Magazines

ఉద్యమ యోధ, ఉజ్వల మేధ - చుక్కాని రామయ్య

1 గంట క్రితం

Ramaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 5 నిమిషాల చదవడం

అలా మొదలై..

చుక్కా రామయ్య గురించి మాట్లాడుకోవడమంటే ఒక విజ్ఞాన విప్లవ సర్వస్వం ఆవిష్యరించుకోవడమే.‘‘నాటి అన్యాయాలు, అక్రమాలూ, పేదల ఆకలిబాధలు, పార్టీకోసం ప్రజలు చేస్తున్న త్యాగాలు, అమ్మ నవల, ఇతర దేశాల పోరాట విశేషాలే తెలంగాణ విముక్తి పోరాటం వైపుగా నా దృష్టిని మరల్చాయి. నేనూ పేదరికంలో పుట్టినా మా అమ్మ త్యాగాల వల్ల చదువుకు నోచుకున్నాను. నాతోటి పిల్లోళ్లు దొరల దగ్గర కూలికి వుండేవారు. వారెందుకు చదువుకోడానికి రారో నాకు అర్థమయ్యేది కాదు. పిల్లలతో ఆడుకుంటూ వారి ఇండ్లలో తిరిగేవాన్ని. వారి ఇంటి పరిస్థితులు చూశాక తెలిసొచ్చింది వారు పేదరికం వల్లనే చదవుకు దూరమయ్యారని... నాకూ ఆర్థిక ఇబ్బందులువుండె. కానీ మా అమ్మ త్యాగం వల్ల నేను విద్యావంతుడనైనా’’ వీరతెలంగాణ నాది కోసం చుక్కా రామయ్య ఇంటర్వ్య ఇలా మొదలవుతుంది.

నాటి నల్గొండ ఇప్పటి జనగామ ‌జిల్లా గూడూరులో అనంత రామయ్య-నర్సమ్మ దంపతుల సంతానమైన రామయ్య దొరవారి గడిలోని బడిలోనే చదువుకున్నాడు. పెద్ద బాలశిక్ష పూర్తి చేశాక మాష్టారు తనతో ఉత్తరాలు చదివించేవారు. అప్పట్లో అత్యధికులకు చదువు రాదు గనక ఆ మాష్టారు అందరికీ ఉత్తరాలు రాసిపెట్టే వారు. మూడవ తరగతి తర్వాత బాండు పేపర్లు కూడా చదవడం, రాయడం నేర్పించారాయన. వాటిని రాస్తున్న, వింటున్న రామయ్యకు జీవితమంటే ఏమిటో, జనం ఎన్ని బాధలతో బతుకుతున్నారో, తిండికి కూడా తిప్పలు పడుతున్నారో తెలుసుకుంటూ మదనపడుతూ పెరిగారు. అసలు చదువు, ఉత్తరాలు, బాండు పత్రాలు రాయడానికేమోననుకున్నారు. ఆయన చదువు కోసం వరంగల్‌ ‌వెళ్లడం తన వల్లకాదని నాన్న భయపడితే, తల్లి తన మెడలో కండాన్ని అమ్మి చదివిస్తానని పట్టుపట్టారు.

ఏ చోక్రా బుల్‌‌బులా...

వరంగల్‌ ‌వెళ్లాక ప్రపంచం విస్తరించింది. అణా పుస్తకాల పేరిట వచ్చే దేశాల చరిత్రలు చదువుతూ చైతన్యం పెంచుకున్నారు. ఆంధ్ర మహాసభ నిరవహించే వయోజన పాఠశాలల్లో చదవు చెప్పడం ప్రారంభించారు, వాళ్ల ఊళ్లో వున్న సంఘం మల్లయ్య ప్రేరణతో వెట్టిచాకిరీకి, దొరల పీడనకూ వ్యతిరేకంగా పోరాటం వైపు చేరారు. అప్పటి నుంచి ఆయన ‘ప్రజాశక్తి’ చదవడమే గాక చదివి వినిపించడం మొదలు పెట్టారు. అక్కడ ఆయన అమ్మ నవల చదివి వినిపించడం ఆయన బాధ్యత అయింది. ఇంత కష్టపడి చదివిన రామయ్య నిజాం పోలీసులు రజాకార్ల దాడుల మధ్య1947 తర్వాత పూర్తికాలం ఉద్యమంలోకి దూకారు. సివిల్‌ ‌ మిలటరీ విభాగాల మధ్య ఆయన సివిల్‌‌ విభాగంలో పనిచేశారు. నెత్తిమీద సైక్లో మిషన్‌‌పెట్టుకుని ఊరూరా తిరుగుతూ కరపత్రాలు, కాపీలు తీసి పంచడం ఆయన దళం పని. ఒకసారి వాళ్లను పోలీసులు వెంటాడితే పొలాల్లోకి పారిపోతూ మిషన్‌ అక్కడ పడేశారు.

దాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు.18 ఏండ్ల వయసున్న చుక్కా రామయ్యను అరెస్టు చేసి విపరీతంగా కొడితే నాలుగు పండ్లు ఊడిపోయాయి. ఇప్పటికీ ఒక పన్ను సరిగా లేదని చూపించేవారు. ఆయనను ఎంతకొట్టినా నోరు విప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశారు. దాంతో ఇన్‌‌స్పెక్టర్‌ ఏ చౌకరా బుల్‌‌బులా మాలుం హోతాహై(పిల్లాడే గానీ అతికం మనిషిలా వున్నాడు)అంటూ మిగతా ఖైదీల నుంచి విడదీసి ఒంటరిగా సెల్లులో పెట్టారు. నల్గొండ జైలుకు, అక్కడినుంచి చంచల్‌‌గూడాకు, తర్వాత ఔరంగాబాద్‌ ‌జైలుకు పంపించారు. ఔరంగాబాద్‌ ‌జైలర్‌ ‌బిడ్డకు లెక్కలు చెబితే బయటకువెళ్లి విషయాలు చేరవేసే అవకాశం వస్తుందని నచ్చచెప్పడంతో ఒప్పుకున్నారు. ఏడాదిన్నర జైలు జీవితం గడిపి బయటకొచ్చారు

స్వయం కృషి..సంఘం..

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని లెక్కల మాష్టారయ్యారు. అప్పుడే పిల్లలకు సరైన తిండి లభించని పరిస్థితులు గమనించి విద్యార్థులే సమిష్టిగా నిర్వహించుకునే హాస్లళ్లు ప్రవేశపెట్టారు. టీచర్‌‌గా పనిచేస్తూనే పిజి పూర్తిచేసి లెక్చరర్‌‌గా మారారు. 1983లో నాగార్జున సాగర్‌ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్‌‌గా పనిచేసి మరెవరికైనా అవకాశం ఇవ్వచ్చని కాస్త ముందుగానే పదవీ విరమణ చేశారు. జీవితమంతా ఉపాధ్యాయ సంఘాలతో ముడిపడిన చుక్కారామయ్య 1984లో యూటీఎఫ్‌ ‌తరపున శాసన మండలికి పోటీ చేశారు. పీఆర్టీయూ అభ్యర్థి ధర్మారెడ్డిపై ఓడిపోయిన రామయ్య మళ్లీ వివిధ సంఘాల మద్దతుతో 2007లో ఆయనపైనే గెలవడం ఆసక్తికరమైన విషయం. సుప్రసిద్ధుడైన చుక్కారామయ్యను గవర్నర్‌ ‌కోటాలో నామినేట్‌ ‌చేయడానికి ప్రతిపాదనలొచ్చినా తాను ఎన్నికల ద్వారానే వెళ్లాలని భావించేవారు. అనేకమంది ముఖ్యమంత్రు లతో పనిచేశారు. విద్యారంగ సంస్కరణలు, ఉపాధ్యాయులు అధ్యాపకుల హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలపైనా ముందుండి పోరాడారు. ఉమ్మడి రాష్ర్ట శాసనమండలిలో పీపుల్స్‌ ‌డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ‌చైర్మన్‌‌గా వున్న సభ్యులందరూ తనకన్నా చిన్నవారైనా ఆయన అందరినీ కలుపు కుంటూ అత్యంత క్రమశిక్షణగా వ్యవహరించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వెనకబాటును స్వయంగా చూసిన ఆయన, తెలంగాణ ఏర్పాటుతో విధానాలు మారాలనీ, వికాసం జరగాలని బలంగా కోరుకు న్నారు. ఉద్యమానికి గట్టిగా అండగా నిలబడ్డారు.

ఐఐటికి చుక్కానిగా

విద్యాపరంగా చూస్తే కుమార్తె ఐఐటిలో సీటు తెచ్చుకున్నప్పుడు తెలుగువారు చాలా తక్కువగానే ఐఐటిని చేరుకుంటున్నట్టు చుక్కా రామయ్య గమనించారు. అంటే అచ్చంగా తన చిన్నతనంలో చదువుకోలేని పిల్లలను చూసినప్పుడు కలిగిన భావనతోనే ఐఐటి శిక్షణ మొదలుపెట్టారు. నిజానికి 1970లలోనే కోచింగ్‌ ‌సెంటర్లు మొదలైనాయి, అవి నెమ్మదిగా ప్రైవైటు కాలేజీలుగా యూనివర్సిటీలుగా మారాయి. ఇవన్నీ చూస్తున్న చుక్కా రామయ్య అందుకు భిన్నమైన పంథాలో సామాన్యులకు సాంకేతిక విద్యా విజ్ఞానాలు అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. రామయ్య ఇన్‌‌స్టిట్యూట్‌ ఐఐటికి పర్యాయపదంగా మారింది. మిగిలింది అందరికీ తెలిసిన చరిత్రే.

తెలుగునాట ఏ ఊరికి వెళ్లినా ఆయన దగ్గర చదువుకున్న వారు ఉన్నత పదవుల్లో, సంస్థల్లో, పదవుల్లో కనిపిస్తారు. జీవితంలో బాగా విజయాలు సాధించిన చాలామంది ఉద్యమాల్లో కొనసాగే వారిని, మరీ ముఖ్యంగా కమ్యూనిస్టులను గురించి తెలిసితెలియని మాటలు వినిపిస్తుం టారు. కానీ జీవితాన్ని కాచి వడబోసిన చుక్కా రామయ్య మాత్రం ఉద్యమాలను అమితంగా, గౌరవంగా చూస్తారు. ప్రజాస్వామిక శక్తులను వ్యక్తులను, మరీ ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం బాధ్యతగా చేసుకున్నారు. పిల్లలనైతే వదలిపెట్టరు. మార్కులు ర్యాంకులు ఉద్యోగా లను బట్టి గాక మనుషుల సహజ ప్రతిభను వెలికితీయాలనేది ఆయన ఒరవడి. వయసుతో నిమిత్తం లేకుండా, నిత్యనూతనోత్సాహంతో నేర్చుకుంటూ నేర్పుతూ క్రియాశీలంగా గడపడమే ఆయన్ను ఇంత అరుదైన వ్యక్తిగా చేసింది.

బలమైన భావాలతో..

ఇంత మృదువైన రామయ్య నియమ నిబంధనల విషయంలో, తన సంస్థ ప్రవేశాలలోనైనా తన ఆశయాల నిబద్దతలోనైనా రాజీ పడటం ఉండదు. కొన్ని వ్యక్తిగత నమ్మకాలను ఆయన వదులుకోలేదు. అపృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రాహ్మణ సమాజం వారి కుటుంబాన్ని వెలివేసినా జంకలేదు. సామాజిక విషయాలలో వారి నడవడికే కొలబద్ద తప్ప, కొంతమంది భావిస్తున్నట్టు సామ్యవాద భావజాలం అనుసరించేవారు, సంప్రదాయం పట్ల గౌరవం పాటించకూ డదనేమీ లేదు. నిజమైన సంప్రదాయం సమానత్వం కోరుతుందంటారు. తన భావాలు ఎవరిమీద రుద్దకుండా, సమరాం గణంలో, చదువుల్లో, ఎన్ని వేలమందిని నడిపించారో, ఎన్ని వందల సంస్థల ప్రారంభానికి ప్రేరణ అయ్యారో చెప్పలేము. ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా సహాయపడే మనస్తత్వం. మరీ ముఖ్యంగా మహిళల పట్ల గౌరవాభిమానాలు ఆయన సహజ లక్షణాలు.

ఇటీవలి దాకా కూడా సభలూ సమావేశాలకు పెద్ద వయసులోనూ ఓపిగ్గా హాజరవడం, అందరితో కలసి మెలసి వుండటానికే. అలా అని తన పరిచయాలను పలుకుబడిని స్వంతానికి ఎన్నడూ ఉపయోగించిన దాఖాలాలూ, వివాదాలు అస్సలుండవు. వ్యక్తిగతంగా మా కుటుంబ మిత్రులు కూడా. ఇంతగొప్ప ఉపాధ్యాయుడైన రామయ్య మా నాన్న నరసింహయ్యను కలిసినప్పుడు ఆయన మొదట్లో అర్థశాస్ర్త పాఠాలు గుర్తుచేసి వినయం చాటుకున్నారు. ఎంత అనుభవం వున్నా ఫోన్‌ ‌చేసి ఫలానా రెపరెన్స్‌ ‌కావాలని సమాచారాలు సేకరించుకుని వెళ్లిన సందర్భాలెన్నో. చుక్కా రామయ్య సతీమణి కీ.శే.లక్ష్మీబాయి, కుమారులు శ్రీనివాస్, అచ్యుత్. కుమార్తెలు ఉమ,రాజేశ్వరి. పిల్లలుకూడా ఆయన కృషికి అమోఘంగా సహకరించడం అందరికీ తెలుసు. ఈ మొత్తం కృషిలో సంస్థలు, వ్యక్తిగత సహాయకులు, కొందరుమిత్రులు తనకు ఎంతో ప్రేమగా సేవలందిస్తున్నా రనేది గుర్తుంచుకోవాల్సిందే.

లివింగ్‌ ‌లెజండ్‌...

ప్రజాశక్తి పత్రికతో, (తర్వాత నవతెలంగాణతో) పుస్తక ప్రచురణా లయంతో చుక్కా రామయ్య అనుబంధం సుదీర్ఘమైంది. నలభైలలో అది మొదలై నేటికీ నడుస్తున్నది. దాని ఎదుగుదలను చూస్తూ రజతోత్సవం వంటివాటిలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ వస్తున్నారు. సునిశితంగా చదువుతారు. ఆమూలాగ్రం చదవడం, విధానాలు తెలుసుకుంటూ కాస్త సందేహం వచ్చినా నివృత్తి చేసుకోవడం, ఏదైనా తేడా ఉంటే సూటిగా చెప్పేసి నిర్ణయాలకు కట్టుబడి నిష్కర్షగా వ్యవహరిస్తారు. ప్రజాశక్తిలోనే గాక అన్ని పత్రికల్లోనూ కాలమ్స్‌ ‌రాశారు. టీవీలు, చానళ్లు వచ్చాక చర్చలలో పాల్గొంటూ విలువైన విశ్లేషణలు, అనుభవాలు అందిస్తుంటారు. వాటిలో సామాజికాంశాలు గణితం కూడా వుంటాయి.

ఎక్కడకు వెళ్లినా ముందు విద్యాలయాలు పరిశీలిస్తారు. దేశదేశాల విద్యా విధానాలు ఆయన ప్రత్యేకాసక్తి. అవన్నీ రాశారు. పుస్తకాలుగా వచ్చాయి. తెల్లటి దుస్తులతో వినమ్రంగా నమస్కారం చేసి పలకరిస్తారు. ఇప్పుడు వయోభారంతో మాట్లాడటం బాగా తగ్గించినా నమస్కారంగా ఆహ్వానించడం మాత్రం మానలేదు. అందుకే అన్ని విధాల చుక్కా రామయ్య గారు ఒక లివింగ్‌ ‌లెజండ్‌. మనకాలపు మహోదాత్త మూర్తి, మహత్తర స్ఫూర్తి.


తెలకపల్లి రవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్