పిల్లల బాల్యం పేదరికం, ఆకలి, చదువుల ఒత్తిడి, వివక్ష, వేధింపుల మధ్య నలిగిపోతోంది. పాఠశాలల్లో చదువుకోవాల్సిన చేతులు కుటుంబ పోషణ కోసం పనులు చేయాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొందరు విద్యకు దూరమవుతుండగా, మరికొందరు సాంకేతిక పరిజ్ఞానం దుష్ప్రభావాలకు గురవుతున్నారు. బాలల హక్కుల గురించి మాట్లాడుతున్న సమాజంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం ఆందోళనకరం. ప్రతి సంవత్సరం నవంబర్ 14న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. పిల్లలపై ప్రేమాభిమానాలు చూపిన ఆయన బాలలే దేశ సంపద, వారి అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని భావించారు.
అయితే బాలల దినోత్సవం వేడుకలు, ఆటపాటలు, ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణ, సమాన అవకాశాలు అందుతున్నాయా అని ప్రశ్నించుకోవాలి. నేటి విద్యావ్యవస్థలో మార్కులు, ర్యాంకులే ప్రతిభకు కొలమానాలుగా మారాయి. తల్లిదండ్రుల ఆశలు, విద్యాసంస్థల పోటీ, ఇతర పిల్లలతో పోల్చడం చిన్నారులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రతి పిల్లవాడిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్య అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు.
ప్రశ్నించే తత్వం, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, మానవీయ విలువలను పెంపొందించడం కూడా అవసరం.డిజిటల్ సాంకేతికత విజ్ఞానాన్ని అందిస్తున్నప్పటికీ సెల్ఫోన్ వ్యసనం, ఆన్లైన్ ఆటలు, అనుచిత సమాచారం, సైబర్ వేధింపులు సమస్యలుగా మారుతున్నాయి. పిల్లలకు సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. పేదరికం, నిరక్షరాస్యత, అసమానతల కారణంగా బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, పోషకాహార లోపం, లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. విద్యాహక్కు, పోక్సో చట్టాల అమలును మరింత పటిష్టం చేయాలి. ప్రభుత్వాలు నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు కల్పించాలి.
తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఉపాధ్యాయులు సమానత్వం, సామాజిక స్పృహను నేర్పాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వారిలో మానవత్వం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి, పర్యావరణ స్పృహ పెంపొందించాలి. ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదు, విద్యకు దూరం కాకూడదు, వివక్షకు, వేధింపులకు గురికాకూడదు. బాలల హక్కులను కాపాడి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించినప్పుడే భావి భారతం వికసిస్తుంది.
- వై.శాంతికుమార్, 9849042083






కామెంట్లు (0)