వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటి గడ్డ అయిన నల్గొండలో ఈసారి అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న ఈ సభకు లక్ష మంది రైతులు, ఎనిమిది వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారతీయ కిసాన్ సభ అనేది భారతదేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతుల హక్కుల కోసం స్థాపించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి అఖిల భారత రైతు సంఘం. 1929లో స్వామి సహజానంద సరస్వతి బీహార్‌లో స్థాపించిన బీహార్ ప్రావిన్షియల్ కిసాన్ సభ ద్వారా ఈ సంఘం ఏర్పడింది. జమీందార్ల అణచివేతకు వ్యతిరేకంగా రైతులను సమీకరించడానికి ఇది ఉద్దేశించబడింది. 1935లో దక్షిణ భారత రైతులు, వ్యవసాయ కార్మికుల సమాఖ్యకు చెందిన ప్రొఫెసర్ ఎన్.జి. రంగా, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్ వంటి నాయకులు దేశవ్యాప్త రైతు సంఘం అవసరాన్ని ప్రతిపాదించారు.
దీని ఫలితంగా 1936లో లక్నోలో ఈ సంఘం ఆవిర్భవించింది. సంఘం మొదటి అధ్యక్షునిగా స్వామి సహజానంద సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ ఎన్.జి. రంగా బాధ్యతలు చేపట్టారు. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, ఇందులాల్ యాజ్ఞిక్, పుచ్చలపల్లి సుందరయ్య, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి ప్రసిద్ధ సోషలిస్టు, కమ్యూనిస్టు నాయకులు ఇందులో చురుగ్గా పాల్గొన్నారు.
తొంభై ఏండ్ల చరిత్ర ఉన్న ఈ సంఘం భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన చారిత్రాత్మక రైతు తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది.1946–1951 మధ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. నిజాం నవాబు, దేశ్‌ముఖ్‌ల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ వీరోచిత పోరాటంలో కిసాన్ సభ కీలక పాత్ర పోషించింది. దాదాపు 3000 గ్రామాల్లో రైతు రాజ్యం ఏర్పడి, పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపకం జరిగింది.ఇక బెంగాల్ లో తెభాగ ఉద్యమం, పండిన పంటలో మూడొంతుల్లో రెండొంతులు కౌలు రైతులకు దక్కాలని జరిగిన చారిత్రాత్మక ఉద్యమం.
పున్నప్ర-వాయిలార్ పోరాటం ఇది కేరళలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం ,ఇది కూడా చరిత్రలో నిల్చిపోయింది. ఈ పోరాటాలన్నీ ఏఐకెఎస్ నాయకత్వంలో జరగటం గమనార్హం. ఇలా తొమ్మిది దశాబ్దాలుగా రైతుల పక్షం నిల్చి కిసాన్ సభ రాజీలేని పోరాటాలు చేస్తూ వస్తోంది. గత దశాబ్ద కాలం పైగా మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధాలను తిప్పికొడుతూ ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తోంది.
దేశ రైతాంగం నడ్డి విరిచేలా 2020 లో మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వీటిని పూర్తిగా ఉప సంహరించుకోవాలని, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని, ప్రతి పాదిత విద్యుత్తు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లతో రైతాంగం ఏడాది పాటు ఢిల్లీలో ఉద్యమం చేసింది. దేశ స్వాతంత్రానంతరం జరిగిన అతిపెద్ద రైతు ఉద్యమంగా ఇది చరిత్రకెక్కింది. ఏడాది పాటు జరిగిన ఈ ఉద్యమంలో వందకు పైగా రైతు సంఘాలు ‘‘సంయుక్త కిసాన్ మోర్చా’’గా ఏర్పడి నడిపిన ఉద్యమంలో కిసాన్ సభ నిర్వహించిన పాత్ర మరువ లేనిది.
ఈ రైతు పోరాటానికి మోడీ ప్రభుత్వం తలొగ్గి 2021 నవంబర్ 19న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఇంతటి ఘనమైన వారసత్వాన్ని నేటికీ కొనసాగి స్తూనే ముందుకు సాగు తోంది ఈ సంఘం. దేశవ్యాప్తంగా ఉన్న 1.58 కోట్ల సభ్యత్వంతో ఈసారి మహాసభలు జరగనున్నాయి. దేశం లో నెలకొన్న కరువు పరిస్థితులు, పెరిగిన సాగు ఖర్చులు, రైతుల సంక్షోభంపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందిం చుకొనేందుకు సమాయత్తమవుతోంది. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చట్టబద్ధమైన గ్యారెంటీ సాధించడం కోసం కూడా చర్చలు జరపనుంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించే బడ్జెట్‌ను క్రమంగా తగ్గిస్తోంది, కేవలం 2.7శాతం మత్రమే బడ్జెట్లో కేటాయింపులు జరిగాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పక శంకిచాల్సి వస్తుంది. యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యవసాయానికి ఇచ్చే ప్రభుత్వ మద్దతు, రాయితీలు చాలా స్వల్పంగా ఉన్నాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకునే వాణిజ్య ఒప్పం దాలపై కూడా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే, అమెరికా నుంచి భారీగా సబ్సిడీలు పొందిన డెయిరీ , పౌల్ట్రీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోకి చౌకగా దిగుమతి అవుతాయి. దీనివల్ల మన దేశంలోని కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతుల, పాడిరైతుల జీవనోపాధి దెబ్బతినక తప్పదు.ఇక కార్పొరేట్ శక్తులకు చెందిన వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ (పద్దుల్లోంచి తొలగించడం) చేస్తున్న ప్రభుత్వాలు, దేశానికి అన్నం పెట్టే రైతుల రుణాలను మాఫీ చేయడానికి మాత్రం ససేమిరా అంటున్నాయి. కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను నిలిపివేసి, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ ఒకేసారి సమగ్ర రుణ ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని ఏఐకేఎస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.వీటన్నింటిపై కూడా మహాసభల్లో సమగ్రంగా చర్చించే అవకాశం కన్పిస్తోంది.
భారతదేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చ డానికి కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ‘‘రైతులపై జాతీయ కమిషన్’’ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2004 నుండి 2006 మధ్య కాలంలో ఐదు సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికల్లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్య సిఫార్సులను కేంద్రం అమలు చేసిన దాఖలాలు లేవు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో అత్యంత కీలకమైనది పంటల మద్దతు ధరల గుర్తింపు. రైతులు పండించే పంటల సగటు సమగ్ర ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని కమిషన్ స్పష్టం చేసింది.ఇలా రైతుల సంక్షేమం కోసం స్వామినాథన్ చేసిన సిఫార్స్ లను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం వల్లే దేశ రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వీటి అమలు కోసం ఏఐకెఎస్ ఎప్పటి నుంచో కేంద్రం పై ఒత్తిడి తెస్తోంది.
ఈ అంశం కూడా సభ ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. గత మూడేండ్ల రైతు ఉద్యమ ప్రయాణాన్ని సమీక్షించుకొని, రాబోయే రోజుల్లో స్వతంత్ర, ఐక్య పోరాటాలను ఉదృతం చేయడం, దీనిలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 26న దేశవ్యాప్తంగా చేపట్టబోయే భారీ నిరసన రోడ్డు మ్యాప్‌ను కూడా ఈ సభలో ఖరారు చేయను న్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భం గా ఖమ్మంలో 1989 ఏప్రిల్ 27 నుండి 30 వరకు జరిగిన 26 వ జాతీయ మహా సభలను ఒకసారి గుర్తుచేసు కోవాలి. అప్పుడు 26వ సభ ఖమ్మంలో జరిగితే ఇప్పుడు 36వ సభ నల్గొండలో జరగబోతోంది. ఈ రెండు ప్రాంతా లు కూడా ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా నికి ఆయువుపట్టుగా నిలిచినవే. రైతే రాజు,రైతే దేశానికి వెన్నెముక లాంటి పడిగట్టు పదాలతో దశాబ్దాలుగా పాలకపార్టీలు దేశ రైతాంగాన్ని వంచిస్తూ వస్తున్నాయి. ఈ మహాసభల నుంచి నిర్ధిష్టమైన విధానాలతో భవిష్యత్ కార్యాచరణను రూపొందించు కుని, ఘనమైన చరిత్ర ఉన్న ఏఐకేఎస్ ముందుకు సాగాలని కోరుకుందాం.
పి.వి.రావు, 9010153065







కామెంట్లు (0)