Magazines

కార్పొరేట్లకు రాయితీలు...కార్మికులకు ఆకలి కేకలా?

27 నిమిషాల క్రితం

corporations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 6 నిమిషాల చదవడం

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, దేశ సంపదను సృష్టించే కార్మికుడి జీవితం మాత్రం కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలోనే ఉంది. ఒకవైపు కార్పొరేట్ల సంపద, లాభాలు పెరుగుతుంటే మరోవైపు కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ఆర్థికాభివృద్ధిని జీడీపీ పెరుగుదలతోనే కొలవలేం. సంపద పంపిణీ, న్యాయమైన వేతనాలు, ఉపాధి భద్రత, సామాజిక రక్షణ కూడా అభివృద్ధికి ప్రమాణాలే. కానీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నది. ఇటీవల ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) శతాబ్ది సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం వింటే కార్మికుల ఉద్యోగాలు, వేతనాలపై ఆయన ఎంతో ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది. కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించామని, ఆదాయపు పన్నులో రాయితీలిచ్చామని చెబుతూనే..


అయినా ఉద్యోగుల సంఖ్యను, వేతనాలను పెంచారా? అని సంస్థలను ప్రశ్నించారు. “ఎంతిచ్చినా మీ దాహం తీరడం లేదు” అన్నట్లుగా వ్యాఖ్యా నించారు. నిజమే.. కార్పొరేట్ల దాహం తీరడం లేదు. కానీ ఆ దాహాన్ని తీర్చేందుకు పన్ను రాయితీలు, మినహా యింపులు, ప్రభుత్వ ఆస్తుల అప్పగింతలు చేస్తున్నది కూడా ఈ ప్రభుత్వమే. బ్యాంకుల మొండి బకాయిలను భారీగా రైట్‌ఆఫ్‌ చేస్తూ కార్పొరేట్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంటే, కార్మికుడి చెమటకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. తక్కువ వేతనాలు, ఉద్యోగ అభద్రత మధ్య అతడి శ్రమను పిండుకుంటున్నారు. కార్మిక కోడ్‌ల పేరుతో హక్కులు, ఉద్యోగ భద్రతను బలహీనపరిచే విధానాలూ అమలవుతున్నాయి.ఈ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ లక్షమంది కార్మికులతో డిసెంబరు 1 నుంచి 3 వరకు ఢిల్లీలో ‘ఆక్యుపై ఢిల్లీ’ పోరాటానికి పిలుపునిచ్చింది. ఇది కేవలం నిరసన కాదు.. కార్మికుల హక్కులను కాలరాస్తే సహించబోమని, తమ శ్రమకు న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడతామని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ఐక్య హెచ్చరిక.

కార్పొరేట్ల కోసమే లేబర్ కోడ్స్

దశాబ్దాల కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో కేంద్రం నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చింది. 2019 నుంచి కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ 2025 నవంబర్ 21న వాటి అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి చట్టాల సరళీకరణ పేరుతో కార్మికుల హక్కులను బలహీనపరిచి యాజమాన్యాల అధికారాన్ని పెంచే విధానపరమైన మార్పులు. పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా సమ్మెపై ఆంక్షలు పెరగడం, కార్మిక సంఘాల గుర్తింపు, బేరసారాల శక్తి దెబ్బతినడం వంటి పరిణామాలు కార్మికుల సంఘటిత పోరాట సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి. నిర్దిష్ట పరిమితికి లోబడి ఉండే సంస్థల్లో తొలగింపులు, లేఆఫ్‌లు, మూసివేతలకు ప్రభుత్వ అనుమతి నిబంధనల సడలింపు ఉద్యోగ భద్రతను ప్రమాదంలోకి నెడుతుంది.

వేతనాల కోడ్ పరిధిలో వేతనాల నిర్వచనం, చెల్లింపుల విధానాల్లో మార్పులు కార్మికుల వేతనాలు, ఇతర ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సామాజిక భద్రత కోడ్ ద్వారా అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, సమగ్ర హామీలు, అమలు విధానం స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. వృత్తిపరమైన భద్రత కోడ్ పేరుతో పని గంటలు, పని పరిస్థితుల్లో యాజమాన్యాలకు కల్పించే వెసులుబాటు కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. 12 గంటల పని దినం వంటి ప్రతిపాదనలు కార్మికుడి విశ్రాంతి, కుటుంబ జీవితం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ మార్పులన్నీ కలిపి కార్మికుడి హక్కులు, ఉద్యోగ భద్రత, సంఘటిత శక్తిని బలహీనపరిచి కార్పొరేట్ లాభాలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

రోజుకు రూ.178తో జీవితం ఎలా?

కార్మికుడి జీవన దుస్థితికి కనీస వేతనాలే ప్రధాన నిదర్శనం. నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దె, విద్య, వైద్యం, రవాణా ఖర్చులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోర్ లెవల్ కనీస వేతనాన్ని రోజుకు రూ.178గా నిర్ణయించింది. నెలలో 26 రోజులు పనిచేసినా వచ్చే మొత్తం రూ.4,628 మాత్రమే. ఈ మొత్తంతో ఒక కుటుంబానికి ఆహారం, దుస్తులు, నివాసం, పిల్లల చదువు, వైద్యం ఎలా సమకూర్చాలి? కార్మికుడు బతకడానికి మాత్రమే కాదు, గౌరవప్రదమైన జీవితం గడప డానికి కూడా వేతనం అవసరం. డాక్టర్ ఆక్రాయిడ్ పోషకాహార ప్రమాణాలు, 15వ భారత కార్మిక సదస్సు సిఫారసులు, సుప్రీంకోర్టు రాప్టాకోస్ బ్రెట్ తీర్పు సూత్రాల ఆధారంగా కనీస వేతనం నిర్ణయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఆహారం, దుస్తులకు రూ.14,505.01, ఇంటి అద్దెకు రూ.8,288.58, ఇతర ఖర్చులకు రూ.8,288.58, పిల్లల విద్య, వైద్యం, వినోదానికి రూ.10,360.72 కలిపి నెలకు రూ.41,442.89 అవసరమవుతుందని అంచనా.


అందుకే నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు కనీసం రూ.42వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది అతిశయోక్తి కాదు, జీవన వ్యయాల ఆధారంగా చేసిన న్యాయమైన డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం జీఓ నెం.6 ద్వారా నైపుణ్యం లేని కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.14వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.16వేలు కనీస వేతనంగా నిర్ణయించినా రాష్ట్రవ్యాప్తంగా అమలు కావడం లేదు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు కూడా లేవు. మరోవైపు ఫిక్స్‌డ్ టర్మ్, డైలీవేజ్, క్యాజువల్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, సీజనల్ కార్మికులు, అప్రెంటీస్‌లు, ట్రైనీలను శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో వినియోగిస్తున్నారు. సమాన పనిచేస్తున్నా సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ లభించడం లేదు. వేతనాలు నిర్ణయించడం మాత్రమే కాదు, వాటిని కచ్చితంగా అమలు చేయించడం కూడా ప్రభుత్వ బాధ్యత.

ప్రైవేటీకరణ.. కార్మికులపై ద్వంద్వ దాడి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక చట్టాలను బలహీనపరుస్తున్న కేంద్రం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఉపాధి భద్రతను కూడా దెబ్బతీస్తున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ మొదటి దశలో 2021-25 మధ్య రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు, రహదారులు, విద్యుత్, పెట్రోలియం, సహజ వాయువు, గనులు, రైల్వేలు, నౌకాశ్రయాల వంటి కీలక రంగాల ఆస్తులను ప్రైవేటీకరణ లేదా నగదీకరణకు సిద్ధం చేసింది. ఇప్పుడు 2026-30 మధ్య రూ.16.72 లక్షల కోట్ల లక్ష్యంతో ఎన్‌ఎంపీ 2.0ను ప్రకటించింది. ప్రభుత్వరంగ సంస్థలు కేవలం వ్యాపార సంస్థలు కావు. అవి దేశ ఆర్థిక స్వావలంబనకు, ఉపాధికి, సామాజిక న్యాయానికి, ప్రజాసేవలకు ఆధారాలు. వాటిని ప్రైవేటు ప్రయోజనాలకు అప్పగించడం ద్వారా దేశ సంపదపై ప్రజల హక్కును బలహీనపరుస్తున్నారు.


ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారం చూపలేని పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మికుల నిరసనలను అణచివేయడం ద్వారా తన అధికారాన్ని నిలబెట్టు కోవాలని చూస్తున్నది. ఉత్తర భారతదేశంలోని పానిపట్, నోయిడా, మానేసర్, సూరజ్, బివండి, నీమ్రానా, ఫరీదాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం సమరశీల పోరాటాలు చేశారు. లాఠీచార్జీలు, భాష్పవాయు గోళాలు ప్రయోగించినా వెనక్కి తగ్గలేదు. సుమారు నాలుగు వందల మంది కార్మికులను అరెస్టు చేసి జైళ్లకు పంపినా ఉద్యమం ఆగలేదు. ఈ పోరాటాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కనీస వేతనాల సవరణకు కదలిక వచ్చింది. కర్నాటక, తెలంగాణల్లోనూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణకు అవకాశం ఏర్పడింది. బాలా నగర్‌లోని ఎంటీఏఆర్ పరిశ్రమలో 370 మంది ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు పదమూడు రోజుల సమ్మె ద్వారా పర్మినెంట్ ఉద్యోగాల సాధన దిశగా విజయం సాధించడం సంఘటిత పోరాట శక్తికి నిదర్శనం.

పాలకవర్గాల విధానాల్లో తేడా ఏమిటి?

కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ కార్మిక విధానాల్లో అనేక సారూప్యతలు కనిపిస్తున్నాయి. కేంద్రం నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా వాటి అమలుకు డ్రాఫ్ట్ రూల్స్ సిద్ధం చేసింది. కేంద్రం 12 గంటల పని దినం దిశగా సాగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని సవరించి పని దినాన్ని 10 గంటలుగా నిర్ణయించింది. పారిశ్రామిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కార్మికుల కోసం సమగ్ర లేబర్ పాలసీని రూపొందించలేదు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. అంగన్‌వాడీ, ఐకేపీ వీఓఏలకు రూ.18వేలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేలు, ఆశా వర్కర్లకు రూ.18వేలు ఫిక్స్‌డ్ వేతనం వంటి హామీలు ఇంకా నెరవేరలేదు. మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపు, కేటగిరీలవారీ వేతనాలు, ఖాళీ పోస్టుల్లో కుటుంబ సభ్యుల నియామకం జరగలేదు. గ్రామపంచాయతీ సిబ్బందిని పీఆర్‌సీ పరిధిలోకి తీసుకురాలేదు.


ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాల పెంపు, యూనివర్సిటీ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్‌సీ ప్రకటన పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల రద్దు, సమాన పనికి సమాన వేతనం, జీఓ నెం.6 అమలు కావడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించారు. బీడీ కార్మికుల రూ.4,016 జీవన భృతి, రూ.7వేల కనీస పెన్షన్ డిమాండ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మార్కెట్ సెక్యూరిటీ గార్డులు, కస్తూరిబా విద్యాలయ సిబ్బంది, వీఆర్‌ఏల వారసులు, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలూ పరిష్కారం కాలేదు. ఎన్నికల సమయంలో కార్మికుల మద్దతు కోరిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను ఎందుకు విస్మరిస్తున్నది? గత మూడేండ్లుగా సీఐటీయూ అనుబంధ సంఘాలు అనేక పోరాటాలు చేసినా స్పందన లేకపోవడం అసంతృప్తిని పెంచింది. రాజకీయ పార్టీలు వేరైనా కార్మిక వ్యతిరేక ఆర్థిక విధానాల్లో సారూప్యత ఉంటే వాటిని ప్రశ్నించడం కార్మికవర్గం బాధ్యత.

ఐక్య పోరాటాలే.. కార్మికవర్గ కర్తవ్యం

కార్మిక సమస్యలు కేవలం వేతనాల సమస్యలు కావు. అవి దేశ ఆర్థిక విధానాలు ఎవరి ప్రయోజనాల కోసం అమలవు తున్నాయనే మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. సంపదను సృష్టించే కార్మికుడికి న్యాయమైన వాటా, గౌరవ ప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించ కుండా అభివృద్ధి సాధ్యమని చెప్పడం అసంబద్ధం. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, నెలకు రూ.42 వేల కనీస వేతనం, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, కాంట్రాక్ట్ విధానానికి అడ్డుకట్ట, సమాన పనికి సమాన వేతనం, పెన్షన్, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగుల హోదా వంటి డిమాండ్ల సాధనకు విస్తృత ఐక్య ఉద్యమం అవసరం. చరిత్రలో కార్మికులు సాధించుకున్న ఏ హక్కూ పాలకులు స్వచ్ఛందంగా ఇచ్చినవి కాదు. ప్రతి హక్కు వెనుక సంఘటిత పోరాటం, త్యాగం, ఐక్యత ఉన్నాయి. నేటి పరిస్థితుల్లో కూడా అదే పోరాట మార్గం అవసరం. ఒక పరిశ్రమ కార్మికుడి సమస్య మరో పరిశ్రమ కార్మికుడి సమస్యతో సంబంధం లేదనుకోవడం పాలకులకు ఉపయోగపడుతుంది. కానీ అన్నిరంగాల కార్మికుల సమస్యల మూలం ఒకటే అయిన ప్పుడు వారి పోరాటం కూడా ఐక్యంగా ఉండాలి. ‘ఆక్యుపై ఢిల్లీ’ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతిగ్రామం, మండలం, జిల్లా నుంచి పెద్దఎత్తున కదలాలి. దీన్ని దేశవ్యాప్త కార్మిక ఐక్య ఉద్యమానికి మలుపుగా మార్చాలి. “పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!” అన్న కార్ల్‌‌మార్క్స్‌ నినాదాన్ని ప్రతి కార్మికుడి గొంతుకలో మారుమోగాలి. ఐక్య పోరాటాలే మన కర్తవ్యం. అవే కార్మికవర్గ విముక్తికి మార్గం!



పాలడుగు భాస్కర్‌, 9490098033

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్