నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం పరిధిలో రూ.750 కోట్ల పెట్టుబడితో 108.82 ఎకరాల్లో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఇథనాల్ పరిశ్రమ తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోజుకు 600 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 400 కిలోలీటర్ల ఇథనాల్, 200 కిలోలీటర్ల ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారీతోపాటు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఆదాయం, కొంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నప్పటికీ పరిసర గ్రామాల ప్రజల జీవనంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, పంటలు, పశుసంపద, ప్రజారోగ్యంపై ప్రభావాలను ముందుగానే అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో ప్రజల జీవనాధారాలను ప్రమాదంలోకి నెట్టకూడదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పరిశ్రమకు రోజుకు 2,800 కిలోలీటర్ల నీరు, అంటే 28 లక్షల లీటర్లు అవసరమవుతుందని ప్రాజెక్టు వివరాలను ఉటంకిస్తూ వార్తలు పేర్కొంటున్నాయి.
నీటిని కృష్ణా నది నుంచా, భూగర్భ జలాల నుంచా, ఇతర వనరుల నుంచా తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇప్పటికే తాగునీరు, వ్యవసాయ అవసరాల కోసం నీటిపై ఆధారపడుతున్న గ్రామాలకు ఇది భారంగా మారకూడదు. ఇథనాల్ తయారీలో వెలువడే స్పెంట్వాష్, ఇతర వ్యర్థ జలాలను సరిగా శుద్ధి చేయకపోతే భూగర్భ జలాలు, నేల, స్థానిక వాగులు, కృష్ణా నది కలుషితమయ్యే ప్రమాదం ఉంది. వీర్లపాలెం, పరిసర గ్రామాల్లో వరి, పత్తి సాగు చేసే రైతులకు నీరు, నేల నాణ్యత దెబ్బతింటే దీర్ఘకాలిక నష్టం తప్పదు. బాయిలర్ల పొగ, దుమ్ము, బూడిద వల్ల గాలి కాలుష్యం ఏర్పడే అవకాశాలను కూడా పరిశీలించాలి. రిజర్వ్ ఫారెస్ట్‌కు సుమారు 1.05 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమ ప్రతిపాదించిన నేపథ్యంలో అటవీ జీవవైవిధ్యంపై ప్రభావాన్ని అంచనా వేయాలి.
నవంబర్ 20న నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాసంఘాలు నిరసనలు వ్యక్తం చేయడం దీనిపట్ల వ్యతిరేకత కనిపిస్తున్నది.
పొరుగున ఉన్న గ్రామాలకు సరైన సమాచారం ఇవ్వలేదని, పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదని ఫిర్యాదు దారులు వాపోయారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలను అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కొందరు కోరారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగిందా? అన్ని ప్రభావిత గ్రామాల అభిప్రాయాలను నమోదు చేశారా? అన్నది పరిశీలించాలి. పరిశ్రమకు అనుమతులు ఇచ్చే ముందు నీటి వినియోగం, వ్యర్థాల శుద్ధి, గాలి కాలుష్య నియంత్రణ, భూగర్భ జలాల నాణ్యతపై స్వతంత్ర నిపుణులతో అధ్యయనం చేయించాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ అమలుకు హామీ ఇవ్వడంతోపాటు గాలి, నీరు, నేల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించి ఫలితాలను ప్రజలకు వెల్లడించాలి.
రూ.750 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ వస్తున్నప్పుడు స్థానిక ప్రజలకు దక్కే ప్రయోజనం ఎంతన్నది స్పష్టంగా తెలియాలి.
ఎన్ని శాశ్వత ఉద్యోగాలు, ఎన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తారు? స్థానిక యువతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? రైతుల నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తారా? రవాణా, ఇతర సేవల్లో స్థానికులకు అవకాశాలు కల్పిస్తారా? అనే ప్రశ్నలకు కంపెనీ సమాధానం చెప్పాలి. పరిశ్రమ వల్ల రైతులకు, ప్రజలకు నష్టం జరిగితే పరిహారం చెల్లించే బాధ్యతను ముందుగానే నిర్ణయించాలి. ప్రమాద బీమా, అత్యవసర వైద్య, రక్షణ ఏర్పాట్లు కూడా ఉండాలి. ప్రభుత్వం కేవలం పెట్టుబడులు, పరిశ్రమల సంఖ్యను మాత్రమే అభివృద్ధికి కొలమానంగా తీసుకోకూడదు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, తాగునీరు, సాగునీరు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమే. పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి కలగాలి. కానీ ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణాన్ని పణంగా పెట్టి అభివృద్ధి చేయడం సమంజసం కాదు.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలి.
నీటి వినియోగానికి సంబంధించి శాస్త్రీయ అధ్యయనం చేయించాలి. వ్యర్థ జలాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. పరిసర గ్రామాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానిక రైతులు, ప్రజాసంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించాలి. కంపెనీ ఇచ్చే హామీలను కాగితాలకే పరిమితం చేయకుండా అమలు జరిగేలా పర్యవేక్షణ ఉండాలి. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక యువతకు ఉపాధి కల్పనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. ప్రజల జీవన భద్రతకు భరోసా కల్పించిన తర్వాతే పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడులు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప, ప్రజల భవిష్యత్తుకే ముప్పుగా మారకూడదు.
వాడపల్లి రమేష్, 9490099432






కామెంట్లు (0)