లేదు. ఆదర్శ రైతు విధానం పునరుద్ధరణ, మండలానికి ఒక మార్కెట్‌, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో ఖాళీ పోస్టుల భర్తీ హామీలు నెరవేరలేదు. నగరాల శివారు ప్రాంతాల్లో కూరగాయలు, పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కూడా లేవు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీ కొన్ని జిల్లాల్లో ఒక్కసారి మాత్రమే అమలైంది. అనంతరం దాని ప్రస్తావనే లేదు. జనవరి 10, 2025 నాటి జీవో ఆర్‌టీ నం.42 ప్రకారం 20 రోజుల కంటే తక్కువ పని చేసిన వారికి పథకం వర్తించదని ప్రకటించడం వల్ల అర్హులైన పేదలకు ప్రయోజనం దూరమవు తున్నది. అర ఎకరం లోపు భూమి ఉన్న రైతులనూ ఈ పథకంలో చేర్చాలి. చిన్న కమతాలతో జీవనం సాగించలేక కూలీ పనులపై ఆధారపడేవారిని కూడా వ్యవసాయ సంక్షేమ విధానంలో భాగస్వాములను చేయాలి.

సంక్షోభానికి కేంద్రం విధానాలూ కారణమే!

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలూ కారణమే. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి, చట్టబద్ధ హామీ కల్పించాలన్న రైతుల డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరలేదు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లపై కార్పొరేట్ల ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నం జరిగింది. రైతుల ఆందోళనతో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నా, కార్పొరేట్‌ అనుకూల విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, పంట నష్టాలకు తగిన పరిహారం అందకపోవడం రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఎన్‌‌సిఆర్‌‌బి తాజా గణాంకాల ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా 10,546 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకు న్నారు. ఈ విషాద పరిస్థితికి పాలకుల రైతు వ్యతిరేక విధానాలు, హామీల అమలులో నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

సమగ్ర విధానం.. పోరాటమే శరణ్యం

రైతు లేకపోతే దేశమే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగాన్ని, రైతు కుటుంబాల జీవనాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, చట్టబద్ధ కనీస మద్దతు ధర, పంటల బీమా, కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతుల గుర్తింపు, పంట నష్టపరిహారం, పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితితో అమలు చేయాలి. రైతు అప్పుల ఊబి నుంచి బయటపడి, పెట్టుబడి పెట్టి, పంటకు గిట్టుబాటు ధర పొందగలిగినప్పుడే వ్యవసాయానికి నిజమైన భరోసా లభిస్తుంది. అయితే పాలకులు తమంతట తాముగా రైతుల సమస్యలను పరిష్కరిస్తారన్న ఆశతో ఎదురుచూస్తే ప్రయోజనం లేదు. హామీలు అమలు కావాలంటే రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి. పోరాటాల ద్వారానే పాలకుల మెడలు వంచి హక్కులు, హామీలు సాధించుకోవాలి.


తీగల సాగర్‌, 9490098055

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్